ప్రైవేటుకు పత్తి అమ్మొద్దు
సాక్షి, హైదరాబాద్: రైతులు తాము పండించిన పత్తిని ప్రైవేటు వ్యాపారులకు అమ్మకుండా విస్తృత ప్రచారం చేయాలని రాష్ట్ర మార్కెటింగ్ శాఖ మంత్రి టి.హరీశ్‌రావు మార్కెటింగ్ అధికారులను ఆదేశించారు. మార్కెటింగ్ శాఖ పరిధిలోని వివిధ అంశాలపై మంత్రి శుక్రవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. మార్కెటింగ్ శాఖ డైరక్టర్ డాక్టర్ శరత్, అదనపు డైరక్టర్ లక్ష్మీబాయి, ఓఎస్‌డీ జనార్దన్‌రావు పాల్గొన్న ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై మంత్రి ఆదేశాలు జారీ చేశారు. పత్తి కొనుగోలుకు సీసీఐ 84 కేంద్రాల ఏర్పాటుకు హామీ ఇవ్వగా, 83 కేంద్రాలు తెరవడంపై మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రైవేటు వ్యాపారులకు పత్తి అమ్మితే జరిగే నష్టంతో పాటు, సీసీఐ కొనుగోలు కేంద్రాలు పత్తిని తీసుకు రావడంపై శాస్త్రీయంగా అవగాహన కల్పించాలన్నారు.
రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ పండ్ల మార్కెట్‌ను కోహెడ్ వద్ద గుర్తించిన ప్రదేశానికి తరలించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలో ప్రస్తుత మార్కెట్ సరిపోవడం లేదని.. అడ్లూర్‌లో నిర్మాణంలో వున్న నూతన యార్డును ప్రారంభించి తరలించాల్సిందిగా సూచిం చారు. ప్రస్తుతమున్న మార్కెట్ యార్డు ఆవరణలో కూరగాయల మార్కెట్ ఏర్పాటు చేయాలని మంత్రి హరీశ్ సూచించారు. బోయిన్‌పల్లి, వంటిమామిడి, వరంగల్‌లో నిర్మించ తలపెట్టిన కోల్డ్‌స్టోరేజీల పురోగతిపై సమీక్షించడంతో పాటు.. వరంగల్ జిల్లా కలెక్టర్ వాకాటి కరుణతో ఫోన్‌లో మాట్లాడారు. వరంగల్‌లో నిర్మిం చనున్న కోల్డ్‌స్టోరేజీ, పండ్ల మార్కెట్‌కు స్థలా న్ని మార్కెటింగ్ శాఖకు అప్పగించాలన్నారు.
హమాలీలకు యూనిఫారాలు
మార్కెటింగ్ శాఖ ద్వారా యార్డుల్లో పనిచేసే హమాలీలకు తక్షణమే యూనిఫారాలు అందజేయాలని మంత్రి ఆదేశించారు. హమాలీకు నిర్వహించాల్సిన ఆరోగ్య, శిక్షణ శిబిరాలను త్వరగా నిర్వహించాలన్నారు. డిసెంబర్ 30 నాటికి హమాలీలకుద్దేశించిన బీమా కార్యక్రమాన్ని పూర్తి చేయాలన్నారు. రాష్ట్రంలో గుర్తిం చిన 44 మార్కెట్ యార్డుల కంప్యూటరీకరణ వేగంగా పూర్తి చేయాలన్నారు. ఇందుకవసరమైన టెండర్ ప్రక్రియను చేపట్టాలన్నారు.