సాక్షి, సిద్దిపేట: ఏడు దశాబ్దాలుగా కుంభకర్ణ నిద్రలో ఉన్న కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు రైతుల గురించి, తాము వారికి అందజేసే సహాయం గురించి మాట్లాడటం సిగ్గుచేటని మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. శనివారం సిద్దిపేట జిల్లాలో ఆయన రైతుబంధు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో మంత్రి మాట్లాడారు. సీఎం కేసీఆర్ రైతు సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. ఇంతకాలం రైతులు పెట్టుబడి కోసం వడ్డీ వ్యాపారుల చుట్టూ తిరిగేవారని, ఇప్పుడు ప్రభుత్వం సాగుకు ముందే డబ్బులు ఇవ్వడాన్ని చూసి యావత్తు రైతాంగం పండగ చేసుకుంటోందని చెప్పారు. దీంతో తమ అడ్రస్ గల్లంతు అవుతుందని భయపడుతున్న కాంగ్రెస్ నాయకులు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని ఎద్దేవా చేశారు.
ఈ పథకం ద్వారా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జానారెడ్డిలకు కూడా చెక్కులు ఇస్తామని తెలిపారు. కాగా, గల్ఫ్ దేశాలతోపాటు ఇతర ప్రాంతాలకు వలసవెళ్లిన రైతులకు కూడా పెట్టుబడి సాయం చెక్కులు ఇచ్చే ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన వెల్లడించారు. ప్రభుత్వం అందజేసే పెట్టుబడి సాయంతో పెద్ద రైతులకే లాభం చేకూరుతుందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శలు చేయడం అర్థరహితం అన్నారు. రాష్ట్రంలో 90.5 శాతం మంది రైతులు ఐదు ఎకరాల లోపు ఉన్నవారే అని, 7.7 శాతం మంది 10 ఎకరాలలోపు ఉన్న రైతులు ఉన్నారని హరీశ్‌రావు లెక్కలు చెప్పారు.
కొడుకా ఎట్లున్నవ్?
‘కొడుకా ఎట్లున్నవ్.. చచ్చి నీ కడుపున పుడతా బిడ్డ. ఇంతకు ముందు సర్కార్లు రైతులకు డబ్బులు ఇవ్వడం చూడలేదు. అంతా మా దగ్గరే తీసుకునేటోళ్లు. నా కష్టానికి చెక్కు ఇయ్యనీకి వచ్చినవా..’అంటూ ఓ వృద్ధురాలు మంత్రి హరీశ్‌రావుతో తన ఆనందాన్ని పంచుకుంది. సిద్దిపేట జిల్లా నంగునూర్ మండల పరిధి బద్దిపడగలో రైతుబంధు చెక్కులు, పాస్‌పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో మంగమ్మ అనే వృద్ధురాలు హరీశ్‌రావుతో ఇలా ఆప్యాయంగా మాట్లాడింది.
– సాక్షి, సిద్దిపేట
Comments
Please login to add a commentAdd a comment