సభలో మాట్లాడుతున్న మంత్రి హరీశ్‌రావు
సంగారెడ్డి రూరల్/సదాశివపేట రూరల్(సంగారెడ్డి): ఆరుగాలం కష్టపడి పంటలను సాగు చేసే రైతన్నలను ఆదుకునే సదుద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుబంధు పథకం ద్వారా ఎకరాకు రూ.8 వేలు చెల్లిస్తుంటే ఓర్వలేని కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శలు చేస్తున్నారని నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి మండలం చిద్రుప్ప, సదాశివపేట మండలం మద్దికుంట గ్రామాల్లో శుక్రవారం ఆయన రైతుబంధు చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ పాలనలో రైతులను ఏనాడూ పట్టించుకున్న పాపాన పోలేదన్నారు.
దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఇలాంటి పథకాలను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. రైతుబంధు పథకానికి ఏడాదికి రూ.12 వేల కోట్లు ఖర్చవుతున్నప్పటికీ తమ ప్రభుత్వం ఉన్నంత వరకు అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఈ విషయంలో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి ఎలాంటి అనుమానాలు అవసరం లేదన్నారు. తమ ప్రభుత్వానికి ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకే కాంగ్రెస్ నాయకులు చౌకబారు విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. సీఎం కేసీఆర్ రైతు పక్షపాతి అని, రైతును రాజును చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారని అన్నారు.
రైతులు అందుకున్న చెక్కుల కాలపరిమితి మూడు నెలలు ఉంటుందని, తొందరపడి అందరూ ఒకేసారి బ్యాంకులకు వెళ్లకుండా విడతల వారీగా వెళ్లి నగదు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే చింతాప్రభాకర్, ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి, నిఖిల తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment