సాక్షి ప్రతినిధి, గుంటూరు : పత్తి కుంభకోణం కాయకష్టం చేసే కార్మికుల్లోనూ చిచ్చుపెట్టింది. సీజన్‌లో రావాల్సిన కూలి డబ్బులు సైతం రాకుండా చేసింది. సీసీఐ బయ్యర్లు, మార్కెటింగ్ శాఖ సిబ్బంది మిలాఖత్ కావడమే ఇందుకు కారణం. పత్తి బయ్యర్లకీ, యార్డులో ముఠా కూలీలకు, హమాలీలకు ఏమిటీ సంబంధం అనుకుంటున్నారా? ఇదిగో ఇలా... భారత పత్తి సంస్థ (సీసీఐ) నిబంధనల ప్రకారం రాష్ట్రంలో ఏమూల పత్తి కొన్నా అది ఆయా ప్రాంతాల్లోని వ్యవసాయ మార్కెటింగ్ యార్డుల్లోని కొనుగోలు కేంద్రానికి చేరాలి.
వచ్చిన లారీల్లోని పత్తి బోరాలను కార్మికులు దిగుమతి చేసి, కాటా వేసిన తరువాత ఎగుమతి చేస్తారు. రాష్ట్రంలో ఈ ఏడాది 43 పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటయ్యాయి. ఒక్కో కేంద్రంలో సగటున 25 నుంచి 30 మంది వరకు కూలీలు (తూకం వేసే వారితో సహా) ఉంటారు. నాలుగు డబ్బులొచ్చే సీజన్ ఇదే వాళ్లకి. రోజుకు సగటున 400 రూపాయల కూలి వస్తుంది.
మరేం జరిగింది...?
సీసీఐ ఈ ఏడాది సుమారు 93.65 లక్షల క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేసింది. లెక్కప్రకారం ఇదంతా మార్కెటింగ్ యార్డులకు వచ్చి అక్కడి నుంచి జిన్నింగ్ మిల్లులకు చేరాలి. అలా జరగడానికి బదులు కేవలం 30 శాతమే అంటే 28 లక్షల క్వింటాళ్లు మాత్రమే రావడంతో కార్మికుల పాలిట సీజన్ కుదేలయింది. మిగతా 70 శాతం నేరుగా జిన్నింగ్ మిల్లులకు చేరింది. దీనివల్ల 90 రోజుల పాటు పని ఉంటుందనుకున్న కార్మికులకు నిరాశే మిగిలింది.
4.5 కోట్ల రూపాయల కూలి డబ్బులకు రెక్కలు...
రాష్ట్రంలోని కొనుగోలు కేంద్రాల్లో రోజుకు సుమారు 13వందల మంది కార్మికులు పనిచేశారు. 90 రోజుల పాటు పని ఉంటుందనుకుంటే రోజకు రూ.400 చొప్పున రూ.4.65 కోట్ల రూపాయలు రావాలి. కానీ వచ్చింది మాత్రం కేవలం కోటిన్నరే. ఇంకా కచ్చితంగా చెప్పాలంటే రూ.1,54,80,000లను మాత్రమే. మిగిలిన రూ.3.10 కోట్ల రూపాయలు కాకిలెక్కలకు పరిమితమైంది. ఈమేరకు రికార్డులు సృష్టించి మార్కెటింగ్ శాఖ, సీసీఐ సిబ్బంది, బయ్యర్లు మింగేశారు.
రికార్డులు సృష్టించారిలా... జిన్నింగ్ మిల్లులకు తరలించిన 65.65 లక్షల క్వింటాళ్ల పత్తిని సీసీఐ కొనుగోలు కేంద్రాలకు వచ్చినట్టు, దాన్ని దిగుమతి, ఎగుమతి చేసినట్టు రికార్డులు సృష్టించారు. క్వింటాల్‌కు 5 నుంచి 9 రూపాయల మధ్య రాసుకుని సీసీఐ నుంచి రాబట్టుకుని స్వాహా చేశారు.
కూలీల సంఘాలనే చీల్చారు...
ఈ విషయం తెలిసిన కార్మికులు తామసలు యార్డుల్లో ఎగుమతి, దిగుమతే చేయలేదని అడ్డం తిరిగారు. దీనివెనుకేదో మతలబు ఉందని గ్రహించి ఆందోళనకు దిగారు. ఈ విషయం బయటకు పొక్కకుండా బయ్యర్లు కొంత మొత్తాన్ని తమ అనుయాయులుగా ఉన్న కార్మికులకు ముట్టజెప్పి సద్దుమణిగేలా చేయాలని చూశారు.
దీనికి కొందరు అంగీకరించకపోవడంతో అసలు సంఘాన్నే చీల్చారు. గుంటూరు మార్కెట్ యార్డులో జరిగిన సంఘటనే దీనికి ప్రత్యక్ష సాక్ష్యం. 3 లక్షల క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేసినట్టు లెక్కల్లో చూపితే ఓ వర్గం ముఠా కూలీలు వ్యతిరేకించారు. దీంతో అధికారులు ఆ సంఘంలోనే కొంత మందిని ఉసికొల్పి వారి మధ్యే గొడవ పెట్టించారు. దీంతో ఓవర్గం కూలీలు బజారున పడి ధర్నా చేయకతప్పలేదు. తెలివిగల పెద్దలు రంగంలోకి దిగి ఇరువర్గాల నోళ్లు మూయించేలా చెరికొంచెం ముట్టజెప్పి రాజీ కుదర్చడం కొసమెరుపు.
బొక్కింది..మూడు కోట్లు
Published Tue, May 19 2015 4:37 AM | Last Updated on Sun, Sep 3 2017 2:17 AM
Advertisement