గుంటూరు మార్కెట్‌కు 'మిర్చి' వెల్లువ | Mirchi Flow To Guntur Market From Rayalaseema | Sakshi
Sakshi News home page

గుంటూరు మార్కెట్‌కు 'మిర్చి' వెల్లువ

Apr 8 2021 2:57 AM | Updated on Apr 8 2021 2:57 AM

Mirchi Flow To Guntur Market From Rayalaseema - Sakshi

గుంటూరు మార్కెట్‌ యార్డులో నిండిపోయిన మిర్చి టిక్కీలు

సాక్షి, అమరావతి బ్యూరో: రాయలసీమ తదితర జిల్లాల నుంచి గుంటూరు మార్కెట్‌ యార్డుకు భారీగా మిర్చి తరలివస్తోంది. ఆది, సోమ, మంగళవారాల్లో వరుసగా మూడు రోజులు సెలవులు రావడం, రైతులు పెద్దఎత్తున మిర్చి బస్తాల్ని తీసుకు రావడంతో 3.6 లక్షల బస్తాలతో మార్కెట్‌ యార్డు నిండిపోయింది. దీనివల్ల కొనుగోలు చేసిన సరుకుని బయటకు తరలించడం, బయటి నుంచి సరుకును లోనికి తీసుకు రావడానికి తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. దీంతో బుధవారం వేకువజాము నుంచి ఉదయం 10 గంటల వరకు ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. పరిస్థితిని చక్కదిద్దేందుకు మార్కెట్‌ యార్డు అధికారులు, సిబ్బంది చర్యలు చేపట్టినప్పటికీ సాయంత్రానికి యార్డు ఆవరణలో 2.90 లక్షల బస్తాల సరుకు ఉండిపోయింది. దీంతో కొనుగోలు చేసిన సరుకును బయటకు తరలించేందుకు వీలుగా గురువారం మార్కెట్‌ యార్డుకు సెలవు ప్రకటించారు. రైతులెవరూ ఆందోళన చెందవద్దని, హడావుడి లేకుండా మిర్చి బస్తాలను యార్డుకు తరలించుకోవాలని అధికారులు సూచించారు.  

స్థిరంగా ధరలు
గత ఏడాదితో పోలిస్తే మిర్చి ధరలు ఆశాజనకంగానే ఉన్నాయి. గుంటూరు మార్కెట్‌లో తేజ డీలక్స్‌ రకం క్వింటాల్‌ రూ.15,200, కర్ణాటక డబ్బీ బాడిగ రకం రూ.29 వేలు, బాడిగ రకం రూ.17 వేల నుంచి రూ.18 వేలు, నంబర్‌–5 రకం రూ.13,500, 341 రకం రూ.14 వేలు, 334 రకం రూ.11 వేలు, సూపర్‌–10 రకం రూ.11 వేల వద్ద స్థిరంగా కొనసాగుతున్నాయి. 

సరుకును యార్డులోకి తరలించాం 
గుంటూరు మిర్చి యార్డుకు  మాచర్ల ప్రాంతం నుంచి కాయలు తీసుకొచ్చా. యార్డుకు పెద్దఎత్తున సరుకు రావడంతో ట్రాఫిక్‌ జామ్‌ అయింది.  అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడంతో సరుకును యార్డులోకి తరలించాం.  
– పంగా శ్రీనివాసులు, రైతు, మాచర్ల 

సరుకు భారీగా రావడంతో ఇబ్బందులు
కర్నూలు నుంచి బుధవారం తెల్లవారుజామున మిర్చి తెచ్చా. సరుకు పెద్దఎత్తున రావడంతో యార్డులోకి సరుకు తీసుకెళ్లేందుకు ఇబ్బందులు పడ్డా. సరుకును విక్రయించుకునేందుకు వీలుగా మార్కెట్‌ అధికారులు చర్యలు తీసుకున్నారు.  
– లబాన్, రైతు, కర్నూలు జిల్లా 

రైతులకు ఇబ్బంది లేకుండా చర్యలు
మిర్చి క్రయ, విక్రయాలకు ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. వరుస సెలవు వల్ల మార్కెట్‌ యార్డుకు పెద్దఎత్తున సరుకు వచ్చింది. యార్డులో ఉన్న సరుకును క్లియర్‌ చేసేందుకు గురువారం సెలవు ప్రకటించాం. రైతులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని సరుకును యథావిధిగా యార్డు పనిచేసే రోజుల్లో తీసుకు రావాలి.  
– వెంకటేశ్వరరెడ్డి, ఉన్నత శ్రేణి కార్యదర్శి, గుంటూరు మార్కెట్‌ యార్డు  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement