ఖమ్మం ఘటనలకు ప్రభుత్వానిదే బాధ్యత
క్వింటాల్ మిర్చికి రూ.10 వేలు ఇవ్వాలి: తమ్మినేని
సాక్షి, హైదరాబాద్: ఖమ్మం మార్కెట్ యార్డులో చోటు చేసుకున్న ఘటనలకు మార్కెట్ కమిటీ, రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని సీపీఎం డిమాండ్ చేసింది. రైతులు కోరుకున్న ధర ఇప్పించే వరకు వారితోనే తానుంటానని వరంగల్ సభలో సీఎం కేసీఆర్ ప్రకటించి 24 గంటలు గడవకముందే ఖమ్మం మార్కెట్ యార్డులో రైతులు ఆందోళనకు దిగాల్సి వచ్చిందని పేర్కొంది. ఈ ఆందోళన ఇతర మార్కెట్లకు చేరకుండా, రైతులను ఆదుకునే చర్యలు ప్రభుత్వం వెంటనే చేపట్టాలని ఆ పార్టీ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఒక ప్రకటనలో సూచించారు. క్వింటాల్ మిర్చికి రూ.10 వేల ధర నిర్ణయించాలని డిమాండ్ చేశారు.
ముందుగానే బిల్లు ప్రతులను సభ్యులకివ్వాలి: రాజయ్య
ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టే బిల్లుల సవరణ కాపీలు ఒకరోజు ముందుగానే సభ్యులకు అందించాలని సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య డిమాండ్ చేశారు. అసెంబ్లీ వెలుపల ధర్నాలకు అవకాశం లేకుండా, సీఎంను కలుసుకునే అవకా శాన్ని కల్పించకుండా, చట్టసభల్లోనూ ప్రతిపక్షాలకు చర్చించే అవకాశమివ్వకుండా ప్రభుత్వం అహంకారపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.