కొత్తగూడెం/చుంచుపల్లి: జిల్లాలో మైనింగ్ ప్రభావిత గ్రామాల అభివృద్ధికి రూ.290 కోట్లు విడుదల చేస్తున్నట్లు రాష్ట్ర రోడ్లు, భవనాలు, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. కొత్తగూడెంలోని ఇల్లెందు గెస్ట్‌హౌస్‌లో జిల్లా మినరల్ ఫౌండేషన్ ప్రథమ సమావేశం శనివారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన తుమ్మల మాట్లాడుతూ... తెలంగాణ ప్రభుత్వం మైనింగ్ ప్రభావిత గ్రామాల విషయంలో ప్రత్యేక దృష్టిని సారించి వాటి అభివృద్ది కోసం కృషి చేస్తోందని అన్నారు. ఈ నిధులను జిల్లాలోని మైనింగ్ ప్రభావిత 86 గ్రామాలలో ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. ఆయా గ్రామాల్లో చేపట్టాల్సిన పనుల గుర్తింపునకు గ్రామసభలను నిర్వహించి తీర్మానం చేసి జిల్లా కలెక్టర్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందజేయాలని ఎమ్మెల్యేలకు సూచించారు.
ఈ నిధులలో 60 శాతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలతో పాటు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుకు, ప్రజల సాంఘిక, ఆర్థిక, ఆరోగ్య, వాతావరణ పరిస్థితుల ప్రభావాన్ని తగ్గించుటకు, ప్రజలకు శాశ్వత జీవనోపాధి కల్పించేందుకు వినియోగిస్తామని, మిగితా 40 శాతం నిధులను మంచినీటి సరఫరా, వాతావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణ, విద్య, స్త్రీ, శిశు సంక్షేమం, వృద్ధులు, దివ్యాంగుల సంక్షేమం, వృత్తి నైపుణ్యాభివృద్ధి తదితర పనులకు కేటాయి స్తామని వివరించారు. రెండు కిలోమీటర్ల లోపు మైనింగ్ ప్రభావిత ప్రాంత గ్రామాలకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని, వాటి జాబితాను సింగరేణి అధికారులు అందజేయాలని కోరారు. జిల్లా మినరల్ ఫౌండేషన్‌లో సభ్యులుగా మైనింగ్ ప్రభావిత గ్రామంలోని ఒక మహిళ, ఒక పురుష అభ్యర్థులు తీర్మానం చేసి పంపాలని, ఆ జాబితా ఆధారంగా జిల్లా కమిటీలో సభ్యులుగా నియమిస్తామని అన్నారు.
పనులు ఆలస్యం కాకుండా తక్షణమే తీర్మానాలు చేయాలన్నారు. మంజూరు చేసిన నిధులలో ప్రతి సంవత్సరం 5 శాతం ఏదేని జాతీయ బ్యాంకులో భవిష్యత్ అవసరాల కోసం జమ చేస్తామని, 5 శాతం నిధులు జాతీయ విపత్తులు, ప్రకృతి వైపరీత్యా లు వంటి అత్యవసర సమయాలలో వినియోగించేందు కు కేటాయిస్తామని తెలిపారు. కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మం తు మాట్లాడుతూ జిల్లాలో ఎ క్కువ శాతం సింగరేణి సంస్థ మినరల్స్ ద్వారానే వచ్చాయ ని అన్నారు. ఈ నిధుల కేటాయింపు విషయంలో స్థానిక ఎమ్మెల్యేల సూచనల మేరకు ప్రధాన మౌలిక వసతులను గుర్తించి, మొదట వాటికి ప్రాధాన్యత ఇస్తామని అన్నారు. ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య మాట్లాడుతూ.. మైనింగ్ ప్రభావిత ప్రాంతాన్ని రెండు కిలోమీటర్లకే పరిమితం చేయడంతో పలు గ్రామాలకు నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
వేలాది ఎకరాలను ధ్వంసం చేసి ఆయా గ్రామాలకు అన్యాయం చేయటం తగదన్నారు. దీనిపై మంత్రి తుమ్మల స్పందిస్తూ.. ఈ విషయాలను ప్రభుత్వానికి కలెక్టర్ లేఖ పంపితే, సింగరేణి ఉన్నతాధికారులతో చర్చించి న్యాయం జరిగేలా చర్య తీసుకుంటామని హామీ ఇచ్చారు. సమావేశంలో జెడ్పీ ఛైర్‌పర్సన్ గడిపల్లి కవిత, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, కొత్తగూడెం, ఇల్లెందు, అశ్వారావుపేట, పినపాక ఎమ్మెల్యేలు జలగం వెంకటరావు, కోరం కనకయ్య, తాటి వెంకటేశ్వర్లు, పాయం వెంకటేశ్వర్లు, జేసీ రాంకిషన్, డీఆర్‌డీఓ జగత్‌కుమార్‌రెడ్డి, కొత్తగూడెం, ఇల్లందు మున్సిపల్ ఛైర్‌పర్సన్లు పులి గీత, మడత రమ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment