karimnagar city
-
బండి సంజయ్ వర్సెస్ గంగుల కమలాకర్
ఎన్నికలు ఏవైనా ఒకరు ఓడితేనే మరొకరు గెలుస్తారు. రాష్ట్రం అంతటా ప్రధాన పార్టీల అభ్యర్థులు హోరా హోరీ పోరాడుతున్నారు. ఆ నగరంలో పోటీ చేస్తున్న అభ్యర్థులు తమ అనుకూల ఓట్లన్నీ ఒక్క చోటుకు చేర్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒక అభ్యర్థి హిందుత్వమే తన నినాదమని ప్రచారం చేస్తున్నారు. మరొకరు సెక్యులర్ విధానమే మా నినాదం అంటున్నారు. రెండు విభిన్న ధృవాల మధ్య జరుగుతున్న పోరు ఆసక్తికరంగా మారుతోంది. ఇంతకీ ఆ సిటీ ఎక్కడో...ఆ ప్రత్యర్థులు ఎవరో చూద్దాం. కరీంనగర్ సిటీలో మరోసారి కమలం గుర్తుపై బండి సంజయ్, కారు గుర్తుపై మంత్రి గంగుల కమలాకర్ ప్రత్యర్థులుగా బరిలోకి దిగారు. ఇద్దరి మధ్యా కుటుంబాల పరంగా సాన్నిహిత్యం ఉన్నప్పటికీ... ఎన్నికల గోదాలో దిగాక చావో రేవో అన్న విధంగా పోరాటం చేయక తప్పదు. అందుకే కారు, కమలం పార్టీల అభ్యర్థుల మధ్య మాటల తూటాలు భీకరంగా పేలుతున్నాయి. ఓట్ల పోలరైజేషన్ కోసం ఇరు పక్షాలు హోరా హోరీ తలపడుతున్నాయి. హిందూ ఓట్లు తనను దాటి పోకుండా చూసుకునేందుకు బండి సంజయ్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అదేవిధంగా సంప్రదాయంగా గులాబీ పార్టీకి పడుతున్న ఓట్లతో పాటు...మైనారిటీ ఓట్లన్నీ గంపగుత్తగా తనకే పడేలా మంత్రి గంగుల కమలాకర్ తనవంతు ప్రయత్నాలు సాగిస్తున్నారు. కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో సుమారు 55 వేల వరకూ ఉన్న ముస్లిం మైనార్టీల ఓట్లు అత్యంత కీలకం కానున్నాయి. కారు, కమలం పార్టీలనుంచి పోటీ చేస్తున్న గంగుల కమలాకర్, బండి సంజయ్ గెలుపోటములను మైనారిటీల ఓట్లే నిర్ణయిస్తాయి. గత ఎన్నికల్లోనూ మైనారిటీల ఓట్లు గంపగుత్తగా సిట్టింగ్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్ధి గంగుల కమలాకర్ కే పడటంతో..నాడు బండి సంజయ్ పుట్టి మునిగింది. అప్పటివరకూ టగ్ ఆఫ్ వార్ లా నడిచిన పోలింగ్‌లో.. మధ్యాహ్నం తర్వాత ముస్లిం మైనార్టీ ఓటర్లంతా పోలింగ్ బూతులకు పోటెత్తారు. ఆ ఓట్లన్నీ కారు గుర్తుకే గంపగుత్తగా గుద్దేసి కారును పరుగులు తీయించారు. గంగుల 14 వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో బండి సంజయ్ పై విజయం సాధించారు. ఈ క్రమంలో హిందూ, ముస్లిం ఓట్ బ్యాంక్ రాజకీయాలకు ఇప్పుడు కరీంనగర్ వేదికైంది. ఈసారి తనకు హిందూ ఓట్లన్నీ గంపగుత్తగా వచ్చేస్తే..కాంగ్రెస్ పార్టీకి కూడా ముస్లిం మైనార్టీలు మద్దతు ప్రకటిస్తున్న నేపథ్యంలో.. బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు మైనారిటీ ఓట్లను పంచుకుంటే.. ఇక తన గెలుపు నల్లేరుపైన నడకేనని బండి సంజయ్ ఆశిస్తున్నారు. ఆయన ప్రచారం కూడా దానికి అనుగుణంగానే సాగుతోంది. ఇక బండి సంజయ్ వ్యాఖ్యలపై గంగుల కమలాకర్ కూడా అదే రేంజ్లో కౌంటర్లు ఇస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రజలంతా సుఖశాంతులతో ఉన్నారని..ఎలాంటి శాంతిభద్రతల సమస్యల్లేకుండా కరీంనగర్ ప్రశాంతంగా ఉందని అంటూ..విధ్వంసకారులు కావాలా...నిర్మాణాత్మక నాయకత్వం కావాలా అన్నది ప్రజలు ఆలోచించాలంటూ గంగుల ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా తాము చేసిన అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు...కళ్యాణలక్ష్మీ, రైతుబంధు, దళితబంధు, బీసీబంధు, గురుకులాలు, మైనార్టీ వెల్ఫేర్ స్కూల్స్, మిషన్ భగీరథ, తీగల వంతెన, మానేరు రివర్ ఫ్రంట్, కరీంనగర్ రోడ్లు, స్మార్ట్ సిటీ డెవలప్ మెంట్ వంటి అంశాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. గత ఎన్నికల్లోనూ సిటీకి ఎంఐఎం మేయరంటూ బండి సంజయ్ ప్రచారం చేశారని.. పాడిందే పాట అన్నట్టుగా బండి ప్రచారం సాగుతోందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని..సెక్యులర్ విధానమే..తమ నినాదమనీ గంగుల కుండబద్ధలు కొడుతున్నారు. గతంలో సీఎం కేసీఆర్ హిందుగాళ్లు, బొందుగాళ్లంటూ ప్రచారం చేశారంటూ..లోక్‌సభ ఎన్నికల్లో దాన్ని ముమ్మురంగా ప్రజల్లోకి తీసుకెళ్లిన బండి సంజయ్.. ప్రజల భావోద్వేగాలపై ముద్ర వేసే వ్యాఖ్యలు చేశారు. మొత్తంగా హిందుత్వ ఓట్ బ్యాంకును పోలరైజ్ చేసి.. గంపగుత్తగా తనవైపు తిప్పుకునే క్రమంలో బండి సంజయ్ మరోసారి ఎత్తుకుంటున్న నినాదాలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. సెక్యులర్ నినాదమే తమ విధానమంటూ ముందుకెళ్తున్న బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల ప్రచారం ఎలాంటి ప్రభావం చూపుతుందా అన్న ఆసక్తి నెలకొంది. రోజులు గడిచేకొద్దీ..పోలింగ్ తేదీ దగ్గరపడేకొద్దీ ఈ నేతల ప్రచార యుద్ధం ఇంకెంత హాట్ హాట్‌గా సాగుతుందోనన్న ఆసక్తికర చర్చ కరీంనగర్ సిటీలో జరుగుతోంది. -
ఫైవ్‌స్టార్ చాక్లెట్స్‌తో పాఠశాలకు ఆహ్వానం
కరీంనగర్ మండలం నగునూరు పాఠశాలలో హెచ్ఎం కట్ట వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉపాధ్యాయులు ఫైవ్‌స్టార్ చాక్లెట్లతో స్వాగతం పలికారు. కరీంనగర్‌లోని మంకమ్మతోటలో గల ధన్గర్‌వాడీ పాఠశాలలో ప్రార్థన సమయంలో విద్యార్థిని సాయి స్పృహతప్పి పడిపోగా, ఉపాధ్యాయుడు ప్రథమ చికిత్స చేశాడు. సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ‘పొద్దున లేవాలి.. స్నానం చేయాలి.. బడికెళ్లాలి.. ప్రార్థన చేయాలి, పాఠాలు వినాలి.. మైదానంలో ఆడాలి.. సాయంత్రానికి మాసిన బట్టలతో ఇంటికి చేరుకోవాలి.. ఇదే ప్రపంచంలో ఎక్కడైనా విద్యార్థి దినచర్య. కానీ, కరోనా మహమ్మారి దెబ్బకు ఏడాదిన్నరగా విద్యార్థుల దినచర్య పూర్తిగా స్తంభించిపోయింది. నిత్యం స్మార్ట్ఫోన్లలో పాఠాలు విన్న విద్యార్థులకు బుధవారం నుంచి ప్రత్యక్ష బోధన మొదలైంది. ఏడాదిన్నర అనంతరం పాఠశాలకు వెళ్తున్నామనే హుషారు విద్యార్థుల్లో కనబడింది. కరోనా వల్ల పాఠశాలలకు దూరమైన విద్యార్థినీ విద్యార్థులకు ప్రత్యక్ష బోధనకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో జిల్లా వ్యాప్తంగా విద్యార్థులు బడిబాట పట్టారు. కరోనా నేపథ్యంలో విద్యార్థులు మాస్కులు ధరించి పాఠశాల, కళాశాలలకు హాజరవ్వడం కనిపించింది. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ విద్యాసంస్థల యాజమాన్యాలు ప్రత్యక్ష తరగతులు నిర్వహించాయి.’ చదవండి: కాంగ్రెస్ ఎమ్మెల్యే టికెట్‌కు దరఖాస్తులు ఆహ్వానం 18 నెలల అనంతరం..! గతేడాది మార్చి 23 నుంచి దేశవ్యాప్తంగా విధించిన లాక్డౌన్లో భాగంగా విద్యాసంస్థలు మూతబడ్డాయి. 2019–20 విద్యాసంవత్సరానికి గాను పదో తరగతి, ఇంటర్, కొన్ని ఉన్నత విద్యలకు సంబంధించి ప్రభుత్వం నేరుగా పాస్ చేశారు. 2020–21 విద్యా సంవత్సరంలోనూ ఇదే పరిస్థితి కొనసాగింది. సెకండ్ వేవ్ ముగియడం, ప్రత్యక్ష బోధన కొరవడటంతో విద్యార్థుల్లో విద్యాప్రమాణాలు పడిపోతాయన్న ఆందోళనతో ప్రభుత్వం కూడా ప్రత్యక్ష బోధన వైపు మొగ్గుచూపింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు దాదాపు 18 నెలల అనంతరం విద్యార్థులు బడిబాటపట్టడం గమనార్హం. పాఠశాలల్లో 21.11 శాతం, కళాశాలల్లో 22.65 శాతం.. పాఠశాలలు, కళాశాలల పునఃప్రారంభమైన తొలిరోజు హాజరు శాతం అతి తక్కువ నమోదు కావడం గమనార్హం. విద్యార్థులను బలవంతం చేయొద్దని, ఆన్లైన్, ఆఫ్‌లైన్ విద్యార్థుల కోరిక మేరకు విద్యాసంస్థల యజమానులు వ్యవహరించాలని వచ్చిన వార్తలతో తొలిరోజు విద్యార్థులు, తల్లిదండ్రులు గందరగోళానికి గురికావడంతోనే హాజరు శాతం తగ్గిందని ఉపాధ్యాయ వర్గాలు పేర్కొన్నాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు పాఠశాలలను శుభ్రం చేసి విద్యార్థులు ప్రత్యక్ష «తరగతులకు హాజరయ్యేలా విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. తొలిరోజు జిల్లా వ్యాప్తంగా 662 ప్రభుత్వ పాఠశాలల్లో 42,698 మంది విద్యార్థులకు గాను 9,014 మంది (21.11 శాతం).. ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో 13,059 మంది విద్యార్థులకు గాను 2,958 మంది (22.65 శాతం) హాజరయ్యారు. -
టీఆర్ఎస్, బీజేపీ నేతల లొల్లి; కిందపడ్డ సీఐ
కరీంనగర్ క్రైం/ కరీంనగర్ టౌన్: కరీంనగర్ నడిబొడ్డున టీఆర్ఎస్, బీజేపీ నాయకులు స్ట్రీట్‌ఫైట్‌కు దిగారు. తెలంగాణ చౌక్ వేదికగా కొట్టుకున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దిష్టిబొమ్మ దహనం విషయంలో తలెత్తిన వివాదం పరస్పరం దాడి చేసుకునే స్థాయికి చేరింది. అక్కడే ఉన్న పోలీస్ సిబ్బంది ఇరువర్గాలను అడ్డుకునేందుకు విఫలయత్నం చేశారు. పోలీసులనే నాయకులు నెట్టివేయడంతో వారు వన్‌టౌన్, టూటౌన్, ట్రాఫిక్ స్టేషన్లకు సమాచారం అందించారు. సీఐలు లక్ష్మిబాబు, విజయ్‌కుమార్, తిరుమల్, ఎస్ఐలు తిరుపతి, శ్రీనివాస్, వెంకట్రాజం సిబ్బందితో హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇరువర్గాలను అదుపుచేసే క్రమంలో టూటౌన్ సీఐ కిందపడ్డాడు. దీంతో పోలీసులు అప్రమత్తమై ఇరువర్గాలను చెదరగొట్టారు. ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. నగరంలో ఉద్రిక్తత నెలకొనడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బలగాలు సాయంత్రం వరకు గట్టి బందోబస్తు నిర్వహించాయి. లొల్లి ముదిరిందిలా.. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కుమార్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా టీఆర్ఎస్ కార్యకర్తలు సంజయ్ దిష్టిబొమ్మ దహనం చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆదివారం దిష్టిబొమ్మతో తెలంగాణ చౌక్‌కు చేరుకున్నారు. అప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై నిరసన తెలిపేందుకు బీజేపీ నేతలు అక్కడికి చేరుకున్నారు. బీజేపీ నాయకులు ఎదుటనే టీఆర్ఎస్ నాయకులు బండి సంజయ్ దిష్టిబొమ్మ దహనానికి యత్నించారు. దీంతో బీజేపీ శ్రేణులు అడ్డుకునేందుకు యత్నించాయి. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. మాటామాటా పెరగడంతో నాయకులు ఒకరినొకరు తోసుకున్నారు. కోపోద్రిక్తులైన కొంతమంది దాడికి దిగారు. అక్కడు ఉన్న పోలీసులు అప్రమత్తమై ఇరువర్గాలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసులు ఓవైపు వారిస్తున్నా.. రెండు పార్టీల నేతలు వారిని తోసేసి దాడులు చేసుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు ఇరువర్గాలను చెదగొట్టే క్రమంలో టూటౌన్ సీఐ లక్ష్మీబాబు కిందపడ్డారు. పోలీసుల అదుపులో ఇరువర్గాలు.. పరస్పర దాడులకు దిగిన ఇరువర్గాలను చెదరగొట్టిన పోలీసులు రెండు పార్టీలకు చెందిన నాయకులను అదుపులోకి తీసుకున్నారు. టీఆర్ఎస్ కార్యకర్తలను వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌కు, బీజేపీ కార్యకర్తలను టూటౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దీంతో నగరంలో ఉద్రిక్త వాతావరణ నెలకొంది. రెండు పార్టీలకు చెందిన నేతలపై పోలీసులు ప్రత్యేక దృష్టిసారించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు. తెలంగాణచౌక్‌లో భారీగా పోలీసులను మోహరించారు. నగరంలోని పలు సమస్యాత్మక ప్రాంతాలపైనా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించి బందోబస్తు నిర్వహించారు. బీజేపీ నేతలపై కేసు.. తెలంగాణ చౌక్‌లో జరిగిన ఘర్షణలో బీజేపీ నేతలపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వన్ టౌన్ సీఐ విజయ్‌కుమార్ తెలిపారు. తాము నిరసన కార్యక్రమాన్ని చేపడుతుండగా బీజేపీ శ్రేణులు వచ్చి దాడులకు పాల్పడ్డారని టీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. కాగా తాము సైతం ప్రభుత్వ విధానాలపై నిరసన తెలిపేందుకు వస్తుండగా, తమ అధినేత దిష్టిబొమ్మను కాళ్లతో తొక్కడంతో అడ్డుకునే ప్రయత్నం చేశామని బీజేపీ నేతలు తెలిపారు. -
పాపం ‘కొప్పుల’
రాష్ట్ర మంత్రివర్గంలో చోటుకోసం ఎదురుచూస్తున్న సీనియర్ ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ చీఫ్‌విప్‌తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కొప్పులను చీఫ్‌విప్ పదవి వరించడంతో జిల్లాకు మరో క్యాబినెట్ హోదా పదవి దక్కింది. ఇప్పటివరకు ఈటెల రాజేందర్, కె.తారకరామారావు మంత్రులుగా ఉండగా, జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ సహాయ క్యాబినెట్ హోదా కలిగి ఉన్నారు. ఇటీవల మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ను సాంస్కృతిక సారథి కార్పొరేషన్ చైర్మన్‌గా నియమిస్తూ, క్యాబినెట్ హోదాను కల్పించారు. కరీంనగర్‌సిటీ: సౌమ్యుడిగా పేరొం దిన కొప్పుల ఈశ్వర్ తొలుత మేడారం ప్రస్తుత రామగుండం నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహించేవారు. ఎస్సీ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో ధర్మపురి ఎస్సీ రిజర్వడ్ నియోజకవర్గం కావడంతో ఆయన ధర్మపురిని ఎంచుకున్నారు. టీఆర్ఎస్ నుంచి వరుసగా ఐదు ఎన్నికల్లో పోటీచేయడంతో పాటు ఘనవిజయం సాధించి రికార్డు నెలకొల్పారు. రాష్ట్రంలో ఈటెల రాజేందర్, టి.హరీష్‌రావు మాత్రమే ఈ రికార్డును సొంతం చేసుకున్నారు. అంతటి గుర్తింపు పొందిన కొప్పుల పార్టీ అధినేత కేసీఆర్‌కు సైతం విధేయుడుగా ముద్రపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక, తొలి మంత్రివర్గంలోనే కొప్పులకు చోటు దక్కడం ఖాయమని, అది కూడా ఉప ముఖ్యమంత్రి అని అప్పట్లో ప్రచారం జరిగింది. రెండు ఉప ముఖ్యమంత్రి పదవుల్లో ఒకటి మైనారిటీ, మరొకటి దళిత వర్గానికి ఇస్తానని కేసీఆర్ చెప్పడంతో దళిత కోటాలో డెప్యూటీ సీఎం కొప్పులే అని అంతా భావించారు. చివరి నిమిషంలో పరిస్థితి తారుమారు కావడంతో కొప్పులకు బదులు అదే కోటాలో వరంగల్ జిల్లా నుంచి రాజయ్యను ఉపముఖ్యమంత్రి పదవి వరించింది. తొలి షాక్ నుంచి తేరుకున్న కొప్పుల తనకు కనీసం మంత్రి పదవైనా ఇస్తారని అధినేతపై గట్టి విశ్వాసం పెట్టుకున్నారు. ఇందులో భాగంగానే స్పీకర్, చీఫ్‌విప్, విప్ తదితర పదవులను ఇస్తామన్నా ఆయన తిరస్కరించినట్లు వార్తలు వచ్చాయి. మంత్రి పదవి తనకు కచ్చితంగా వస్తుందని, ఆ దిశగా కేసీఆర్ హామీ ఇచ్చారనే ధీమాతోనే ఆయన ముఖ్యమైన స్పీకర్ పదవిని కూడా వదులుకున్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి. చివరకు ఏ పదవి వద్దనుకున్నాడో ఆ చీఫ్‌విప్‌తోనే కొప్పుల సరిపెట్టుకోవాల్సి రావడాన్ని ఆయన వర్గీయులు జీర్ణించుకోలేకపోతున్నారు. సమీకరణల్లో భాగంగానేనా...? ఇదిలా ఉంటే జిల్లాలు, సామాజిక సమీకరణల మూలంగానే కొప్పులకు మంత్రి పదవి దూరమైంద ని పార్టీ సీనియర్ నేతలు చెబుతున్నారు. మంత్రి వర్గసభ్యుల సంఖ్య మొత్తం శాసనసభ సభ్యుల సంఖ్యలో 15 శాతం మించకూడదనే నిబంధన ఉంది. రాష్ట్రంలో మొత్తం 120 మంది ఎమ్మెల్యేలకు 15 శాతం అంటే 18 మందికి మించి మంత్రి మండలి ఉండరాదు. ఇప్పటికే 12 మందితో రాష్ట్ర మంత్రివర్గం ఏర్పాటైంది. ప్రస్తుతం ప్రాతినిథ్యం లేని జిల్లాలకు ఇవ్వడంతో పాటు, మహిళలు, గిరిజనులు, ఇతర సామాజిక వర్గాలను పరిగణలోకి తీసుకోవడంతో ఆరుగురితో కోటా నిండిపోయింది. దీనితో కొప్పులకు మొండిచేయి తప్పలేదని పార్టీ నేతలు విశ్లేషిస్తున్నారు. జిల్లాకు తొలిసారి చీఫ్‌విప్ పదవి జిల్లాను తొలిసారి వరించింది. గతంలో విప్ పదవి జిల్లాకు వచ్చినప్పటికీ చీఫ్ విప్ పదవి రావడం ఇదే మొదటిసారి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు విప్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో మానకొండూర్ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ సైతం విప్‌గా కొనసాగారు. ప్రస్తుతం కొప్పులకు చీఫ్‌విప్ పదవి రావడంతో జిల్లాకు మొదటి సారి ఈ పదవి వ చ్చినట్లయింది. కక్కలేక...మింగలేక చీఫ్‌విప్ పదవి రావడంతో కొప్పుల ఈశ్వర్ పరిస్థితి క క్కలేక... మింగలేక అన్నట్లుగా తయారైంది. మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు జరిగినా తనకు మంత్రి పదవి ఖాయమని ధీమాతో ఉన్న కొప్పులకు ఈ పరిణామం మింగుడుపడడం లేదు. చీఫ్‌విప్ పదవి క్యాబినెట్హోదా కలిగిందే అయినా మంత్రి పదవితో సమాన స్థాయి కాదనే బాధ ఆయన వర్గీయుల్లో నెలకొంది. మంత్రి పదవి రాలేదు కాబట్టి అసంతృప్తి వ్యక్తం చేయాలా... క్యాబినెట్ హోదాతో చీఫ్‌విప్ పదవి లభించింది కాబట్టి తృప్తిపడి సర్దుకుపోవాలో తెలియని అయోమయంలో కొప్పుల, ఆయన వర్గీయులు ఉన్నారు. ఎమ్మెల్యేలకు కార్పొరేషన్ చైర్మన్ వచ్చేనా? మంత్రివర్గంలో చోటు లభించని ఎమ్మెల్యేలను ఇతర పదవులతో భర్తీ చేస్తున్న క్రమంలో జిల్లా ఎమ్మెల్యేల్లో ఆశలు చిగురిస్తున్నాయి. మంత్రి, ఆ స్థాయి పదవులు రాని ఆరేడుగురు ఎమ్మెల్యేలకు కార్పొరేషన్ చైర్మన్ పదవులు కట్టబెడుతున్నట్లు శనివారం ప్రచారం జరిగింది. దీంతో మంత్రి పదవి రేసులో కూడా లేని కొంతమంది ఎమ్మెల్యేలు కార్పొరేషన్ చైర్మన్ పదవులపై ఆశలు పెంచుకున్నారు. వారి ఆశలు ఏ మేరకు ఫలిస్తాయో వేచిచూడాలి. రాజకీయ ప్రస్థానం 2004లో గని కార్మికునిగా ఉంటు అదే సంవత్సరంలో మేడారం నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందాడు. కేసీఆర్ పిలుపు మేరకు ఉద్యమ క్రమంలో ఎమ్మెల్యే పదవికి 2008లో రాజీనామా చేశారు. 2008లో జరిగిన ఉప ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలుపొందారు. 2009 సంవత్సరంలో పునర్విభజనలో అప్పటి బుగ్గారం స్థానంలో ధర్మపురి నియోజకవర్గం (ఎస్సీ రిజర్వడ్)గా మారింది. 2009 అసెంబ్లి ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి పోటీచేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2010లో తెలంగాణ ఏర్పాటు విషయం లో శ్రీకృష్ణ కమిటీతీర్పును నిరసిస్తూ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. 2010 ఉప ఎన్నికల్లో మళ్లీ భారీ మెజార్టీతో గెలుపొందారు. 2014 సాధారణ ఎన్నికల్లో గెలుపొందారు. 2004 నుంచి 2014 వరకు వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా పోటీచేసి విజయం సాధించారు. కోల్‌బెల్ట్ నుంచే ఎదిగిన ‘కొప్పుల’ .. గోదావరిఖని: కొప్పుల ఈశ్వర్ రాజకీయ ప్రస్థానం కోల్‌బెల్ట్ నుంచే ప్రారంభమైంది. ఆయన 1972లో సింగరేణి సీఎస్పీ-1లో జనరల్ మజ్దూర్‌గా ఉద్యోగం పొందారు. వివిధ గనుల్లో పనిచేసి 2004లో మేడిపల్లి ఓసీపీలో ట్రిప్మెన్గా పని చేస్తూ 32 ఏళ్ల సర్వీస్ తర్వాత ఎన్నికల్లో పోటీచేసే నిమిత్తం రాజీనామా చేశారు. ఈశ్వర్ తొలుతవిప్లవ భావాలు కలిగిన సీపీఐఎంఎల్, ఐఎఫ్టీయూ, ఏఐఎఫ్టీయూలలో నిర్బంధంలో పనిచేశారు. ఆ సమయంలో సింగరేణి కార్మికుల సమస్యలపై వివిధ పోరాటాల్లో పాల్గొన్నారు. పలు సందర్భాలలో ఆయన జైలుకు వెళ్లా రు. టీడీపీలో చేరి మేడారం ఎస్సీ నియోజకవర్గం నుంచి 1994లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. 2001లో టీఆర్ఎస్లో చేరారు. నాటి నుంచి అంచలంచెలుగా ఎదుగుతూ పార్టీలో పొలిట్‌బ్యూరో సభ్యుడిగా ఉన్నారు. 2004లో కాంగ్రెస్ పొత్తుతో మేడారం నుంచి తొలి సారిగా, అనంతరం ధర్మపురి నియోజకవర్గం నుంచి పలుమార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. -
ముదిరిన ‘పంచాయతీ’
ట్రాన్స్‌కోకు, గ్రామపంచాయతీలకు మధ్య కరెంటు బకాయిల వివాదం ముదురుతోంది. బకాయిల వసూళ్లకోసం అధికారులు కరెంటు కట్ చేస్తున్న నేపథ్యంలో సర్పంచుల ధీటుగా స్పందిస్తున్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ బకాయిలు చెల్లించేది లేదని, అవసరమైతే వసూళ్లకు వచ్చే సిబ్బందిని నిర్భందిస్తామని సర్పంచుల సంఘం హెచ్చరికలు జారీ చేసింది. ఈ వివాదానికి కారణమైన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రేక్షక పాత్ర వహిస్తోంది. కరీంనగర్ సిటీ : గ్రామాల్లో రక్షిత మంచినీటి సరఫరా, వీధిదీపాలు తదితర ప్రజావసరాలకు ఆయా పంచాయతీలు విద్యుత్‌ను వినియోగిస్తుంటాయి. గతంలో ప్రభుత్వమే పంచాయతీల విద్యుత్ బిల్లులను నేరుగా చెల్లించేది. కొద్ది నెలలుగా బిల్లులు చెల్లించకపోవడంతో జిల్లాలో 1207 గ్రామాలకు రూ.60 కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. ట్రాన్స్‌కో అధికారులు బకాయిలు చెల్లించాలని, లేన ట్లయితే విద్యుత్ కనెక్షన్ తొలగిస్తామని గత నెలలో గ్రామపంచాయతీలకు నోటీసులు జారీ చేశారు. విద్యుత్ బిల్లుల చెల్లింపు నుంచి తప్పుకున్న ప్రభుత్వం ఆ భారాన్ని పంచాయతీలపై మోపింది. గ్రామాలకు వచ్చే 13వ ఆర్థిక సంఘం, ఎస్ఎఫ్సీ ని ధుల్లో 25 శాతం నిధులు బకాయిలు చెల్లించడానికి వెచ్చించాలని డీపీఓ ఈ నెలలో సర్క్యులర్ జారీ చేశారు. అసలే అరకొర నిధులతో నెట్టుకొస్తుంటే.. అందులోంచి 25 శాతం విద్యు త్ బిల్లులకు కేటాయించడాన్ని సర్పంచులు వ్యతిరేకించారు. గతంలో మాదిరిగా ప్రభుత్వమే నేరు గా విద్యుత్ బిల్లులతో పాటు బకాయిలు చెల్లిం చాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం, సర్పంచు ల నడుమ ఈ వ్యవహారం కొనసాగుతుండగానే ట్రాన్స్‌కో అధికారులు రంగంలోకి దిగారు. వారం రోజుల వ్యవధిలో జిల్లాలోని దాదాపు రెండువందల గ్రామపంచాయతీల్లో విద్యుత్ కనెక్షన్లు కట్ చేశారు. దీనిపై సర్పంచులు తీవ్రం గా స్పందించారు. విద్యుత్ బిల్లులు గ్రామపంచాయతీలు చెల్లించేది లేదని తీర్మానించారు. పై గా విద్యుత్ కనెక్షన్ తొలగించడానికి ట్రాన్స్‌కో సిబ్బంది వస్తే నిర్బంధించాలంటూ సర్పంచుల సంఘం పిలుపునిచ్చింది. దీంతో ట్రాన్స్‌కో, పంచాయతీల మధ్య ప్రతక్ష్యంగా వార్ మొదలైంది. ఈ మేరకు జిల్లా సర్పంచుల సంఘం నాయకులు శుక్రవారం పలువురు ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, ట్రాన్స్‌కో అధికారులను కలిసి వినతిపత్రాలు అందచేశారు. చర్యకు ప్రతిచర్య.. విద్యుత్ బకాయిలు వసూలు చేయడానికి ట్రాన్స్‌కో రంగంలోకి దిగగా, అందుకు ప్రతిచర్యకు పంచాయతీలు పూనుకుంటున్నాయి. గ్రామపంచాయతీల్లో ఉన్న విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు, సబ్స్టేషన్లకు పన్ను విధించేందుకు సర్పంచులు సమాయత్తమవుతున్నారు. గ్రామ అవసరాలకు వినియోగించిన విద్యుత్ బిల్లుల బకాయిల కోసం ట్రాన్స్‌కో కరెంట్ కట్ చేస్తే.. తాము తక్కువ కాదన్నట్లు ట్రాన్స్‌కోకు పన్నుల బకాయిల నోటీసులు పంపించాలని సర్పంచులు యోచిస్తున్నారు. నిబంధనల ప్రకారం గ్రామాల్లో ఉన్న ఒక్కో విద్యుత్ స్తంభానికి రూ.100, ట్రాన్స్ఫార్మర్కు రూ.వేయి, సబ్స్టేషన్లకు రూ.10 వేల చొప్పున తక్షణమే విద్యుత్ అధికారులు సంబంధిత గ్రామపంచాయతీలకు పన్నులు చెల్లించాలని సర్పంచులు డిమాండ్ చేస్తున్నారు. సర్కారు ప్రేక్షకపాత్ర.. ట్రాన్స్‌కో,గ్రామపంచాయతీల నడుమ చిచ్చుపెట్టిన రాష్ట్ర సర్కారు మాత్రం ఈ వ్యవహారంలో ప్రేక్షకపాత్ర వహిస్తోంది. సర్పంచుల ఆందోళనను పరిగణలోకి తీసుకొని సమస్యను పరిష్కరించాల్సిన అధికారులు ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఓవైపు ట్రాన్స్‌కో దూకుడు పెంచగా, మరోవైపు సర్పంచులు అదేస్థాయిలో ప్రతిఘటించేందుకు సిద్ధంకావడంతో జిల్లాలో ప్రచ్ఛన్న యుద్ధానికి తెరలేచింది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని కరెంటు బిల్లుల ‘పంచాయతీ’ని పరిష్కరించాల్సిన అవసరముంది. -
విద్య, వైద్యానికి పెద్దపీట
కరీంనగర్ సిటీ : జిల్లా పరిషత్ తొలి మహిళా చైర్‌పర్సన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన తుల ఉమ అభివృద్ధి ఎజెండాను వెల్లడించారు. జిల్లా అభివృద్ధి, సంక్షేమం, మహిళారంగ అభ్యున్నతిపై తనకున్న విజన్‌ను ప్రజల ముందుంచారు. శనివారం జెడ్పీ చైర్‌పర్సన్‌గా ఎన్నికైన అనంతరం ‘సాక్షి’కి ఇంటర్వ్యూ ఇచ్చారు. తొలి మహిళా చైర్‌పర్సన్‌గా ఎన్నికవడం ఎలా అనిపిస్తోంది? ఉమ : మాటల్లో చెప్పలేనంత సంతోషంగా ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నపుడు మహిళలకు అవకాశం రాలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే తొలిసారి జిల్లా పరిషత్ పీఠాన్ని అధిష్టించే అవకాశం మహిళలకు దక్కింది. పదవి మీకే దక్కుతుందనుకున్నారా? ఉమ : నాకైతే ముందునుంచి ఎలాంటి అనుమానం లేదు. మా అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నన్ను ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీ చేయాలని అనుకున్నారు. కొన్ని పరిస్థితుల వల్ల అది వీలు పడలేదు. జెడ్పీచైర్‌పర్సన్ బీసీ మహిళకు కేటాయించడంతోనే కేసీఆర్ నన్ను చైర్పర్సన్ చేయాలని నిర్ణయించారు. అందుకే ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని, సామాన్య కుటుంబం నుంచి వచ్చిన నాకు చైర్‌పర్సన్‌గా అవకాశం ఇచ్చారు. కేసీఆర్‌కు కృతజ్ఞతలు. మహిళలకు అవకాశం కల్పించడాన్ని ఎలా భావిస్తున్నారు? ఉమ : రాజకీయంగా ఉన్నత పదవులు మహిళలకు రావడం తక్కువే. మహిళలకు అవకాశం వస్తే నీతి, నిజాయతీగా పరిపాలిస్తారని ఎన్నోసార్లు రుజువైంది. ప్రస్తుతం జిల్లాలో 50 శాతం కన్నా ఎక్కువ మహిళా ప్రజాప్రతినిధులం ఉన్నాం. చైర్‌పర్సన్‌గా మీ ప్రాధాన్యతాంశాలేమిటి? ఉమ : విద్య, వైద్య రంగాలకు పెద్దపీట వేస్తా. గ్రామాల్లో పర్యటించినపుడు డ్రెయినేజీ సమస్య అధికంగా ఉన్నట్లు నా దృష్టికి వచ్చింది. ఆ సమస్యను పరిష్కరిస్తా. ప్రధానంగా జిల్లా పరిషత్ పాఠశాలల్లో టాయ్‌లెట్స్ లేక విద్యార్థినులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఒక ఏడాదిలోగా జిల్లాలోని అన్ని పాఠశాలల్లో టాయ్‌లెట్స్ నిర్మించి, విద్యార్థినుల ఇబ్బందులు తొలగిస్తా. మీ పరిపాలన ఎలా ఉండబోతోంది? ఉమ : చైర్‌పర్సన్‌గా నేను చేపట్టిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తా. అవినీతికి తావులేని నీతి, నిజాయితీతో కూడిన పాలన అందిస్తా. -
సామాజిక సమీకరణలో వరించిన అదృష్టం
కరీంనగర్ సిటీ : జిల్లా పరిషత్ వైస్‌చైర్మన్ అభ్యర్థి ఎంపికలో టీఆర్ఎస్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. మొదటినుంచి బెజ్జంకి జెడ్పీటీసీ సభ్యుడు తన్నీరు శరత్‌రావు పేరు వినిపించగా, చివరి నిమిషంలో హుస్నాబాద్ జెడ్పీటీసీ సభ్యుడు రాయిరెడ్డి రాజిరెడ్డి పేరు తెరపైకి వచ్చింది. మాజీ మంత్రి కెప్టెన్ లక్ష్మీకాంతారావు పట్టుబట్టడంతో అప్పటివరకు పరిశీలనలో ఉన్న రాజిరెడ్డి అభ్యర్థిత్వాన్ని అధిష్టానం ఖరారు చేసినట్లు సమాచారం. చైర్‌పర్సన్‌గా బీసీ మహిళ ఉండటంతో వైస్‌చైర్మన్ పదవిని ఓసీలకు కేటాయించాలని పార్టీ ముందుగానే నిర్ణయించింది. వెలమ సామాజిక వర్గానికి చెందిన తన్నీరు శరత్‌రావు పేరును దాదాపు ఖరారు చేసింది. పార్టీలో రెడ్డి సామాజిక వర్గానికి తగినంత ప్రాతినిధ్యం కల్పించాలనే డిమాండ్‌ను కొంతమంది నేతలు తెరపైకి తీసుకువచ్చారు. దీంతో పార్టీ హైకమాండ్ చివరకు రాజిరెడ్డిని వైస్‌చైర్మన్ అభ్యర్థిగా ప్రకటించింది. ఆయన అభ్యర్థిత్వాన్ని చందుర్తి జెడ్పీటీసీ అంబటి గంగాధర్ ప్రతిపాదించగా, వెల్గటూరు జెడ్పీటీసీ గంగుల పద్మ బలపరిచారు. శరత్‌రావుకు బుజ్జగింపు వైస్‌చైర్మన్ అభ్యర్థిత్వం చేజారిన శరత్‌రావును పార్టీ నేతలు బుజ్జగించారు. రాష్ట్ర మంత్రి ఈటెల రాజేందర్ తదితరులు శరత్‌రావుకు పార్టీ నిర్ణయాన్ని చెప్పారు. సామాజిక సమీకరణల కారణంగా అభ్యర్థిత్వాన్ని మార్చాల్సి వచ్చిందని సర్ధిచెప్పారు. జెడ్పీ సమావేశ మందిరం నుంచి బయటకు వెళ్లిన శరత్‌రావును ఎమ్మెల్యే గంగుల కమలాకర్ వెళ్లి లోనికి తీసుకొచ్చారు. తుల ఉమ అభ్యర్థిత్వాన్ని శరత్‌రావు ప్రతిపాదించాలని పార్టీ నేతలు సూచించినా.. ఎన్నికల అధికారి ప్రతిపాదకులు, బలపరిచేవాళ్లను పిలవకపోవడంతో ఆ అవకాశం రాలేదు. -
జిల్లా పరిషత్‌పై గులాబీ జెండా
కరీంనగర్ సిటీ : జిల్లా పరిషత్‌పై గులాబీ జెండా ఎగిరింది. పూర్తి మెజారిటీ సాధించిన టీఆర్ఎస్ ఊహించినట్లుగానే శనివారం జరిగిన ఎన్నికల్లో జెడ్పీ చైర్పర్సన్, వైస్‌చైర్మన్‌తో పాటు రెండు కో-ఆప్షన్ పదవులను దక్కించుకుంది. మొదట పోటీకి సిద్ధపడ్డ కాంగ్రెస్ సభ్యుల సంఖ్యాబలం లేకపోవడంతో వెనక్కు తగ్గింది. దీం తో ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి. టీఆర్ఎస్ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, కథలాపూర్ జెడ్పీటీసీ సభ్యురాలు తుల ఉమ చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో తొలి జెడ్పీ చైర్‌పర్సన్‌గా, జెడ్పీ చరిత్రలో తొలి మహిళా చైర్‌పర్సన్‌గా రికార్డు సృష్టించారు. చైర్‌పర్సన్‌గా ముం దునుంచి అనుకున్నట్లుగానే ఉమ అభ్యర్థిత్వాన్ని పార్టీ ఖరారు చేసింది. ఉదయం 9.50 గంటలకు తన అభ్యర్థిత్వాన్ని సూచిస్తూ పార్టీ పంపిన అధికారిక లేఖను ఆమె ఎన్నికల అధికారికి అందచేశారు. మధ్యాహ్నం ఒంటిగంటకు జెడ్పీటీసీల ప్రమాణస్వీకారం అనంతరం చైర్పర్సన్ ఎన్నిక నిర్వహిం చారు. అంతకుముందు తుల ఉమ తమ చైర్పర్సన్ అభ్యర్థి అని పార్టీ జెడ్పీటీసీలకు టీఆర్ఎస్ విప్ జారీ చేసింది. ఉమ ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో జెడ్పీ చైర్‌పర్సన్‌గా ఆమె ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి, ఇన్చార్జి కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ ప్రకటించారు. కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక జిల్లా పరిషత్‌లో ఉన్న రెండు కో-ఆప్షన్ పదవులు టీఆర్ఎస్ పరమయ్యాయి. ఉదయం 10లోపు కరీంనగర్ మండలం కొత్తపల్లికి చెందిన ఎండీ.జమీలుద్దీన్, ముస్తాబాద్‌కు చెందిన మహ్మద్సర్వర్ నామినేషన్ వేశారు. రెండు నామినేషన్లే రావడం తో వారిద్దరు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆలస్యంతో చేజారిన అవకాశం రెండు కో-ఆప్షన్ పదవులకు కరీంనగర్‌కు చెందిన జమీల్, జగిత్యాలకు చెందిన ఫయాజుద్దీన్‌ను పార్టీ ముందుగా ఎంపిక చేసింది. ఫయాజ్ 10 గంట ల్లోపు జెడ్పీకి చేరుకోకపోవడంతో అప్పటికే సిద్ధం గా ఉన్న మహ్మద్సర్వర్తో నామినేషన్ వేయించా రు. అయినప్పటికీ ఫయాజుద్దీన్‌తో నామినేషన్ వేయించడానికి పార్టీ నాయకులు ప్రయత్నించగా అధికారులు అంగీకరించలేదు. దీంతో ఆయన కో-ఆప్షన్ సభ్యుడిగా అవకాశం కోల్పోయారు. పార్టీల వారీగా సీటింగ్ జెడ్పీటీసీలకు పార్టీల వారీగా సీటింగ్ ఏర్పాటు చేశారు. ముందు వరుసలో ఎక్స్అఫిషియో సభ్యులకు అనంతరం జాతీయ, ప్రాంతీయపార్టీలవారీగా కేటాయించారు. తెలుగు అక్షరమాల ప్రకారం సభ్యులకు సీట్లు ఏర్పాటు చేశారు. రెండోసారి టీఆర్ఎస్ కైవసం జిల్లా పరిషత్‌ను టీఆర్ఎస్ రెండోసారి కైవసం చేసుకుంది. 2001లో పార్టీ ఆవిర్భావం తర్వాత వచ్చిన స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్ తొలిసారి జెడ్పీ పీఠాన్ని దక్కించుకుంది. 2001 ఆగస్టు 2 నుంచి 2006 జూలై 22 వరకు కేవీ.రాజేశ్వరరావు జెడ్పీ చైర్మన్‌గా ఉన్నారు. ప్రస్తుతం తుల ఉమ చైర్‌పర్సన్‌గా ఎన్నికవడం ద్వారా టీఆర్ఎస్ జెండా జెడ్పీపై జెండా ఎగురవేసింది. కొలువుదీరిన పాలకవర్గం మూడేళ్ల సుదీర్ఘ విరామం అనంతరం జెడ్పీ పాలకవర్గం శనివారం కొలువుతీరింది. మధ్యాహ్నం ఒంటి గంటకు 41 మంది టీఆర్ఎస్ జెడ్పీటీసీలు, 14 మంది కాంగ్రెస్ జెడ్పీటీసీలు, ఒక బీజేపీ, ఒక టీడీపీ సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమాల్లో రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్, పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్, ఎమ్మెల్యేలు కమలాకర్, మనోహర్‌రెడ్డి, విద్యాసాగర్‌రావు, మధు, సత్యనారాయణ, రమేష్‌బాబు, ఈశ్వర్, సతీష్‌బాబు పాల్గొన్నారు. ఇన్చార్జి కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ ఎన్నికల అధికారిగా వ్యహరించగా, జెడ్పీ సీఈవో సదానందం ఎన్నికలు నిర్వహించారు. -
అన్న.. గెలుత్తడు!
సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై జిల్లాలో బెట్టింగ్‌లు జోరందుకున్నాయి. పోలింగ్ ముగిసిన కొద్ది గంటల్లోనే పందెంరాయుళ్లు రంగంలోకి దిగారు. విశ్వసనీయ సమాచారం మేరకు.. జిల్లాలో రూ.50వేల నుంచి రూ.5లక్షల వరకు పందెం కడుతున్నారు. బెట్టింగ్‌ల మొత్తం రూ.కోట్లలో ఉండే అవకాశముంది. ఫలితాల వెల్లడికి మరో పదిహేను రోజులు గడువు ఉండటంతో బెట్టింగ్‌లు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. కరీంనగర్ సిటీ, న్యూస్‌లైన్ : జిల్లాలో 13 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ నియోజకవర్గాలకు సగం నియోజకవర్గాల్లో ఫలితాలను ముందుగానే ఊహిస్తున్నారు. దీంతో పోటాపోటీగా ఉన్న అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాలపైనే పందెంరాయుళ్లు దృష్టి సారించారు. నువ్వా.. నేనా.. అన్నట్లు ఉన్న మంథని, జగిత్యాల, కోరుట్ల, హుస్నాబాద్, కరీంనగర్, ధర్మపురి, వేములవాడ, రామగుండం నియోజకవర్గాల్లో పందెం రూ.లక్షలు దాటిం ది. మిగిలిన నియోజకవర్గాల్లోనూ ఆయా పార్టీల మద్దతుదారులు పందెం కాస్తున్నారు. మంథనిలో ప్రధాన పార్టీల అభ్యర్థుల విజయంపై ఇద్దరు బడా వ్యాపారవేత్తలు రూ.5 లక్షల పందెం వేసుకున్నట్లు ప్రచారంలో ఉంది. ఈ నియోజకవర్గంలోనే ఎక్కువ మొత్తంలో బెట్టింగ్‌లు జరుగుతున్నట్లు సమాచారం. ఇక్కడ ప్రధాన పార్టీల అభ్యర్థుల నడుమ ముఖాముఖి పోటీ నెలకొనడం, పోటీ తీవ్ర స్థాయిలో ఉండటంతో పందెంరాయుళ్లు ఈ నియోజకవర్గంపైనే ఆసక్తి కనపరుస్తున్నారు. ఆయా అభ్యర్థుల అనుచరవర్గం కూడా బెట్టింగ్‌ల మాయలో పడిపోతున్నారు. పోటాపోటీగా ఉన్న జగిత్యాల నియోజకవర్గంలోనూ ఇంచుమించు ఇదే పరిస్థితి ఉంది. జగిత్యాలలోని ఒక డాక్టర్ రూ.2లక్షలకు తమ అభ్యర్థి విజయం సాధిస్తాడని పందెం వేసినట్లు పట్టణంలో ప్రచారం జరుగుతోంది. ఇక్కడ రెండు ప్రధాన పార్టీల అభ్యర్థుల మధ్య ముఖాముఖి పోరు నెలకొనడంతో బెట్టింగ్‌లు జోరందుకుంటున్నట్టు తెలుస్తోంది. రామగుండంలో స్వతంత్ర అభ్యర్థుల విజ యంపైనే పందెం కాశారు. ముగ్గురు స్వతం త్ర అభ్యర్థులు ఏ స్థానంలో ఉంటారనే దానిపై ఎక్కువ పందెం వేసుకోవడం విశేషం. కరీంనగర్ అసెంబ్లీలో ఒక సామాజికవర్గం నాయకులు రూ.లక్షల్లో పందెం కాసినట్లు విని కిడి. మాజీ కార్పొరేటర్లు విదేశీ ప్రయాణంపై పందెం కాసినట్లు తెలిసింది. తమ అభ్యర్థి గెలిస్తే పందెం కాసినవాళ్లు విదేశాలకు తీసుకెళ్లాలని ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. కరీంనగర్, పెద్దపల్లి పార్లమెంట్ స్థానాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థుల విజయంపై పందెంరాయుళ్లు కన్నేశారు. పెద్దపల్లి పార్లమెంట్లో ఎవరు గెలుస్తారనే దానిపై రూ.లక్ష ల్లో పందెం కాశారని సమాచారం. హైదరాబాద్‌కు చెందిన కొంతమంది కూడా జిల్లా ఫలితాలపై పందెం కాస్తుండడం విశేషం. నగదు రూపంలోనే పందెం కాస్తున్నప్పటికి, విదేశీ ప్రయాణం, సెల్ఫోన్లు కూడా బెట్టింగ్‌లో భాగమవుతున్నాయి. బెట్టింగ్ ఆనవాలు జిల్లాలో గతంలో పెద్దగా లేనప్పటికి, ఈసారి మాత్రం పరిస్థితికి అందుకు భిన్నంగా కనిపిస్తోంది. రియల్టర్లు, బడా వ్యాపారవేత్తలు పెద్ద సంఖ్యలో ఈ బెట్టింగ్‌ల్లో పాల్గొంటున్నారు. కొంతమంది అభ్యర్థులు కూడా సరదాగా బెట్టింగ్‌ల్లో పాలుపంచుకుంటున్నట్లు తెలిసింది. ఎక్కువగా ఎవరు విజయం సాధిస్తారనే అంశంపైనే బెట్టింగ్ సాగుతుండగా, కొన్ని చోట్ల ఏ స్థానంలో వస్తారనే దానిపై కూడా పందెం కట్టడం గమనార్హం. మొత్తానికి ఎన్నికల ఫలితాల అనంతరం జిల్లాలో రూ.కోట్లు చేతులు మారనున్నాయి. -
రెబెల్స్‌పై వేటు
కరీంనగర్ సిటీ, న్యూస్‌లైన్: తిరుగుబాటు అభ్యర్థులపై కాంగ్రెస్ వేటువేసింది. రాష్ట్రవ్యాప్తంగా రెబెల్స్‌ను బహిష్కరిస్తూ పార్టీ అధిష్టానం గురువారం నిర్ణయం తీసుకుంది. ఈ జాబితాలో జిల్లా నుంచి ముగ్గురు అభ్యర్థులున్నారు. రామగుండం, కోరుట్ల, హుజూరాబాద్ నుంచి రెబెల్స్‌గా పోటీచేస్తున్న కౌశిక హరి, జువ్వాడి నర్సింగరావు, ఇనుగాల భీంరావులను పార్టీ నుంచి బహిష్కరించారు. రామగుండం నుంచి కౌశిక హరి పార్టీ టికెట్ ఆశించగా, మైనారిటీ కోటా కింద బాబర్‌సలీంపాషా టికెట్ దక్కించుకున్నారు. దీంతో హరి స్వతంత్రంగా బరిలో నిలిచారు. కోరుట్ల నుంచి మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్‌రావు తనయుడు జువ్వాడి నర్సింగరావు టికెట్ ఆశించగా అనూహ్యంగా మాజీ ఎమ్మెల్యే కొమొరెడ్డి రామ్‌లుకు పార్టీ టికెట్ ఇచ్చింది. హుజూరాబాద్ నుంచి కేతిరి సుదర్శన్‌రెడ్డి అభ్యర్థిత్వాన్ని పార్టీ ఖరారు చేయగా, ఇనుగాల భీంరావు రెబెల్‌గా నిలిచారు. దీంతో ఈ ముగ్గురిని పార్టీ నుంచి బహిష్కరిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇద్దరి సస్పెన్షన్ పార్టీ అభ్యర్థికి కాకుండా ఇతరులకు మద్దతునిస్తున్న ఇద్దరు కాంగ్రెస్ నాయకులను సస్పెం డ్ చేసినట్లు డీసీసీ అధ్యక్షుడు కొండూరు రవీం దర్రావు తెలిపారు. కోరుట్లలో పార్టీ అభ్యర్థి కొమొరెడ్డి రామ్‌లుకు కాకుండా స్వతంత్ర అభ్యర్థి జువ్వాడి నర్సింగరావుకు గండ్ర రాజు, మార్కెట్ కమిటీ అధ్యక్షుడు సత్యంరావు మద్దతునిస్తున్నారని పేర్కొన్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందున వారిద్దరి పార్టీ సభ్యత్వాన్ని రద్దు చేసి కాంగ్రెస్ నుంచి సస్పెండ్ చేసినట్లు తెలిపారు. -
ఉద్యమాల గడ్డనుంచే శంఖారావం
13న కేసీఆర్.. 16న సోనియా.. పోటాపోటీగా టీఆర్ఎస్, కాంగ్రెస్ బహిరంగ సభలు కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి పదునుపెట్టాయి. తెలంగాణలో గెలుపే ధ్యేయంగా రెండు పార్టీలు పావులు కదుపుతున్నాయి. రాష్ట్ర సాధన తమ ఘనతేనని చెప్పుకుంటూ ఓట్లు రాబట్టుకునేందుకు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. ఈ తరుణంలో రెండు పార్టీల అధినేతలు జిల్లా నుంచే ఎన్నికల శంఖారావాన్ని పూరించనుండటం మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. తెలంగాణ ఉద్యమానికి పురిటిగడ్డగా పేరొందిన కరీంనగర్ నుంచే ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టేందుకు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రానున్నారు. - న్యూస్‌లైన్, కరీంనగర్ సిటీ 16న సోనియా సభ కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఈ నెల 16వ తేదీన జిల్లాకు రానున్నారు. నగరంలో జరిగే భారీ బహిరంగసభలో ఆమె పాల్గొంటారు. 2004 ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్లో జరిగిన బహిరంగ సభలో సోనియాగాంధీ పాల్గొన్నారు. తెలంగాణ ప్రజల మనసులో ఉన్న కోరికను నెరవేరుస్తామని ఆమె ప్రకటించారు. కరీంనగర్లో ఇచ్చిన మాటకు కట్టుబడే ఎన్ని అవాంతరాలు ఎదురైనా సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారని కాంగ్రెస్ నేతలు పదేపదే చెబుతున్నారు. ఈ విషయాన్ని ఎన్నికల నినాదంగా ప్రజల్లోకి తీసుకె ళ్లడం ద్వారా లబ్ధిపొందేందుకు ప్రయత్నిస్తున్నారు. జిల్లాలో సోనియా బహిరంగసభను నిర్వహించడం ద్వారా తెలంగాణ క్రెడిట్‌ను తమ ఖాతాలో వేసుకొనేందుకు కాంగ్రెస్ నాయకులు వ్యూహరచన చేస్తున్నారు. సోనియా కృతజ్ఞత సభ గతంలో మూడుసార్లు వాయిదాపడగా, ఏకంగా సోనియాతోనే సభనిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. 13న కేసీఆర్ శంఖారావం కేసీఆర్ తన సెంటిమెంట్ ప్రకారం ఎన్నికల శంఖారావం ఇక్కడే పూరించనున్నా రు. తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారిగా జరుగుతున్న ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. ముందుగా నిర్ణయించిన ప్రకారం 7నుంచి.. 11వ తేదీకి సభను వాయిదా వేశారు. అదే రోజు ఎంపీటీసీ, జెడ్పీటీసీ రెండో విడత ఎన్నికలు ఉన్నందున ఈ నెల 12న నిర్వహిస్తామన్నారు. చివరకు 13న ఖరారు చేశారు. ఎస్సారార్ కళాశాల మైదానంలో సభ నిర్వహిస్తున్నట్లు పార్టీ నాయకులు తెలిపారు. పదమూడేళ్ల తమ పోరాటాలతోనే తెలంగాణ వచ్చిందని, రాష్ట్ర వికాసం సైతం తమతోనే సాధ్యమనే సందేశాన్ని కేసీఆర్ ఈ సభ ద్వారా ప్రజలకు ఇవ్వనున్నారు. టీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత 2001లో ఎస్సారార్ కళాశాల మైదానంలో జరిగిన సంహరగ్జన సభ తరహాలోనే దీనిని విజయవంతం చేసేందుకు ప్రణాళిక రూపొందించారు. -
కమిటీలు ఖరారు
మున్సిపల్ ఎన్నికల్లో పార్టీల అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కొలిక్కి వస్తోంది. కమిటీల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయాలని ఇప్పటికే నిర్ణయించిన అన్ని పార్టీలు ఆ దిశగా కసరత్తు పూర్తిచేశాయి. పీసీసీ సమావేశంలో అధికార కాంగ్రెస్ పార్టీ, కేసీఆర్ ఆదేశాల మేరకు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక కమిటీలు నియమించాయి. మున్సిపల్ ఎన్నికల్లో గెలిచి సత్తా చాటేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక కోసం గురువారం స్క్రీనింగ్ కమిటీ నియమించింది. ఉనికి చాటుకోవడమే లక్ష్యంగా టీడీపీ కూడా సమన్వయ కమిటీ ఏర్పాటు చేసుకుని ఆశావహుల నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించింది. - న్యూస్‌లైన్, కరీంనగర్ సిటీ పురపాలక, నగరపాలక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థులను ఎంపిక చేసేందుకు అన్నిపార్టీల కసరత్తు దాదాపు పూర్తయింది. ఈసారి డెరైక్ట్‌గా అభ్యర్థులను ప్రకటించకుండా కమిటీలు వేసి ఎంపికచేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఆరుగురితో కమిటీ నియమించింది.మున్సిపల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై గురువారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో జరిగిన సమావేశంలో చర్చించారు. కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే రంగంలోకి దిగుతుండడంతో, పార్టీ విజయాలను ఆషామాషీగా తీసుకోవద్దని పీసీసీ చీఫ్ బొత్ససత్యనారాయణ మార్గ నిర్దేశం చేశారు. అభ్యర్థుల ఎంపిక కోసం స్థానికంగా కమిటీలు ఏర్పాటు చేశారు. జిల్లా నుంచి మారూ. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఎంపీ పొన్నం ప్రభాకర్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, డీసీసీ అధ్యక్షుడు కొండూరు రవీందర్రావు, నగర అధ్యక్షుడు కన్న కృష్ణ హాజరయ్యారు. కార్పొరేషన్, మున్సిపాలిటీలకు వేర్వేరుగా కమిటీలు ఏర్పాటయ్యాయి. కమిటీలను డీసీసీ అధ్యక్షుడు పర్యవేక్షిస్తారు. అవసరమైన చోట శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్ నిర్ణయం తీసుకుంటారు. నగరపాలకసంస్థ అభ్యర్థులకు నగర కాంగ్రెస్ అధ్యక్షుడు, మున్సిపాలిటీలకు డీసీసీ అధ్యక్షుడు సంతకం చేసి బీ-ఫారాలు ఇస్తారు. టీఆర్ఎస్ అభ్యర్థుల ఎంపిక, గెలిపించే బాధ్యతను టీఆర్ఎస్ పార్టీ కమిటీలకు అప్పగించింది. జిల్లా నేతలతో భేటీ సందర్భంగా కేసీఆర్ పలు కీలక సూచనలు చేశారు. ఒంటరిపోరు, తెలంగాణ రాష్ట్రం వచ్చాక జరుగుతున్న తొలి ఎన్నికలు కావడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని సూచించారు. అభ్యర్థుల ఎంపిక, విజయాన్ని సీరియస్‌గా తీసుకోవాలని హితబోధ చేశారు. కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా గురువారం కరీంనగర్లో సమావేశమైన టీఆర్ఎస్ నేతలు కమిటీలకు తుది రూపు ఇచ్చారు. ఈ కమిటీలే అభ్యర్థులను ఎంపికచేయడంతోపాటు పోలింగ్ వరకు పర్యవేక్షిస్తాయి. వైఎస్సార్సీపీ సమన్వయ కమిటీ మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్క్రీనింగ్ కమిటీలు నియమించింది. పా ర్టీ జిల్లా అధ్యక్షుడు సింగిరెడ్డి భాస్కర్‌రెడ్డి స్క్రీనింగ్ కమి టీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. సభ్యులుగా స్థానిక నేత లు ఉంటారు. గురువారం కరీంనగర్ నగరపాలక సంస్థ కు సంబంధించిన స్క్రీనింగ్ కమిటీని నియమించారు. పార్టీ నగర అధ్యక్షుడు డాక్టర్ కె.నగేశ్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు అక్కెనపల్లి కుమార్, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు జివరాల శ్రీనివాస్, సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు జూపాక సుదర్శన్, యూత్ రాష్ట్ర కమిటీ సభ్యుడు శ్రీరవి, మైనారిటీ విభాగం నాయకుడు సయ్యద్‌ఖాన్, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు భూక్యా రఘునాయక్ సభ్యులుగా వ్యవహరిస్తారు. ఆశావహుల నుంచి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, అర్హత, విజయావకాశాల ప్రాతిపదికన అభ్యర్థులను ఎంపిక చేస్తారు. నగరపాలక సంస్థకు సంబంధించి ఇప్పటికే 86 దరఖాస్తులు రాగా, వాటిని స్క్రీనింగ్ కమిటీ పరిశీలించి, ఎంపిక చేస్తుందని పార్టీ జిల్లా అధ్యక్షుడు సింగిరెడ్డి భాస్కర్‌రెడ్డి తెలిపారు. టీడీపీ ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించే ప్రక్రియకు టీడీపీ గురువారం శ్రీకారం చుట్టింది. పార్టీ జిల్లా అధ్యక్షుడు విజయరమణారావు, వాసాల రమేశ్ తదితర ముఖ్యనేతలతో కూడిన సమన్వయ కమిటీ దరఖాస్తులను స్వీకరించి, అందులో నుంచి అభ్యర్థులను ఎంపిక చేయనుంది. నగరపాలకసంస్థలతోపాటు, మున్సిపాలిటీలు, నగరపంచాయతీలో సమన్వయ కమిటీయే అభ్యర్థులను ఎంపికచేస్తుంది.