13న కేసీఆర్.. 16న సోనియా..
పోటాపోటీగా టీఆర్‌ఎస్,
కాంగ్రెస్ బహిరంగ సభలు
కాంగ్రెస్, టీఆర్‌ఎస్ పార్టీలు సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి పదునుపెట్టాయి. తెలంగాణలో గెలుపే ధ్యేయంగా రెండు పార్టీలు పావులు కదుపుతున్నాయి. రాష్ట్ర సాధన తమ ఘనతేనని చెప్పుకుంటూ ఓట్లు రాబట్టుకునేందుకు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. ఈ తరుణంలో రెండు పార్టీల అధినేతలు జిల్లా నుంచే ఎన్నికల శంఖారావాన్ని పూరించనుండటం మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. తెలంగాణ ఉద్యమానికి పురిటిగడ్డగా పేరొందిన కరీంనగర్ నుంచే ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టేందుకు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ రానున్నారు.
- న్యూస్‌లైన్, కరీంనగర్ సిటీ
16న సోనియా సభ
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఈ నెల 16వ తేదీన జిల్లాకు రానున్నారు. నగరంలో జరిగే భారీ బహిరంగసభలో ఆమె పాల్గొంటారు. 2004 ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్‌లో జరిగిన బహిరంగ సభలో సోనియాగాంధీ పాల్గొన్నారు. తెలంగాణ ప్రజల మనసులో ఉన్న కోరికను నెరవేరుస్తామని ఆమె ప్రకటించారు. కరీంనగర్‌లో ఇచ్చిన మాటకు కట్టుబడే ఎన్ని అవాంతరాలు ఎదురైనా సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారని కాంగ్రెస్ నేతలు పదేపదే చెబుతున్నారు.
ఈ విషయాన్ని ఎన్నికల నినాదంగా ప్రజల్లోకి తీసుకె ళ్లడం ద్వారా లబ్ధిపొందేందుకు ప్రయత్నిస్తున్నారు. జిల్లాలో సోనియా బహిరంగసభను నిర్వహించడం ద్వారా తెలంగాణ క్రెడిట్‌ను తమ ఖాతాలో వేసుకొనేందుకు కాంగ్రెస్ నాయకులు వ్యూహరచన చేస్తున్నారు. సోనియా కృతజ్ఞత సభ గతంలో మూడుసార్లు వాయిదాపడగా, ఏకంగా సోనియాతోనే సభనిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు.
13న కేసీఆర్ శంఖారావం
కేసీఆర్ తన సెంటిమెంట్ ప్రకారం ఎన్నికల శంఖారావం ఇక్కడే పూరించనున్నా రు. తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారిగా జరుగుతున్న ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. ముందుగా నిర్ణయించిన ప్రకారం 7నుంచి.. 11వ తేదీకి సభను వాయిదా వేశారు. అదే రోజు ఎంపీటీసీ, జెడ్పీటీసీ రెండో విడత ఎన్నికలు ఉన్నందున ఈ నెల 12న నిర్వహిస్తామన్నారు. చివరకు 13న ఖరారు చేశారు.
ఎస్సారార్ కళాశాల మైదానంలో సభ నిర్వహిస్తున్నట్లు పార్టీ నాయకులు తెలిపారు. పదమూడేళ్ల తమ పోరాటాలతోనే తెలంగాణ వచ్చిందని, రాష్ట్ర వికాసం సైతం తమతోనే సాధ్యమనే సందేశాన్ని కేసీఆర్ ఈ సభ ద్వారా ప్రజలకు ఇవ్వనున్నారు. టీఆర్‌ఎస్ ఆవిర్భావం తర్వాత 2001లో ఎస్సారార్ కళాశాల మైదానంలో జరిగిన సంహరగ్జన సభ తరహాలోనే దీనిని విజయవంతం చేసేందుకు ప్రణాళిక రూపొందించారు.