కరీంనగర్ సిటీ : జిల్లా పరిషత్ తొలి మహిళా చైర్‌పర్సన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన తుల ఉమ అభివృద్ధి ఎజెండాను వెల్లడించారు. జిల్లా అభివృద్ధి, సంక్షేమం, మహిళారంగ అభ్యున్నతిపై తనకున్న విజన్‌ను ప్రజల ముందుంచారు. శనివారం జెడ్పీ చైర్‌పర్సన్‌గా ఎన్నికైన అనంతరం ‘సాక్షి’కి ఇంటర్వ్యూ ఇచ్చారు.
తొలి మహిళా చైర్‌పర్సన్‌గా
ఎన్నికవడం ఎలా అనిపిస్తోంది?
ఉమ : మాటల్లో చెప్పలేనంత సంతోషంగా ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నపుడు మహిళలకు అవకాశం రాలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే తొలిసారి జిల్లా పరిషత్ పీఠాన్ని అధిష్టించే అవకాశం మహిళలకు దక్కింది.
పదవి మీకే దక్కుతుందనుకున్నారా?
ఉమ : నాకైతే ముందునుంచి ఎలాంటి అనుమానం లేదు. మా అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నన్ను ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీ చేయాలని అనుకున్నారు. కొన్ని పరిస్థితుల వల్ల అది వీలు పడలేదు. జెడ్పీచైర్‌పర్సన్ బీసీ మహిళకు కేటాయించడంతోనే కేసీఆర్ నన్ను చైర్‌పర్సన్ చేయాలని నిర్ణయించారు. అందుకే ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని, సామాన్య కుటుంబం నుంచి వచ్చిన నాకు చైర్‌పర్సన్‌గా అవకాశం ఇచ్చారు. కేసీఆర్‌కు కృతజ్ఞతలు.
మహిళలకు అవకాశం కల్పించడాన్ని ఎలా భావిస్తున్నారు?
ఉమ : రాజకీయంగా ఉన్నత పదవులు మహిళలకు రావడం తక్కువే. మహిళలకు అవకాశం వస్తే నీతి, నిజాయతీగా పరిపాలిస్తారని ఎన్నోసార్లు రుజువైంది. ప్రస్తుతం జిల్లాలో 50 శాతం కన్నా ఎక్కువ మహిళా ప్రజాప్రతినిధులం ఉన్నాం.
చైర్‌పర్సన్‌గా మీ ప్రాధాన్యతాంశాలేమిటి?
ఉమ : విద్య, వైద్య రంగాలకు పెద్దపీట వేస్తా. గ్రామాల్లో పర్యటించినపుడు డ్రెయినేజీ సమస్య అధికంగా ఉన్నట్లు నా దృష్టికి వచ్చింది. ఆ సమస్యను పరిష్కరిస్తా. ప్రధానంగా జిల్లా పరిషత్ పాఠశాలల్లో టాయ్‌లెట్స్ లేక విద్యార్థినులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఒక ఏడాదిలోగా జిల్లాలోని అన్ని పాఠశాలల్లో టాయ్‌లెట్స్ నిర్మించి, విద్యార్థినుల ఇబ్బందులు తొలగిస్తా.
మీ పరిపాలన ఎలా ఉండబోతోంది?
ఉమ : చైర్‌పర్సన్‌గా నేను చేపట్టిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తా. అవినీతికి తావులేని నీతి, నిజాయితీతో కూడిన పాలన అందిస్తా.
విద్య, వైద్యానికి పెద్దపీట
Published Sun, Jul 6 2014 3:13 AM | Last Updated on Sat, Sep 2 2017 9:51 AM
Advertisement
Advertisement