న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ చమురు, గ్యాస్ ఉత్పత్తి దిగ్గజం ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్‌జీసీ)కి తొలి మహిళా చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా (తాత్కాలిక ప్రాతిపదికన) అల్కా మిట్టల్ నియమితులయ్యారు. డిసెంబర్ 31తో పదవీ విరమణ చేసిన తాత్కాలిక హెడ్ సుభాష్ కుమార్ స్థానంలో ఆమె నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2022 జనవరి 1 నుంచి ఆరు నెలల పాటు అల్కా మిట్టల్ (59)కు ఓఎన్‌జీసీ సీఎండీగా అదనపు బాధ్యతలు అప్పగించాలన్న కేంద్ర పెట్రోలియం, నేచురల్ గ్యాస్ శాఖ ప్రతిపాదనకు క్యాబినెట్ నియామకాల కమిటీ ఆమోదం తెలిపినట్లు సిబ్బంది, శిక్షణ విభాగం (డీవోపీటీ) వెల్లడించింది. ఆమె బాధ్యతలు చేపట్టినట్లు ఓఎన్‌జీసీ తెలిపింది.
ఆగస్టు ఆఖరుతో మిట్టల్ పదవీకాలం పూర్తవుతుంది. అల్కా మిట్టల్ .. ఆర్థిక శాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్, కామర్స్‌లో డాక్టరేట్ చేశారు. 2018 నవంబర్ 27న ఓఎన్‌జీసీ బోర్డులో తొలి మహిళా మెంబర్‌గా నియమితులయ్యారు. ఒక చమురు, గ్యాస్ అన్వేషణ, ఉత్పత్తి కంపెనీకి .. మహిళ సారథ్యం వహించడం ఇదే తొలిసారి. అప్పట్లో (2014లో) ప్రభుత్వ రంగ రిఫైనర్, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్‌పీసీఎల్)కు తొలి మహిళా హెడ్‌గా నిశి వాసుదేవ సేవలు అందించారు. ఓఎన్‌జీసీలో ప్రస్తుతం ఇద్దరు పూర్తి స్థాయి మహిళా డైరెక్టర్లు ఉన్నట్లవుతుంది. ఫైనాన్స్ విభాగం డైరెక్టరుగా పమిలా జస్పాల్‌ను పబ్లిక్ ఎంటర్‌ప్రైజ్ సెలక్షన్ బోర్డు (పీఈఎస్‌బీ) ఇటీవలే ఎంపిక చేసింది. ఆమె ప్రస్తుతం ఓఎన్‌జీసీ అనుబంధ సంస్థ మంగళూరు రిఫైనరీ పెట్రోకెమికల్స్ డైరెక్టర్ (ఫైనాన్స్)గా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment