Natural Gas Corporation
-
ఓఎన్జీసీకి తొలి మహిళా సీఎండీ
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ చమురు, గ్యాస్ ఉత్పత్తి దిగ్గజం ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్జీసీ)కి తొలి మహిళా చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా (తాత్కాలిక ప్రాతిపదికన) అల్కా మిట్టల్ నియమితులయ్యారు. డిసెంబర్ 31తో పదవీ విరమణ చేసిన తాత్కాలిక హెడ్ సుభాష్ కుమార్ స్థానంలో ఆమె నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2022 జనవరి 1 నుంచి ఆరు నెలల పాటు అల్కా మిట్టల్ (59)కు ఓఎన్జీసీ సీఎండీగా అదనపు బాధ్యతలు అప్పగించాలన్న కేంద్ర పెట్రోలియం, నేచురల్ గ్యాస్ శాఖ ప్రతిపాదనకు క్యాబినెట్ నియామకాల కమిటీ ఆమోదం తెలిపినట్లు సిబ్బంది, శిక్షణ విభాగం (డీవోపీటీ) వెల్లడించింది. ఆమె బాధ్యతలు చేపట్టినట్లు ఓఎన్జీసీ తెలిపింది. ఆగస్టు ఆఖరుతో మిట్టల్ పదవీకాలం పూర్తవుతుంది. అల్కా మిట్టల్ .. ఆర్థిక శాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్, కామర్స్‌లో డాక్టరేట్ చేశారు. 2018 నవంబర్ 27న ఓఎన్జీసీ బోర్డులో తొలి మహిళా మెంబర్‌గా నియమితులయ్యారు. ఒక చమురు, గ్యాస్ అన్వేషణ, ఉత్పత్తి కంపెనీకి .. మహిళ సారథ్యం వహించడం ఇదే తొలిసారి. అప్పట్లో (2014లో) ప్రభుత్వ రంగ రిఫైనర్, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్‌పీసీఎల్)కు తొలి మహిళా హెడ్‌గా నిశి వాసుదేవ సేవలు అందించారు. ఓఎన్జీసీలో ప్రస్తుతం ఇద్దరు పూర్తి స్థాయి మహిళా డైరెక్టర్లు ఉన్నట్లవుతుంది. ఫైనాన్స్ విభాగం డైరెక్టరుగా పమిలా జస్పాల్‌ను పబ్లిక్ ఎంటర్ప్రైజ్ సెలక్షన్ బోర్డు (పీఈఎస్బీ) ఇటీవలే ఎంపిక చేసింది. ఆమె ప్రస్తుతం ఓఎన్జీసీ అనుబంధ సంస్థ మంగళూరు రిఫైనరీ పెట్రోకెమికల్స్ డైరెక్టర్ (ఫైనాన్స్)గా ఉన్నారు. -
నదీ తీరంలో.. చమురు నిక్షేపాలు!
అలంపూర్ రూరల్: జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ వద్ద భూగర్భంలో క్రూడాయిల్, పెట్రోల్, గ్యాస్ వంటి చమురు నిక్షేపాలు ఉన్న ట్టు భారతీయ ప్రభుత్వ రంగ సంస్థ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్(ఓఎన్జీ సీ) గుర్తించినట్లు సమాచారం. సహజ సిద్ధ వాయువులు గ్యాస్, పెట్రో, డీజిల్‌పై నిత్య పరిశోధనల్లో భాగంగా శాటిలైట్ సిగ్నల్స్ ద్వారా ఈ ప్రాంతంలో చమురు నిక్షేపాలు ఉండటాన్ని గుర్తించారు. మరింత సమాచారం కోసం పరిశోధనల బాధ్యతలను ‘గ్లోబల్ ఎకాలజిస్ట్ ప్రైవేట్ లిమిటెడ్’కు అప్పగించారు. ఈ సందర్భంగా సంస్థ ఉద్యోగులు మూడు రోజులుగా జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ తుంగభద్ర నదీ తీరమైన సుల్తానాపూర్ నుంచి నదీ తీర గ్రామాలైన అలంపూర్, కాశీపురం, సింగవరం, భైరాపురం పరిసరాల్లో చమురు నిక్షేపాల అన్వేషణకు పరిశోధనలు జరిపారు. చమురు నిక్షేపాల ప్రకంపనల వివరాలను ఉప గ్రహాల ద్వారా గమనిస్తూ వాటి నిష్పత్తిని ఓఎన్జీసీ ప్రధాన కార్యాలయమైన డెహ్రాడూన్‌కు పంపారు. అలంపూర్‌లో మూడు రోజుల పాటు చేపట్టిన పరిశోధనలు సోమవారం ముగియగా.. ప్రస్తుతం కర్నూలు జిల్లా పంచ లింగాలకు వెళ్లారు. తెలంగాణలోని రాజోళిలో కూడా పరిశోధన సాగే అవకాశం ఉంది. ఖమ్మం వంటి ప్రాంతాల్లో కూడా పరిశోధనలు చేసే అవకాశముందని సమాచారం. -
మూడు రెట్లు పెరిగిన ఓఎన్జీసీ లాభం
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్(ఓఎన్జీసీ)నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో మూడు రెట్లు పెరిగింది. గత క్యూ3లో రూ.1,466 కోట్లుగా ఉన్న తమ నికర లాభం ఈ క్యూ3లో రూ.4,352 కోట్లకు ఎగసిందని ఓఎన్జీసీ తెలిపింది. ముడి చమురు ధరలు అధికంగా ఉండటంతో ఈ స్థాయి నికర లాభం వచ్చిందని వివరించింది. చమురు ఉత్పత్తి 2 శాతం క్షీణించి 6.4 మిలియన్ టన్నులకు తగ్గగా, గ్యాస్ ఉత్పత్తి 4.4 శాతం వృద్ధి చెంది 6.025 బిలియన్ క్యూబిక్ మీటర్లకు పెరిగిందని పేర్కొంది. ఒక్కో షేర్‌కు రూ.2.25 డివిడెండ్: రూ. 5 ముఖవిలువ గల ఒక్కో షేర్‌కు రూ.2.25 రెండవ మధ్యతంర డివిడెండ్(45 శాతం)ను ఇవ్వనున్నామని కంపెనీ తెలిపింది. మొత్తం రూ.2,887 కోట్లు డివిడెండ్‌గా చెల్లించనున్నామని, దీంట్లో ప్రభుత్వం వాటా రూ.1,973 కోట్లని ఓఎన్జీసీ పేర్కొంది.