మూడు రెట్లు పెరిగిన ఓఎన్‌జీసీ లాభం
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్(ఓఎన్‌జీసీ)నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో మూడు రెట్లు పెరిగింది. గత క్యూ3లో రూ.1,466 కోట్లుగా ఉన్న తమ నికర లాభం ఈ క్యూ3లో రూ.4,352 కోట్లకు ఎగసిందని ఓఎన్‌జీసీ తెలిపింది. ముడి చమురు ధరలు అధికంగా ఉండటంతో ఈ స్థాయి నికర లాభం వచ్చిందని వివరించింది. చమురు ఉత్పత్తి 2 శాతం క్షీణించి 6.4 మిలియన్ టన్నులకు తగ్గగా, గ్యాస్ ఉత్పత్తి 4.4 శాతం వృద్ధి చెంది 6.025 బిలియన్ క్యూబిక్ మీటర్లకు పెరిగిందని పేర్కొంది. ఒక్కో షేర్‌కు రూ.2.25 డివిడెండ్: రూ. 5 ముఖవిలువ గల ఒక్కో షేర్‌కు రూ.2.25 రెండవ మధ్యతంర డివిడెండ్(45 శాతం)ను ఇవ్వనున్నామని కంపెనీ తెలిపింది. మొత్తం రూ.2,887 కోట్లు డివిడెండ్‌గా చెల్లించనున్నామని, దీంట్లో ప్రభుత్వం వాటా రూ.1,973 కోట్లని ఓఎన్‌జీసీ పేర్కొంది.