
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ దిగ్గజాలు ఎన్‌టీపీసీ, ఓఎన్‌జీసీ తాజాగా చేతులు కలిపాయి. తద్వారా నూతన, పునరుత్పాదక ఇంధన విభాగంలో అవకాశాలను అన్వేషించనున్నాయి. ఇందుకు అనుగుణంగా గ్రీన్ ఎనర్జీ అనుబంధ సంస్థల ద్వారా భాగస్వామ్య కంపెనీ(జేవీ)కి తెరతీయనున్నాయి.
చమురు దిగ్గజం ఓఎన్‌జీసీ సహకారంతో కొత్తతరం ఇంధన అవకాశాలను అందిపుచ్చుకోనున్నట్లు విద్యుత్ రంగ దిగ్గజం ఎన్‌టీపీసీ పేర్కొంది. ఓజీఎల్‌తో సమాన భాగస్వామ్య(50:50 వాటా) కంపెనీ(జేవీసీ) ఏర్పాటుకు వీలుగా కార్పొరేట్ వ్యవహారాల శాఖకు ఎన్‌జీఈఎల్ దరఖాస్తు చేసినట్లు తెలియజేసింది.
సోలార్, విండ్, ఎనర్జీ స్టోరేజీ, ఈమొబిలిటీ, కార్బన్ క్రెడిట్స్ తదితర న్యూ ఎనర్జీ అవకాశాలపై జేవీ పనిచేయనున్నట్లు వివరించింది. పునరుత్పాదక ఇంధన ఆస్తుల కొనుగోలుతోపాటు.. తమిళనాడు, గుజరాత్‌లలో రాబోయే ఆఫ్‌షోర్ విండ్ టెండర్లలో పాలుపంచుకునే యోచనలో ఉన్నట్లు వెల్లడించింది.