
న్యూఢిల్లీ: ఓఎన్‌జీసీ–ఎన్‌టీపీసీ గ్రీన్ (ఓఎన్‌జీపీఎల్) తాజాగా అయానా రెన్యూవబుల్ పవర్‌ను కొనుగోలు చేయనుంది. ఇందుకోసం ఈక్విటీ, రుణభారాన్ని కూడా కలిపి కంపెనీ విలువను (ఎంటర్‌ప్రైజ్ వేల్యూ) రూ.19,500 కోట్లుగా (2.3 బిలియన్ డాలర్లు) లెక్కగట్టారు. ఓఎన్‌జీపీఎల్ నిర్దిష్ట మొత్తాన్ని అయానా యజమానులకు చెల్లించి, కంపెనీ రుణాలను తనకు బదలాయించుకునే విధంగా ఒప్పందం కుదిరింది. అయితే, ఎంత మొత్తం చెల్లించేదీ వెల్లడి కాలేదు.
ఈ వ్యవహారానికి సంబంధించి అయానా ప్రస్తుత షేర్‌హోల్డర్లయిన నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (51 శాతం), బ్రిటీష్ ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్..దాని అనుబంధ సంస్థలు (32 శాతం), ఎవర్‌సోర్స్ క్యాపిటల్ (17 శాతం) నుంచి 100 శాతం వాటాలను కొనుగోలు చేసేందుకు ఓఎన్‌జీపీఎల్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. 2024 నవంబర్‌లో ఏర్పాటైన తర్వాత తమ సంస్థకు ఇది తొలి వ్యూహాత్మక పెట్టుబడని ఓఎన్‌జీపీఎల్ తెలిపింది. పునరుత్పాదక ఇంధన విభాగంలో ఇది రెండో అతి పెద్ద డీల్‌గా నిలవనుంది. 2021 అక్టోబర్‌లో సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్ కార్ప్, భారతి గ్రూప్ నుంచి ఎస్‌బీ ఎనర్జీ ఇండియాను అదానీ గ్రీన్ ఎనర్జీ (ఏజీఈఎల్) కొనుగోలు చేసింది. అప్పట్లో ఆ డీల్ విలువ ఏకంగా 3.5 బిలియన్ డాలర్లు. ఇక గతేడాది డిసెంబర్‌లో ఓ2 పవర్ పూలింగ్ అనే రెన్యూవబుల్ ఎనర్జీ ప్లాట్‌ఫాంను జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ దక్కించుకుంది. ఇందుకోసం ఎంటర్‌ప్రైజ్ విలువను రూ. 12,468 కోట్లుగా (1.47 బిలియన్ డాలర్లు) లెక్కగట్టారు.
ఇదీ చదవండి: కొత్త పన్ను చట్టం.. ఎంతో సులభతరం!
4.1 గిగావాట్ల సామర్థ్యం..
అయానాకు 4.1 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్ అసెట్లు ఉన్నాయి. వీటిలో కొన్ని ఇప్పటికే పని చేస్తుండగా మరికొన్ని నిర్మాణంలో ఉన్నాయి. మరోవైపు, చమురు..గ్యాస్ దిగ్గజం ఓఎన్‌జీసీ, విద్యుదుత్పత్తి దిగ్గజం ఎన్‌టీపీసీ కలిసి జాయింట్ వెంచర్‌గా ఓఎన్‌జీపీఎల్‌ను ఏర్పాటు చేశాయి. ఇందులో రెండు సంస్థలకూ చెరి 50 శాతం వాటాలు ఉన్నాయి. 2038 నాటికి కర్బన ఉద్గారాలను తటస్థ స్థాయికి తగ్గించుకునే దిశగా హరిత హైడ్రోజన్ ప్లాంట్లు, పునరుత్పాదక విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయడంపై రూ. 2 లక్షల కోట్లు వెచ్చించనున్నట్లు ఓఎన్‌జీసీ గతేడాది వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment