
ఎలక్ట్రిక్ వాహనాలు (ఈవీ), పునరుత్పాదక ఇంధన రంగాల్లో గ్లోబల్ లీడర్‌గా ఉన్న టెస్లా ఇంక్ భారత మార్కెట్లోకి ప్రవేశించేందుకు సిద్ధమవుతోంది. ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన సందర్భంగా టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్‌ల మధ్య సమావేశం జరిగింది. ఈ నేపథ్యంలో కొన్ని వాణిజ్య అంశాలపై చర్చించారు. అందులో భాగంగా టెస్లా భారత్‌లో ప్రవేశానికి సంబంధించిన అంశాలు ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. దాంతో త్వరలో దీనిపై నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు సమాచారం. ఈ అనుమానాలకు ఊతమిచ్చేలా ముంబై, ఢిల్లీలో కస్టమర్ ఫేసింగ్, బ్యాకెండ్ పొజిషన్లలో పని చేసేందుకు 13 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు టెస్లా ప్రకటించింది. దాంతో టెస్టా భారత్‌లో ప్రవేశించేందుకు అడ్డంకులు తొలిగే అవకాశం ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.
వ్యూహాత్మక ఎత్తుగడ..
టెస్లా భారతదేశంలో నియామకాలు చేపట్టాలని తీసుకున్న నిర్ణయం దేశంలో తన ఉనికిని స్థాపించే దిశగా ఒక కీలక అడుగుగా భావిస్తున్నారు. సర్వీస్ టెక్నీషియన్, టెస్లా అడ్వైజర్, ఇన్‌సైడ్ సేల్స్ అడ్వైజర్, స్టోర్ మేనేజర్, బిజినెస్ ఆపరేషన్స్ అనలిస్ట్ వంటి పోస్టులను ఈ మేరకు భర్తీ చేయనున్నారు. హైఎండ్ కార్లపై దిగుమతి సుంకాన్ని భారతదేశం ఇటీవల 110% నుంచి 70%కు తగ్గించిన తరువాత ఇలా నియామకాలు చేపడుతున్నట్లు ప్రకటించారు. టెస్లా వంటి లగ్జరీ కార్ల తయారీదారులు మార్కెట్లోకి ప్రవేశించడం ఆర్థికంగా మరింత లాభదాయకంగా మారనుందని కొందరు అభిప్రాయపడుతున్నారు.
భారత మార్కెట్లో అవకాశాలు
చైనా వంటి దేశాలతో పోలిస్తే భారత ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ ఇంకా తక్కువగానే ఉంది. 2024లో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు 1,00,000 యూనిట్లకు దగ్గరగా ఉన్నందున భారత ప్రభుత్వం ఈ రంగంలో మరింత వృద్ధి తీసుకురావాలని ప్రయత్నిస్తోంది. అందుకోసం ఎలక్ట్రిక్ వాహన తయారీదారులకు ప్రోత్సాహకాలు అందిస్తోంది. ఈ వ్యవహారం టెస్లాకు గణనీయమైన అవకాశాన్ని అందించనుంది. 2070 నాటికి నికర సున్నా ఉద్గారాలను సాధించడానికి దేశం కట్టుబడి ఉంది. అందుకోసం సుస్థిర ఇంధన పరిష్కారాలను ప్రోత్సహించడంలో భాగంగా టెస్లా వంటి కంపెనీలకు కేంద్రం ఆమోదముద్ర వేసే అవకాశాలు కనిపిస్తున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఇదీ చదవండి: పరుగు ఆపని పసిడి! తులం ఎంతంటే..
స్టార్ లింక్‌కు గ్రీన్ సిగ్నల్..?
ఇటీవల మస్క్-మోదీల మధ్య జరిగిన సమావేశం అనంతరం మస్క్‌కు చెందిన శాటిలైట్ బ్రాడ్ బ్యాండ్ సర్వీస్ స్టార్ లింక్ భారత మార్కెట్లోకి ప్రవేశించడంపై కూడా చర్చ జరుగుతుంది. ట్రాయ్ ఆంక్షల కారణంగా స్టార్ లింక్ భారత్‌లోకి ప్రవేశించడం ఆలస్యం అవుతుంది. అయితే మోదీ, మస్క్ ఇద్దరూ ఈ సమస్యలను పరిష్కరించడానికి ఆసక్తిని వ్యక్తం చేసినట్లు తెలిసింది. స్టార్ లింక్ లైసెన్సింగ్ సవాళ్ల పరిష్కారానికి భారత ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, ఇది రెండు దేశాల మధ్య సాంకేతిక సహకారాన్ని పెంపొందించడానికి మార్గం సుగమం చేస్తుందని కొందరు అధికారులు తెలియజేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment