
ఎలక్ట్రిక్ కార్ల యూఎస్ దిగ్గజం టెస్లా(Tesla) భారత్‌లో తొలి షోరూమ్‌ను ముంబైలో ఏర్పాటు చేయనుంది. ఇందుకు వీలుగా బాంద్రా కుర్లా కాంప్లెక్స్(బీకేసీ) బిజినెస్ డిస్ట్రిక్ట్‌లో 4,000 చదరపు అడుగుల స్పేస్‌ను లీజుకి తీసుకుంది. సీఆర్‌ఈ మ్యాట్రిక్స్ వివరాల ప్రకారం పార్కింగ్ సౌకర్యాలుగల షోరూమ్ స్పేస్‌కుగాను కంపెనీ ప్రమోటర్, బిలియనీర్ ఎలాన్ మస్క్ నెలకు రూ.35 లక్షల అద్దె చెల్లించనున్నారు. అద్దె ఏడాదికి 5 శాతం పెంపు ప్రాతిపదికన ఐదేళ్ల కాలానికి యూనివ్‌కో ప్రాపర్టీస్ నుంచి లీజుకి తీసుకుంది. ఈ ప్రాపర్టీ గ్రౌండ్ ఫ్లోర్ దేశీయంగా ఏర్పాటైన తొలి యాపిల్ స్టోర్‌కు దగ్గరగా ఉంటుంది. రెంటల్ అగ్రిమెంట్ ఫిబ్రవరి 27న రిజిస్టరైంది. రూ.2.11 కోట్లు సెక్యూరిటీ డిపాజిట్‌గా టెస్లా జమ చేసింది.
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon Musk) భారతదేశానికి టెస్లా కార్లను తీసుకురానున్నట్లు గత కొన్ని రోజులుగా చర్చలు జరుగుతున్నాయి. టెస్లా (Tesla) కార్లు దేశీయ విపణిలో అడుగుపెడితే.. వాటి ధరలు ఎలా ఉంటాయనే వివరాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే విదేశీ కంపెనీలపై దిగుమతి సుంకాలను విధించడం సర్వసాధారణం. ప్రస్తుత అనిశ్చితుల కారణంగా టెస్లా కంపెనీపై దిగుమతి సుంకాన్ని 20 శాతం తగ్గిస్తే కార్ల ధరలు తగ్గుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ధరలు తగ్గిన తరువాత కూడా టెస్లా కారు ధర రూ.35 లక్షల నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంటుందని ఇటీవల గ్లోబల్ క్యాపిటల్ మార్కెట్ కంపెనీ సీఎల్ఎస్ఏ తన నివేదికలో వెల్లడించింది.
ఇదీ చదవండి: ఈ ఏడాదే భారత్‌లోకి చిన్న ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ
ప్రస్తుతం అమెరికాలో టెస్లా చౌకైన కారు ‘మోడల్ 3’ ధర ఫ్యాక్టరీ స్థాయిలో దాదాపు 35,000 డాలర్లు (సుమారు రూ.30.4 లక్షలు). భారతదేశంలో దిగుమతి సుంకాలను 15-20 శాతానికి తగ్గించడంతో పాటు, రోడ్ ట్యాక్స్, ఇన్సూరెన్స్ వంటి అదనపు ఖర్చులతో, ఆన్-రోడ్ ధర 40,000 డాలర్లు లేదా దాదాపు రూ.35-40 లక్షలుగా ఉంటుందని అంచనా. మహీంద్రా XEV 9e, హ్యుందాయ్ ఈ-క్రెటా, మారుతి సుజుకి ఈ-విటారా వంటి దేశీయ ఎలక్ట్రిక్ వెహికల్స్ కంటే టెస్లా మోడల్ 3 ధర 20-50 శాతం ఎక్కువగా ఉండబోతున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ ధరపై ఇంకా కంపెనీ ఎలాంటి ప్రకటన చేయలేదు.
Comments
Please login to add a commentAdd a comment