ప్రపంచ ధనవంతుడైన ఎలాన్ మస్క్ కి చెందిన టెస్లా కార్లను కొనుగోలు చేసేందుకు వాహనదారులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. ఇందుకోసం కోట్లాది రూపాయలను వెచ్చిస్తుంటారు. అయితే ఇవి ఎలాంటి రిపేర్ రానంతవరకు సాఫీగానే ఉంటుంది. కానీ దురదృష్టవశాత్తు ఏదైనా రిపేర్ వస్తే మాత్రం బిల్లు తడిసిమోపెడవుతుందనే వాదనలు ఉన్నాయి. ఇటీవల టెస్లా కారు ఓనర్ తన కారును రిపేర్ చేయించడానికి వెళ్తే ఏకంగా రూ.17.46లక్షలు బిల్లు వేసినట్లు హిండెన్‌బర్గ్ నివేదిక తెలిపింది. అందుకు సంబంధించిన వివరాలు తెలుసుకుందాం.
టెస్లాకు సంబంధించిన 'స్కాటిష్ మోడల్ Y ఎలక్ట్రిక్ క్రాస్ఓవర్' కారు కొనుగోలు చేసిన ఓనర్‌కు కంపెనీ దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. వాహనాన్ని మరమ్మతు కోసం ఇవ్వగా.. టెస్లా వేసిన బిల్లు చూసి ఖంగుతిన్నాడు. ఏకంగా రూ.17.46 లక్షల బిల్లు వేశారు.
నివేదిక తెలిపిన వివరాల ప్రకారం..భారీగా వర్షం కురుస్తున్న సమయంలో యజమాని కారు నడిపాడు. వాహనం తీసుకున్న కొత్తలో కొంతకాలం పాటు బాగానే నడిచినా వర్షంలో తడిసిన తర్వాత స్టార్ట్ అవలేదు. ఈవీని ట్రక్ ద్వారా వర్క్‌షాప్‌కు తరలించడానికి ఓనర్ ఐదు గంటలు వేచి చూడాల్సి వచ్చింది. టెస్లా కస్టమర్ సర్వీస్ కూడా అంతగా సహాయపడలేదని యజమాని పేర్కొన్నాడు.
టెస్లా వర్క్‌షాప్ యాజమాన్యం ఈ విషయంపై స్పందించింది. బ్యాటరీలోకి నీరు ప్రవేశించడం వల్ల ఎలక్ట్రిక్ క్రాస్‌ఓవర్ పాడైందని తెలిపింది. ఇది ప్రొపల్షన్ సిస్టమ్ పై ప్రభావం చూపినట్లు వివరించింది. టెస్లా అందించే వారంటీ పరిధిలోకి ఇది రాలేదని స్పష్టం చేసింది. అయితే యజమానికి రూ.17.46లక్షల రిపేర్ బిల్లు రావడంపై వర్క్‌షాప్ మేనేజర్‌ని నిలదీసినట్లు నివేదిక వెల్లడించింది.
భారీగా బిల్లులు వసూలు చేస్తూ టెస్లా గతంలోనూ వార్తల్లో నిలిచింది. కానీ ఈసారి బిల్ మరింత షాకింగ్ గా ఉన్నట్లు పలువురు అభిప్రాయపడుతున్నారు. కస్టమర్ సపోర్ట్ వల్ల అంతగా ఉపయోగం లేదని వినియోగదారులు ఆరోపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment