Nagnur School Teachers Welcome Students With 5 Star Chocolate - Sakshi
Sakshi News home page

ఫైవ్‌స్టార్‌ చాక్లెట్స్‌తో పాఠశాలకు ఆహ్వానం

Published Thu, Sep 2 2021 9:03 AM | Last Updated on Thu, Sep 2 2021 11:45 AM

Nagnur School Teachers Welcome To Students With 5 Star Chocolate - Sakshi

కరీంనగర్‌ మండలం నగునూరు పాఠశాలలో హెచ్‌ఎం కట్ట వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉపాధ్యాయులు ఫైవ్‌స్టార్‌ చాక్లెట్లతో స్వాగతం పలికారు. కరీంనగర్‌లోని మంకమ్మతోటలో గల ధన్గర్‌వాడీ పాఠశాలలో ప్రార్థన సమయంలో విద్యార్థిని సాయి స్పృహతప్పి పడిపోగా, ఉపాధ్యాయుడు ప్రథమ చికిత్స చేశాడు.

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: ‘పొద్దున లేవాలి.. స్నానం చేయాలి.. బడికెళ్లాలి.. ప్రార్థన చేయాలి, పాఠాలు వినాలి.. మైదానంలో ఆడాలి.. సాయంత్రానికి మాసిన బట్టలతో ఇంటికి చేరుకోవాలి.. ఇదే ప్రపంచంలో ఎక్కడైనా విద్యార్థి దినచర్య. కానీ, కరోనా మహమ్మారి దెబ్బకు ఏడాదిన్నరగా విద్యార్థుల దినచర్య పూర్తిగా స్తంభించిపోయింది. నిత్యం స్మార్ట్‌ఫోన్లలో పాఠాలు విన్న విద్యార్థులకు బుధవారం నుంచి ప్రత్యక్ష బోధన మొదలైంది. ఏడాదిన్నర అనంతరం పాఠశాలకు వెళ్తున్నామనే హుషారు విద్యార్థుల్లో కనబడింది. కరోనా వల్ల పాఠశాలలకు దూరమైన విద్యార్థినీ విద్యార్థులకు ప్రత్యక్ష బోధనకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంతో జిల్లా వ్యాప్తంగా విద్యార్థులు బడిబాట పట్టారు. కరోనా నేపథ్యంలో విద్యార్థులు మాస్కులు ధరించి పాఠశాల, కళాశాలలకు హాజరవ్వడం కనిపించింది. కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ విద్యాసంస్థల యాజమాన్యాలు ప్రత్యక్ష తరగతులు నిర్వహించాయి.’

చదవండి: కాంగ్రెస్‌ ఎమ్మెల్యే టికెట్‌కు దరఖాస్తులు ఆహ్వానం

18 నెలల అనంతరం..!
గతేడాది మార్చి 23 నుంచి దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌లో భాగంగా విద్యాసంస్థలు మూతబడ్డాయి. 2019–20 విద్యాసంవత్సరానికి గాను పదో తరగతి, ఇంటర్, కొన్ని ఉన్నత విద్యలకు సంబంధించి ప్రభుత్వం నేరుగా పాస్‌ చేశారు. 2020–21 విద్యా సంవత్సరంలోనూ ఇదే పరిస్థితి కొనసాగింది. సెకండ్‌ వేవ్‌ ముగియడం, ప్రత్యక్ష బోధన కొరవడటంతో విద్యార్థుల్లో విద్యాప్రమాణాలు పడిపోతాయన్న ఆందోళనతో ప్రభుత్వం కూడా ప్రత్యక్ష బోధన వైపు మొగ్గుచూపింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు దాదాపు 18 నెలల అనంతరం విద్యార్థులు బడిబాటపట్టడం గమనార్హం.

పాఠశాలల్లో 21.11 శాతం, కళాశాలల్లో 22.65 శాతం..
పాఠశాలలు, కళాశాలల పునఃప్రారంభమైన తొలిరోజు హాజరు శాతం అతి తక్కువ నమోదు కావడం గమనార్హం. విద్యార్థులను బలవంతం చేయొద్దని, ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌ విద్యార్థుల కోరిక మేరకు విద్యాసంస్థల యజమానులు వ్యవహరించాలని వచ్చిన వార్తలతో తొలిరోజు విద్యార్థులు, తల్లిదండ్రులు గందరగోళానికి గురికావడంతోనే హాజరు శాతం తగ్గిందని ఉపాధ్యాయ వర్గాలు పేర్కొన్నాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు పాఠశాలలను శుభ్రం చేసి విద్యార్థులు ప్రత్యక్ష «తరగతులకు హాజరయ్యేలా విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. తొలిరోజు జిల్లా వ్యాప్తంగా 662 ప్రభుత్వ పాఠశాలల్లో 42,698 మంది విద్యార్థులకు గాను 9,014 మంది (21.11 శాతం).. ప్రభుత్వ, ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలల్లో 13,059 మంది విద్యార్థులకు గాను 2,958 మంది (22.65 శాతం) హాజరయ్యారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement