మున్సిపల్ ఎన్నికల్లో పార్టీల అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కొలిక్కి వస్తోంది. కమిటీల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయాలని ఇప్పటికే నిర్ణయించిన అన్ని పార్టీలు ఆ దిశగా కసరత్తు పూర్తిచేశాయి. పీసీసీ సమావేశంలో అధికార కాంగ్రెస్ పార్టీ, కేసీఆర్ ఆదేశాల మేరకు టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక కమిటీలు నియమించాయి. మున్సిపల్ ఎన్నికల్లో గెలిచి సత్తా చాటేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక కోసం గురువారం స్క్రీనింగ్ కమిటీ నియమించింది. ఉనికి చాటుకోవడమే లక్ష్యంగా టీడీపీ కూడా సమన్వయ కమిటీ ఏర్పాటు చేసుకుని ఆశావహుల నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించింది.
- న్యూస్‌లైన్, కరీంనగర్ సిటీ
పురపాలక, నగరపాలక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థులను ఎంపిక చేసేందుకు అన్నిపార్టీల కసరత్తు దాదాపు పూర్తయింది. ఈసారి డెరైక్ట్‌గా అభ్యర్థులను ప్రకటించకుండా కమిటీలు వేసి ఎంపికచేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఆరుగురితో కమిటీ నియమించింది.మున్సిపల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై గురువారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో జరిగిన సమావేశంలో చర్చించారు. కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే రంగంలోకి దిగుతుండడంతో, పార్టీ విజయాలను ఆషామాషీగా తీసుకోవద్దని పీసీసీ చీఫ్ బొత్ససత్యనారాయణ మార్గ నిర్దేశం చేశారు. అభ్యర్థుల ఎంపిక కోసం స్థానికంగా కమిటీలు ఏర్పాటు చేశారు. జిల్లా నుంచి మారూ. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఎంపీ పొన్నం ప్రభాకర్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, డీసీసీ అధ్యక్షుడు కొండూరు రవీందర్‌రావు, నగర అధ్యక్షుడు కన్న కృష్ణ హాజరయ్యారు. కార్పొరేషన్, మున్సిపాలిటీలకు వేర్వేరుగా కమిటీలు ఏర్పాటయ్యాయి. కమిటీలను డీసీసీ అధ్యక్షుడు పర్యవేక్షిస్తారు. అవసరమైన చోట శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్ నిర్ణయం తీసుకుంటారు. నగరపాలకసంస్థ అభ్యర్థులకు నగర కాంగ్రెస్ అధ్యక్షుడు, మున్సిపాలిటీలకు డీసీసీ అధ్యక్షుడు సంతకం చేసి బీ-ఫారాలు ఇస్తారు.
టీఆర్‌ఎస్
అభ్యర్థుల ఎంపిక, గెలిపించే బాధ్యతను టీఆర్‌ఎస్ పార్టీ కమిటీలకు అప్పగించింది. జిల్లా నేతలతో భేటీ సందర్భంగా కేసీఆర్ పలు కీలక సూచనలు చేశారు. ఒంటరిపోరు, తెలంగాణ రాష్ట్రం వచ్చాక జరుగుతున్న తొలి ఎన్నికలు కావడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని సూచించారు. అభ్యర్థుల ఎంపిక, విజయాన్ని సీరియస్‌గా తీసుకోవాలని హితబోధ చేశారు. కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా గురువారం కరీంనగర్‌లో సమావేశమైన టీఆర్‌ఎస్ నేతలు కమిటీలకు తుది రూపు ఇచ్చారు. ఈ కమిటీలే అభ్యర్థులను ఎంపికచేయడంతోపాటు పోలింగ్ వరకు పర్యవేక్షిస్తాయి.
వైఎస్సార్‌సీపీ సమన్వయ కమిటీ
మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్క్రీనింగ్ కమిటీలు నియమించింది. పా ర్టీ జిల్లా అధ్యక్షుడు సింగిరెడ్డి భాస్కర్‌రెడ్డి స్క్రీనింగ్ కమి టీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. సభ్యులుగా స్థానిక నేత లు ఉంటారు. గురువారం కరీంనగర్ నగరపాలక సంస్థ కు సంబంధించిన స్క్రీనింగ్ కమిటీని నియమించారు.
పార్టీ నగర అధ్యక్షుడు డాక్టర్ కె.నగేశ్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు అక్కెనపల్లి కుమార్, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు జివరాల శ్రీనివాస్, సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు జూపాక సుదర్శన్, యూత్ రాష్ట్ర కమిటీ సభ్యుడు శ్రీరవి, మైనారిటీ విభాగం నాయకుడు సయ్యద్‌ఖాన్, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు భూక్యా రఘునాయక్ సభ్యులుగా వ్యవహరిస్తారు. ఆశావహుల నుంచి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, అర్హత, విజయావకాశాల ప్రాతిపదికన అభ్యర్థులను ఎంపిక చేస్తారు. నగరపాలక సంస్థకు సంబంధించి ఇప్పటికే 86 దరఖాస్తులు రాగా, వాటిని స్క్రీనింగ్ కమిటీ పరిశీలించి, ఎంపిక చేస్తుందని పార్టీ జిల్లా అధ్యక్షుడు సింగిరెడ్డి భాస్కర్‌రెడ్డి తెలిపారు.
టీడీపీ
ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించే ప్రక్రియకు టీడీపీ గురువారం శ్రీకారం చుట్టింది. పార్టీ జిల్లా అధ్యక్షుడు విజయరమణారావు, వాసాల రమేశ్ తదితర ముఖ్యనేతలతో కూడిన సమన్వయ కమిటీ దరఖాస్తులను స్వీకరించి, అందులో నుంచి అభ్యర్థులను ఎంపిక చేయనుంది. నగరపాలకసంస్థలతోపాటు, మున్సిపాలిటీలు, నగరపంచాయతీలో సమన్వయ కమిటీయే అభ్యర్థులను ఎంపికచేస్తుంది.
కమిటీలు ఖరారు
Published Fri, Mar 7 2014 4:20 AM | Last Updated on Fri, May 25 2018 9:12 PM
Advertisement