గరగపర్రు వివాదంపై వైఎస్‌ఆర్ సీపీ కమిటీ
ఏలూరు : పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం గరగపర్రు వివాదంపై ప్రతిపక్షం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓ కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో పార్టీ నేతలు ధర్మాన ప్రసాదరావు, పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ల నాని, మేరుగ నాగార్జున తదితరులు సభ్యులుగా ఉంటారు. వైఎస్‌ఆర్ సీపీ కమిటీ సభ్యులు మంగళవారం గరగపర్రులో పర్యటించి, వాస్తవాలను తెలుసుకోనున్నారు. కాగా గరగపర్రులో అంబేడ్కర్ విగ్రహ ఏర్పాటుపై రెండు వర్గాల మధ్య రేగిన వివాదం చినికిచినికి గాలివానగా మారిన విషయం తెలిసిందే.
అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేసినందుకు తమను సాంఘిక బహిష్కరణ చేశారంటూ దళితులు .....కొద్దిరోజులుగా ఆందోళనలు చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో బాధితులను పరామర్శించేందుకు వచ్చిన పలువురు దళిత సంఘం నేతలను అరెస్ట్ చేశారు. అయితే ఒకరిని రాజమండ్రిలో విడిచిపెట్టగా...మిగిలిన నాయకులను పెదవేగి పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌కు తరలించారు.
ఈ విషయం తెలియగానే దళిత సంఘాల నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో పోలీసులు గ్రామంలో 144 సెక్షన్ విధించారు. లోపలికి ఎవరూ వెళ్లకుండా భీమవరం-తాడేపల్లిగూడెం రహదారిపై పోలీసులు మోహరించారు. దళితులకు మద్దతుగా వస్తున్న నేతలను ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య తీవ్రతోపులాట జరిగింది. వాగ్వాదం చోటుచేసుకుంది.