ఏలూరు : పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం గరగపర్రు గ్రామంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ బృందం మంగళవారం పర్యటించింది. ఈ సందర్భంగా గరగపర్రు బాధితులతో బృందం సభ్యులు భేటీ అయ్యారు. పార్టీ నేతలు ధర్మాన ప్రసాదరావు, పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్లనాని, మేరుగ నాగార్జున తదితరులు దళితవాడలో బాధితులతో సమావేశమై గ్రామంలో నెలకొన్న పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఈ గరగపర్రు ఘటనపై బాధితులు మాట్లాడుతూ...‘ అంబేద్కర్ జయంతి సందర్భంగా విగ్రహ ఏర్పాట్లకు సన్నాహాలు చేశాం. ఏప్రిల్ 23న విగ్రహాన్ని చెరువుగట్టు సెంటర్‌లో పెట్టాం.
రాత్రికి రాత్రే అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించారు. కోర్టు వివాదం ఉన్న నేపథ్యంలో విగ్రహాన్ని ఏర్పాటు చేయకూడదని చెప్పారు. అన్ని విగ్రహాలను తొలగించే సమయంలో మేం కూడా అక్కడ నుంచి అంబేద్కర్ విగ్రహాన్ని తొలగిస్తామని చెప్పినా వినిపించుకోలేదు. గ్రామంలోని అన్ని కులాలు శివాలయంలో సమావేశం అయ్యారు. మే 5వ తేదీ లోపు విగ్రహం తొలగించాలని డెడ్‌లైన్ పెట్టారు. ఆ తర్వాత నుంచి మమ్మల్ని సాంఘీక బహిష్కరణ చేశారు. పాలు, కూరగాయలు, మందులు కూడా అందకుండా చేశారు.’ అని తమ ఆవేదన వెల్లడించారు.
మరోవైపు ఈ ఘటనకు సంబంధించి జిల్లా ఎస్పీ రవిప్రకాష్ మాట్లాడుతూ గరగపర్రు గ్రామంలో సామాజిక బహిష్కరణ కేసు విచారణ రెండు రోజుల్లో పూర్తి చేస్తామన్నారు. జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు కె.రాములు గరగపర్రు సందర్శించి సంఘటనకు సంబంధించి వాస్తవ పరిస్థితులు తెలుసుకుని పూర్వాపరాలను విచారించారని చెప్పారు. కాగా గరగపర్రులో అంబేడ్కర్ విగ్రహ ఏర్పాటుపై రెండు వర్గాల మధ్య రేగిన వివాదం చినికిచినికి గాలివానగా మారిన విషయం తెలిసిందే.
గరగపర్రులో వైఎస్‌ఆర్‌సీపీ బృందం పర్యటన
Published Tue, Jun 27 2017 11:20 AM | Last Updated on Fri, Aug 17 2018 8:11 PM
Advertisement