అన్న.. గెలుత్తడు! | In districts betting huge conducting in elections | Sakshi
Sakshi News home page

అన్న.. గెలుత్తడు!

Published Fri, May 2 2014 12:50 AM | Last Updated on Sat, Sep 2 2017 6:47 AM

In districts betting huge conducting in elections

సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై జిల్లాలో బెట్టింగ్‌లు జోరందుకున్నాయి. పోలింగ్ ముగిసిన కొద్ది గంటల్లోనే పందెంరాయుళ్లు రంగంలోకి దిగారు. విశ్వసనీయ సమాచారం మేరకు.. జిల్లాలో రూ.50వేల నుంచి రూ.5లక్షల వరకు పందెం కడుతున్నారు. బెట్టింగ్‌ల మొత్తం రూ.కోట్లలో ఉండే అవకాశముంది. ఫలితాల వెల్లడికి మరో పదిహేను రోజులు గడువు ఉండటంతో బెట్టింగ్‌లు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.
 
 కరీంనగర్ సిటీ, న్యూస్‌లైన్ : జిల్లాలో 13 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ నియోజకవర్గాలకు సగం నియోజకవర్గాల్లో ఫలితాలను ముందుగానే ఊహిస్తున్నారు. దీంతో పోటాపోటీగా ఉన్న అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాలపైనే పందెంరాయుళ్లు దృష్టి సారించారు. నువ్వా.. నేనా.. అన్నట్లు ఉన్న మంథని, జగిత్యాల, కోరుట్ల, హుస్నాబాద్, కరీంనగర్, ధర్మపురి, వేములవాడ, రామగుండం నియోజకవర్గాల్లో పందెం రూ.లక్షలు దాటిం ది. మిగిలిన నియోజకవర్గాల్లోనూ ఆయా పార్టీల మద్దతుదారులు పందెం కాస్తున్నారు.
 
 మంథనిలో ప్రధాన పార్టీల అభ్యర్థుల విజయంపై ఇద్దరు బడా వ్యాపారవేత్తలు రూ.5 లక్షల పందెం వేసుకున్నట్లు ప్రచారంలో ఉంది. ఈ నియోజకవర్గంలోనే ఎక్కువ మొత్తంలో బెట్టింగ్‌లు జరుగుతున్నట్లు సమాచారం. ఇక్కడ ప్రధాన పార్టీల అభ్యర్థుల నడుమ ముఖాముఖి పోటీ నెలకొనడం, పోటీ తీవ్ర స్థాయిలో ఉండటంతో పందెంరాయుళ్లు ఈ నియోజకవర్గంపైనే ఆసక్తి కనపరుస్తున్నారు. ఆయా అభ్యర్థుల అనుచరవర్గం కూడా బెట్టింగ్‌ల మాయలో పడిపోతున్నారు.
 
 పోటాపోటీగా ఉన్న జగిత్యాల నియోజకవర్గంలోనూ ఇంచుమించు ఇదే పరిస్థితి ఉంది. జగిత్యాలలోని ఒక డాక్టర్ రూ.2లక్షలకు తమ అభ్యర్థి విజయం సాధిస్తాడని పందెం వేసినట్లు పట్టణంలో ప్రచారం జరుగుతోంది. ఇక్కడ రెండు ప్రధాన పార్టీల అభ్యర్థుల మధ్య ముఖాముఖి పోరు నెలకొనడంతో బెట్టింగ్‌లు జోరందుకుంటున్నట్టు తెలుస్తోంది.
 రామగుండంలో స్వతంత్ర అభ్యర్థుల విజ యంపైనే పందెం కాశారు. ముగ్గురు స్వతం త్ర అభ్యర్థులు ఏ స్థానంలో ఉంటారనే దానిపై ఎక్కువ పందెం వేసుకోవడం విశేషం.
 
 కరీంనగర్ అసెంబ్లీలో ఒక సామాజికవర్గం నాయకులు రూ.లక్షల్లో పందెం కాసినట్లు విని కిడి. మాజీ కార్పొరేటర్లు విదేశీ ప్రయాణంపై పందెం కాసినట్లు తెలిసింది. తమ అభ్యర్థి గెలిస్తే పందెం కాసినవాళ్లు విదేశాలకు తీసుకెళ్లాలని ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం.
 
 కరీంనగర్, పెద్దపల్లి పార్లమెంట్ స్థానాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థుల విజయంపై పందెంరాయుళ్లు కన్నేశారు. పెద్దపల్లి పార్లమెంట్‌లో ఎవరు గెలుస్తారనే దానిపై రూ.లక్ష ల్లో పందెం కాశారని సమాచారం. హైదరాబాద్‌కు చెందిన కొంతమంది కూడా జిల్లా ఫలితాలపై పందెం కాస్తుండడం విశేషం.
 
 నగదు రూపంలోనే పందెం కాస్తున్నప్పటికి, విదేశీ ప్రయాణం, సెల్‌ఫోన్‌లు కూడా బెట్టింగ్‌లో భాగమవుతున్నాయి. బెట్టింగ్ ఆనవాలు జిల్లాలో గతంలో పెద్దగా లేనప్పటికి, ఈసారి మాత్రం పరిస్థితికి అందుకు భిన్నంగా కనిపిస్తోంది.
  రియల్టర్లు, బడా వ్యాపారవేత్తలు పెద్ద సంఖ్యలో ఈ బెట్టింగ్‌ల్లో పాల్గొంటున్నారు. కొంతమంది అభ్యర్థులు కూడా సరదాగా బెట్టింగ్‌ల్లో పాలుపంచుకుంటున్నట్లు తెలిసింది. ఎక్కువగా ఎవరు విజయం సాధిస్తారనే అంశంపైనే బెట్టింగ్ సాగుతుండగా, కొన్ని చోట్ల ఏ స్థానంలో వస్తారనే దానిపై కూడా పందెం కట్టడం గమనార్హం. మొత్తానికి ఎన్నికల ఫలితాల అనంతరం జిల్లాలో రూ.కోట్లు చేతులు మారనున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement