Assembly parliament
-
అన్న.. గెలుత్తడు!
సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై జిల్లాలో బెట్టింగ్‌లు జోరందుకున్నాయి. పోలింగ్ ముగిసిన కొద్ది గంటల్లోనే పందెంరాయుళ్లు రంగంలోకి దిగారు. విశ్వసనీయ సమాచారం మేరకు.. జిల్లాలో రూ.50వేల నుంచి రూ.5లక్షల వరకు పందెం కడుతున్నారు. బెట్టింగ్‌ల మొత్తం రూ.కోట్లలో ఉండే అవకాశముంది. ఫలితాల వెల్లడికి మరో పదిహేను రోజులు గడువు ఉండటంతో బెట్టింగ్‌లు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. కరీంనగర్ సిటీ, న్యూస్‌లైన్ : జిల్లాలో 13 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ నియోజకవర్గాలకు సగం నియోజకవర్గాల్లో ఫలితాలను ముందుగానే ఊహిస్తున్నారు. దీంతో పోటాపోటీగా ఉన్న అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాలపైనే పందెంరాయుళ్లు దృష్టి సారించారు. నువ్వా.. నేనా.. అన్నట్లు ఉన్న మంథని, జగిత్యాల, కోరుట్ల, హుస్నాబాద్, కరీంనగర్, ధర్మపురి, వేములవాడ, రామగుండం నియోజకవర్గాల్లో పందెం రూ.లక్షలు దాటిం ది. మిగిలిన నియోజకవర్గాల్లోనూ ఆయా పార్టీల మద్దతుదారులు పందెం కాస్తున్నారు. మంథనిలో ప్రధాన పార్టీల అభ్యర్థుల విజయంపై ఇద్దరు బడా వ్యాపారవేత్తలు రూ.5 లక్షల పందెం వేసుకున్నట్లు ప్రచారంలో ఉంది. ఈ నియోజకవర్గంలోనే ఎక్కువ మొత్తంలో బెట్టింగ్‌లు జరుగుతున్నట్లు సమాచారం. ఇక్కడ ప్రధాన పార్టీల అభ్యర్థుల నడుమ ముఖాముఖి పోటీ నెలకొనడం, పోటీ తీవ్ర స్థాయిలో ఉండటంతో పందెంరాయుళ్లు ఈ నియోజకవర్గంపైనే ఆసక్తి కనపరుస్తున్నారు. ఆయా అభ్యర్థుల అనుచరవర్గం కూడా బెట్టింగ్‌ల మాయలో పడిపోతున్నారు. పోటాపోటీగా ఉన్న జగిత్యాల నియోజకవర్గంలోనూ ఇంచుమించు ఇదే పరిస్థితి ఉంది. జగిత్యాలలోని ఒక డాక్టర్ రూ.2లక్షలకు తమ అభ్యర్థి విజయం సాధిస్తాడని పందెం వేసినట్లు పట్టణంలో ప్రచారం జరుగుతోంది. ఇక్కడ రెండు ప్రధాన పార్టీల అభ్యర్థుల మధ్య ముఖాముఖి పోరు నెలకొనడంతో బెట్టింగ్‌లు జోరందుకుంటున్నట్టు తెలుస్తోంది. రామగుండంలో స్వతంత్ర అభ్యర్థుల విజ యంపైనే పందెం కాశారు. ముగ్గురు స్వతం త్ర అభ్యర్థులు ఏ స్థానంలో ఉంటారనే దానిపై ఎక్కువ పందెం వేసుకోవడం విశేషం. కరీంనగర్ అసెంబ్లీలో ఒక సామాజికవర్గం నాయకులు రూ.లక్షల్లో పందెం కాసినట్లు విని కిడి. మాజీ కార్పొరేటర్లు విదేశీ ప్రయాణంపై పందెం కాసినట్లు తెలిసింది. తమ అభ్యర్థి గెలిస్తే పందెం కాసినవాళ్లు విదేశాలకు తీసుకెళ్లాలని ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. కరీంనగర్, పెద్దపల్లి పార్లమెంట్ స్థానాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థుల విజయంపై పందెంరాయుళ్లు కన్నేశారు. పెద్దపల్లి పార్లమెంట్లో ఎవరు గెలుస్తారనే దానిపై రూ.లక్ష ల్లో పందెం కాశారని సమాచారం. హైదరాబాద్‌కు చెందిన కొంతమంది కూడా జిల్లా ఫలితాలపై పందెం కాస్తుండడం విశేషం. నగదు రూపంలోనే పందెం కాస్తున్నప్పటికి, విదేశీ ప్రయాణం, సెల్ఫోన్లు కూడా బెట్టింగ్‌లో భాగమవుతున్నాయి. బెట్టింగ్ ఆనవాలు జిల్లాలో గతంలో పెద్దగా లేనప్పటికి, ఈసారి మాత్రం పరిస్థితికి అందుకు భిన్నంగా కనిపిస్తోంది. రియల్టర్లు, బడా వ్యాపారవేత్తలు పెద్ద సంఖ్యలో ఈ బెట్టింగ్‌ల్లో పాల్గొంటున్నారు. కొంతమంది అభ్యర్థులు కూడా సరదాగా బెట్టింగ్‌ల్లో పాలుపంచుకుంటున్నట్లు తెలిసింది. ఎక్కువగా ఎవరు విజయం సాధిస్తారనే అంశంపైనే బెట్టింగ్ సాగుతుండగా, కొన్ని చోట్ల ఏ స్థానంలో వస్తారనే దానిపై కూడా పందెం కట్టడం గమనార్హం. మొత్తానికి ఎన్నికల ఫలితాల అనంతరం జిల్లాలో రూ.కోట్లు చేతులు మారనున్నాయి. -
‘పుర’ పోరు ప్రతిష్టాత్మకం
సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్న వేళ...ఊహించని రీతిలో వచ్చిపడిన మున్సిపల్ ఎన్నికలను ఎదుర్కొనేందుకు పార్టీలు ఒక్కసారిగా వేగం పెంచాయి. రాజకీయ అస్థిర, అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో బలమైన అభ్యర్థులను ఎంపిక చేసుకోవడం పార్టీలకు కత్తిమీదసాములా మారింది. ఈ ఎన్నికలు పార్టీ గుర్తులతో జరుగుతున్నందున ఈ ప్రభావం రేపటి సార్వత్రిక ఎన్నికలైపైనా పడనుంది. దీంతో అన్నిపార్టీలు పోరును ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. సాక్షి, కడప: ఏడు నెలలుగా రాష్ట్రవిభజన అంశంతో నలిగిపోయిన రాజకీయపార్టీలన్నీ పురపోరుపై దృష్టిసారించాయి. సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడటంతో...తక్కువ వ్యవధిలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు పార్టీలు సన్నద్ధం కావాలి. దీంతో పురపోరులో ఏమాత్రం ఏమరపాటును ప్రదర్శించినా ఆ ఫలితం కచ్చితంగా సార్వత్రిక ఎన్నికలపై ప్రభావం చూపి మొదటికే మోసం వచ్చే పరిస్థితి. దీంతో పార్టీ అధినాయకత్వాలతో పాటు స్థానిక ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు మునిసిపల్ ఎన్నికలపై పూర్తిదృష్టి సారించారు. సార్వత్రిక ఎన్నికలపై ప్రభావం: జిల్లాలో 8 మున్సిపాలిటీలతో పాటు కడప కార్పొరేషన్ ఉంది. ఇందులో రాజంపేట మినహా తక్కిన వాటికి ఎన్నికలు జరుగుతున్నాయి. జిల్లాలో పది అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే 7 నియోజకవర్గాల పరిధిలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో జమ్మలమడుగు నియోజకవర్గంలో రెండు మునిసిపాలిటీలు ఉండటం విశేషం. దాదాపు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోనూ పట్టణ ఓటర్లు అధికంగా ఉన్నారు. ఏ పార్టీ మున్సిపల్ పీఠాన్ని దక్కించుకుంటుందో అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అదే పార్టీకి చెందిన అభ్యర్థి విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. పార్టీగుర్తులపై ఎన్నికలు జరుగుతుండటంతో ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. ఇదీ పరిస్థితి: కడప కార్పొరేషన్ పరిధిలో 2,71,532 ఓట్లు ఉన్నాయి. అసెంబ్లీ నియోజకవర్గం కార్పొరేషన్ పరిధికే పరిమితం కావడంతో కార్పొరేషన్ ఏపార్టీ దక్కించుకుంటే ఎమ్మెల్యే స్థానాన్ని కూడా అదేపార్టీ కైవసం చేసుకునే అనివార్యపరిస్థితి. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో 2,18,273 ఓట్లు ఉన్నాయి. ఇందులో 1,23,481 ఓట్లు మున్సిపాలిటీ పరిధిలో ఉన్నాయి. ఇక్కడ కూడా మున్సిపల్ పీఠాన్ని ఏ పార్టీ దక్కించుకుంటుందో...అసెంబ్లీ స్థానాన్ని కూడా అదేపార్టీ కైవసం చేసుకోవడం ఖాయం. జమ్మలమడుగు నియోజకవర్గంలో 2.06లక్షల ఓట్లు ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో జమ్మలమడుగుతో పాటు ఎర్రగుంట్ల నగర పంచాయతీలో కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. జమ్మలమడుగు మున్సిపాలిటీలో 33, 268, ఎర్రగుంట్లలో 23,861 ఓట్లు కలిపి 57,129 ఓట్లు ఉన్నాయి. ఈ రెండింటిని ఏపార్టీ దక్కించుకుంటుందో అదే పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యేగా గెలిచే అవకాశాలు అధికంగా ఉన్నాయి. పులివెందుల అసెంబ్లీలో 2,16,674 ఓట్లు ఉన్నాయి. మున్సిపాలిటీ పరిధిలో 55,159 ఓట్లు ఉన్నాయి. ఇక్కడ అసెంబ్లీ, మున్సిపాలిటీ వైఎస్సార్సీపీ గెలవడం నల్లేరుపై నడకే. మైదుకూరు నియోజకవర్గంలో 1,88,631 ఓటర్లు ఉన్నారు. వీరిలో మున్సిపాలిటీలో 33,350 మంది ఓటర్లు ఉన్నారు. ఇక్కడ ఫలితాలు కూడా అసెంబ్లీపై ప్రభావం చూపనున్నాయి. బద్వేలు నియోజకవర్గంలో 2,05,467 ఓట్లు ఉంటే మున్సిపాలిటీలో 46,525 ఓట్లు ఉన్నాయి. గత ఎన్నికల్లో ఈ మున్సిపాలిటీ లో ఏ ఒక్కస్థానంలో కూడా టీడీపీ గెలవలేదు. దీంతో ఈ ఏడాది కూడా ఆపార్టీ గెలుపు అవకాశాలు గగనమే. తాజా రాజకీయపరిణామాలతో కాంగ్రెస్‌పార్టీ పరిస్థితి అత్యంత దయనీయంగా మారడంతో ఆ పార్టీ పోటీలో ఉన్నా నామమాత్రంగానే భావించాలి. సతులను బరిలోకి దించేందుకు సన్నాహాలు: కడప కార్పొరేషన్‌తో పాటు మైదుకూరు, బద్వేలు, ఎర్రగుంట్ల స్థానాలు బీసీలకు, జమ్మలమడుగు, పులివెందుల, రాయచోటి జనరల్ మహిళకు రిజర్వ్ అయ్యాయి. ప్రొద్దుటూరు అన్‌రిజర్వ్‌డ్‌గా ఉంది. మహిళలకు సగం స్థానాలు రిజర్వు కావడంతో ఆశావహులు తమ భార్యలను బరిలోకి దించేందుకు సన్నద్ధమవుతున్నారు. వార్డుల్లో కూడా సగం స్థానాల్లో మహిళలను బరిలోకి దించాల్సి రావడంతో కార్పొరేటర్, కౌన్సిలర్ పదవులు ఆశించిన వారంతా భార్యలను పోటీలో నిలపడంలో నిమగ్నమయ్యారు. వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అన్ని మున్సిపల్ స్థానాలు దక్కించుకుంటామనే ధీమాతో అభ్యర్థుల జాబితాను సిద్ధం చేస్తున్నారు. అయితే టీడీపీ నేతలు మాత్రం అభ్యర్థుల వేటలో ఇబ్బందులు పడుతున్నారు. -
మోగిన సార్వత్రిక నగారా
సాక్షి, అనంతపురం : సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. బుధవారం ఎన్నికల సంఘం ప్రకటించిన మేరకు ఎన్నికల నోటిఫికేషన్ ఏప్రిల్ 12న విడుదల కానుంది. 19న నామినేషన్ల స్వీకరణ, 21న పరిశీలన, 23న ఉప సంహరణ ఉంటాయి. జిల్లా వ్యాప్తంగా మే 7న పోలింగ్ జరగనుంది. అదే నెల 16న ఓట్ల లెక్కింపు..ఫలితాల ప్రకటన ఉంటుంది. మున్సిపల్, సార్వత్రిక ఎన్నికలు వెనువెంటనే రావడంతో రాజకీయ పార్టీల్లో అప్పుడే హడావుడి మొదలైంది. మున్సిపల్ ఎన్నికల్లో ఎవరిని బరిలోకి దింపాలన్న ఆలోచనలో ఉండగానే సార్వత్రిక ఎన్నికలు ముంచుకురావడంతో నేతల్లో అలజడి నెలకొంది. మున్సిపల్ ఎన్నికలు ఈనెల 30న జరగనున్నాయి. ఆలోపే అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తే లాభపడే అవకాశం ఉందని ఆయా పార్టీలో నేతలు భావిస్తున్నారు. కాగా రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు కనీసం డిపాజిట్లు కూడా దక్కే అవకాశాలు కన్పించడం లేదు. ఈ క్రమంలో పరువు కోసం ఆ పార్టీ నేతలు పాకులాడుతున్నారు. ఇందులో భాగంగా జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో సభలు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిసింది. తొలి విడతగా అనంతపురం పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గాల్లో సభలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. గ్రామ స్థాయిలో ఉండే ఒకరిద్దరు నాయకులను ఏదో ఒక విధంగా పార్టీలో కొనసాగేలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక తెలుగుదేశం పార్టీలో ఆధిపత్య పోరు కొనసాగుతూనే ఉంది. ఎన్నికలకు సంబంధించి అధిష్టానం ఇప్పటివరకు జిల్లా నేతలతో పూర్తి స్థాయిలో చర్చలు జరపలేదు. మున్సిపల్ ఎన్నికలు తరుముకొస్తున్నా అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించకపోవడంతో ఆ పార్టీ నేతల్లో ఆందోళన నెలకొంది. పార్టీలో కష్టపడి పని చేస్తున్న వారికి కాకుండా కాంగ్రెస్ నుంచి వచ్చిన వారికి అధినేత చంద్రబాబు ప్రాధాన్యత ఇస్తుండడంతో కొందరు నేతలు గుర్రుగా ఉన్నారు. మరోవైపు సినీనటుడు బాలకృష్ణను ఈసారి హిందూపురం పార్లమెంట్ నుంచి బరిలోకి దించాలా? అసెంబ్లీ స్థానానికే పరిమితం చేయాలా? అన్న దానిపై సమాలోచనలు జరుగుతున్నట్లు సమాచారం. విషయంపై జిల్లా నేతలతో చర్చించి స్పష్టత ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. బాలకృష్ణకు కేటాయించే స్థానాన్ని బట్టి హిందూపురం పార్లమెంటు పరిధిలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలకు ప్రస్తుతం టిక్కెట్లు ఆశిస్తున్న అభ్యర్థుల భవితవ్యంతారుమారయ్యే అవకాశాలు ఎక్కువగా కన్పిస్తుండటంతో కొందరు నేతలు దిక్కుతోచని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లాలో దూసుకెళ్తోంది. ఇప్పటికే నియోజకవర్గ సమన్వయకర్తలు, నేతలు ‘గడపగడపకూ వైఎస్ఆర్సీపీ’ పేరుతో ప్రజల్లోకి వెళ్తున్నారు. ఎన్నికల్లో పార్టీని గెలిపించాలని కోరుతూ విసృ్తతంగా ప్రచారం చేస్తున్నారు. మొత్తానికి వైఎస్ఆర్సీపీ ఫుల్ జోష్‌తో ముందుకు సాగుతుంటే.. అభ్యర్థులే లేక కాంగ్రెస్.. ఆధిపత్య, వర్గ పోరుతో టీడీపీ కొట్టుమిట్టాడుతున్నాయి.