సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్న వేళ...ఊహించని రీతిలో వచ్చిపడిన మున్సిపల్ ఎన్నికలను ఎదుర్కొనేందుకు పార్టీలు ఒక్కసారిగా వేగం పెంచాయి. రాజకీయ అస్థిర, అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో బలమైన అభ్యర్థులను ఎంపిక చేసుకోవడం పార్టీలకు కత్తిమీదసాములా మారింది. ఈ ఎన్నికలు పార్టీ గుర్తులతో జరుగుతున్నందున ఈ ప్రభావం రేపటి సార్వత్రిక ఎన్నికలైపైనా పడనుంది. దీంతో అన్నిపార్టీలు పోరును ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి.
సాక్షి, కడప: ఏడు నెలలుగా రాష్ట్రవిభజన అంశంతో నలిగిపోయిన రాజకీయపార్టీలన్నీ పురపోరుపై దృష్టిసారించాయి. సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడటంతో...తక్కువ వ్యవధిలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు పార్టీలు సన్నద్ధం కావాలి. దీంతో పురపోరులో ఏమాత్రం ఏమరపాటును ప్రదర్శించినా ఆ ఫలితం కచ్చితంగా సార్వత్రిక ఎన్నికలపై ప్రభావం చూపి మొదటికే మోసం వచ్చే పరిస్థితి. దీంతో పార్టీ అధినాయకత్వాలతో పాటు స్థానిక ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు మునిసిపల్ ఎన్నికలపై పూర్తిదృష్టి సారించారు.
సార్వత్రిక ఎన్నికలపై ప్రభావం:
జిల్లాలో 8 మున్సిపాలిటీలతో పాటు కడప కార్పొరేషన్ ఉంది. ఇందులో రాజంపేట మినహా తక్కిన వాటికి ఎన్నికలు జరుగుతున్నాయి. జిల్లాలో పది అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే 7 నియోజకవర్గాల పరిధిలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో జమ్మలమడుగు నియోజకవర్గంలో రెండు మునిసిపాలిటీలు ఉండటం విశేషం. దాదాపు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోనూ పట్టణ ఓటర్లు అధికంగా ఉన్నారు. ఏ పార్టీ మున్సిపల్ పీఠాన్ని దక్కించుకుంటుందో అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అదే పార్టీకి చెందిన అభ్యర్థి విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. పార్టీగుర్తులపై ఎన్నికలు జరుగుతుండటంతో ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి.
ఇదీ పరిస్థితి:
కడప కార్పొరేషన్ పరిధిలో 2,71,532 ఓట్లు ఉన్నాయి. అసెంబ్లీ నియోజకవర్గం కార్పొరేషన్ పరిధికే పరిమితం కావడంతో కార్పొరేషన్ ఏపార్టీ దక్కించుకుంటే ఎమ్మెల్యే స్థానాన్ని కూడా అదేపార్టీ కైవసం చేసుకునే అనివార్యపరిస్థితి.
ప్రొద్దుటూరు నియోజకవర్గంలో 2,18,273 ఓట్లు ఉన్నాయి. ఇందులో 1,23,481 ఓట్లు మున్సిపాలిటీ పరిధిలో ఉన్నాయి. ఇక్కడ కూడా మున్సిపల్ పీఠాన్ని ఏ పార్టీ దక్కించుకుంటుందో...అసెంబ్లీ స్థానాన్ని కూడా అదేపార్టీ కైవసం చేసుకోవడం ఖాయం. జమ్మలమడుగు నియోజకవర్గంలో 2.06లక్షల ఓట్లు ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో జమ్మలమడుగుతో పాటు ఎర్రగుంట్ల నగర పంచాయతీలో కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. జమ్మలమడుగు మున్సిపాలిటీలో 33, 268, ఎర్రగుంట్లలో 23,861 ఓట్లు కలిపి 57,129 ఓట్లు ఉన్నాయి. ఈ రెండింటిని ఏపార్టీ దక్కించుకుంటుందో అదే పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యేగా గెలిచే అవకాశాలు అధికంగా ఉన్నాయి.
పులివెందుల అసెంబ్లీలో 2,16,674 ఓట్లు ఉన్నాయి. మున్సిపాలిటీ పరిధిలో 55,159 ఓట్లు ఉన్నాయి. ఇక్కడ అసెంబ్లీ, మున్సిపాలిటీ వైఎస్సార్‌సీపీ గెలవడం నల్లేరుపై నడకే.
మైదుకూరు నియోజకవర్గంలో 1,88,631 ఓటర్లు ఉన్నారు. వీరిలో మున్సిపాలిటీలో 33,350 మంది ఓటర్లు ఉన్నారు.
ఇక్కడ ఫలితాలు కూడా అసెంబ్లీపై ప్రభావం చూపనున్నాయి. బద్వేలు నియోజకవర్గంలో 2,05,467 ఓట్లు ఉంటే మున్సిపాలిటీలో 46,525 ఓట్లు ఉన్నాయి. గత ఎన్నికల్లో ఈ మున్సిపాలిటీ లో ఏ ఒక్కస్థానంలో కూడా టీడీపీ గెలవలేదు. దీంతో ఈ ఏడాది కూడా ఆపార్టీ గెలుపు అవకాశాలు గగనమే. తాజా రాజకీయపరిణామాలతో కాంగ్రెస్‌పార్టీ పరిస్థితి అత్యంత దయనీయంగా మారడంతో ఆ పార్టీ పోటీలో ఉన్నా నామమాత్రంగానే భావించాలి.
సతులను బరిలోకి దించేందుకు
సన్నాహాలు:
కడప కార్పొరేషన్‌తో పాటు మైదుకూరు, బద్వేలు, ఎర్రగుంట్ల స్థానాలు బీసీలకు, జమ్మలమడుగు, పులివెందుల, రాయచోటి జనరల్ మహిళకు రిజర్వ్ అయ్యాయి. ప్రొద్దుటూరు అన్‌రిజర్వ్‌డ్‌గా ఉంది. మహిళలకు సగం స్థానాలు రిజర్వు కావడంతో ఆశావహులు తమ భార్యలను బరిలోకి దించేందుకు సన్నద్ధమవుతున్నారు.
వార్డుల్లో కూడా సగం స్థానాల్లో మహిళలను బరిలోకి దించాల్సి రావడంతో కార్పొరేటర్, కౌన్సిలర్ పదవులు ఆశించిన వారంతా భార్యలను పోటీలో నిలపడంలో నిమగ్నమయ్యారు. వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అన్ని మున్సిపల్ స్థానాలు దక్కించుకుంటామనే ధీమాతో అభ్యర్థుల జాబితాను సిద్ధం చేస్తున్నారు. అయితే టీడీపీ నేతలు మాత్రం అభ్యర్థుల వేటలో ఇబ్బందులు పడుతున్నారు.
‘పుర’ పోరు ప్రతిష్టాత్మకం
Published Thu, Mar 6 2014 2:55 AM | Last Updated on Sat, Sep 2 2017 4:23 AM
Advertisement