సాక్షి, అనంతపురం : సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. బుధవారం ఎన్నికల సంఘం ప్రకటించిన మేరకు ఎన్నికల నోటిఫికేషన్ ఏప్రిల్ 12న విడుదల కానుంది. 19న నామినేషన్ల స్వీకరణ, 21న పరిశీలన, 23న ఉప సంహరణ ఉంటాయి. జిల్లా వ్యాప్తంగా మే 7న పోలింగ్ జరగనుంది. అదే నెల 16న ఓట్ల లెక్కింపు..ఫలితాల ప్రకటన ఉంటుంది. మున్సిపల్, సార్వత్రిక ఎన్నికలు వెనువెంటనే రావడంతో రాజకీయ పార్టీల్లో అప్పుడే హడావుడి మొదలైంది. మున్సిపల్ ఎన్నికల్లో ఎవరిని బరిలోకి దింపాలన్న ఆలోచనలో ఉండగానే సార్వత్రిక ఎన్నికలు ముంచుకురావడంతో నేతల్లో అలజడి నెలకొంది.
మున్సిపల్ ఎన్నికలు ఈనెల 30న జరగనున్నాయి. ఆలోపే అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తే లాభపడే అవకాశం ఉందని ఆయా పార్టీలో నేతలు భావిస్తున్నారు. కాగా రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు కనీసం డిపాజిట్లు కూడా దక్కే అవకాశాలు కన్పించడం లేదు. ఈ క్రమంలో పరువు కోసం ఆ పార్టీ నేతలు పాకులాడుతున్నారు.
ఇందులో భాగంగా జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో సభలు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిసింది. తొలి విడతగా అనంతపురం పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గాల్లో సభలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. గ్రామ స్థాయిలో ఉండే ఒకరిద్దరు నాయకులను ఏదో ఒక విధంగా పార్టీలో కొనసాగేలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక తెలుగుదేశం పార్టీలో ఆధిపత్య పోరు కొనసాగుతూనే ఉంది. ఎన్నికలకు సంబంధించి అధిష్టానం ఇప్పటివరకు జిల్లా నేతలతో పూర్తి స్థాయిలో చర్చలు జరపలేదు. మున్సిపల్ ఎన్నికలు తరుముకొస్తున్నా అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించకపోవడంతో ఆ పార్టీ నేతల్లో ఆందోళన నెలకొంది. పార్టీలో కష్టపడి పని చేస్తున్న వారికి కాకుండా కాంగ్రెస్ నుంచి వచ్చిన వారికి అధినేత చంద్రబాబు ప్రాధాన్యత ఇస్తుండడంతో కొందరు నేతలు గుర్రుగా ఉన్నారు. మరోవైపు సినీనటుడు బాలకృష్ణను ఈసారి హిందూపురం పార్లమెంట్ నుంచి బరిలోకి దించాలా? అసెంబ్లీ స్థానానికే పరిమితం చేయాలా? అన్న దానిపై సమాలోచనలు జరుగుతున్నట్లు సమాచారం.
విషయంపై జిల్లా నేతలతో చర్చించి స్పష్టత ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. బాలకృష్ణకు కేటాయించే స్థానాన్ని బట్టి హిందూపురం పార్లమెంటు పరిధిలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలకు ప్రస్తుతం టిక్కెట్లు ఆశిస్తున్న అభ్యర్థుల భవితవ్యంతారుమారయ్యే అవకాశాలు ఎక్కువగా కన్పిస్తుండటంతో కొందరు నేతలు దిక్కుతోచని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు.
ఇక వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లాలో దూసుకెళ్తోంది. ఇప్పటికే నియోజకవర్గ సమన్వయకర్తలు, నేతలు ‘గడపగడపకూ వైఎస్‌ఆర్‌సీపీ’ పేరుతో ప్రజల్లోకి వెళ్తున్నారు. ఎన్నికల్లో పార్టీని గెలిపించాలని కోరుతూ విసృ్తతంగా ప్రచారం చేస్తున్నారు. మొత్తానికి వైఎస్‌ఆర్‌సీపీ ఫుల్ జోష్‌తో ముందుకు సాగుతుంటే.. అభ్యర్థులే లేక కాంగ్రెస్.. ఆధిపత్య, వర్గ పోరుతో టీడీపీ కొట్టుమిట్టాడుతున్నాయి.
మోగిన సార్వత్రిక నగారా
Published Thu, Mar 6 2014 1:59 AM | Last Updated on Tue, Aug 14 2018 4:44 PM
Advertisement