ట్రాన్స్‌కోకు, గ్రామపంచాయతీలకు మధ్య కరెంటు బకాయిల వివాదం ముదురుతోంది. బకాయిల వసూళ్లకోసం అధికారులు కరెంటు కట్ చేస్తున్న నేపథ్యంలో సర్పంచుల ధీటుగా స్పందిస్తున్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ బకాయిలు చెల్లించేది లేదని, అవసరమైతే వసూళ్లకు వచ్చే సిబ్బందిని నిర్భందిస్తామని సర్పంచుల సంఘం హెచ్చరికలు జారీ చేసింది. ఈ వివాదానికి కారణమైన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రేక్షక పాత్ర వహిస్తోంది.
కరీంనగర్ సిటీ : గ్రామాల్లో రక్షిత మంచినీటి సరఫరా, వీధిదీపాలు తదితర ప్రజావసరాలకు ఆయా పంచాయతీలు విద్యుత్‌ను వినియోగిస్తుంటాయి. గతంలో ప్రభుత్వమే పంచాయతీల విద్యుత్ బిల్లులను నేరుగా చెల్లించేది. కొద్ది నెలలుగా బిల్లులు చెల్లించకపోవడంతో జిల్లాలో 1207 గ్రామాలకు రూ.60 కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. ట్రాన్స్‌కో అధికారులు బకాయిలు చెల్లించాలని, లేన ట్లయితే విద్యుత్ కనెక్షన్ తొలగిస్తామని గత నెలలో గ్రామపంచాయతీలకు నోటీసులు జారీ చేశారు. విద్యుత్ బిల్లుల చెల్లింపు నుంచి తప్పుకున్న ప్రభుత్వం ఆ భారాన్ని పంచాయతీలపై మోపింది.
గ్రామాలకు వచ్చే 13వ ఆర్థిక సంఘం, ఎస్‌ఎఫ్‌సీ ని ధుల్లో 25 శాతం నిధులు బకాయిలు చెల్లించడానికి వెచ్చించాలని డీపీఓ ఈ నెలలో సర్క్యులర్ జారీ చేశారు. అసలే అరకొర నిధులతో నెట్టుకొస్తుంటే.. అందులోంచి 25 శాతం విద్యు త్ బిల్లులకు కేటాయించడాన్ని సర్పంచులు వ్యతిరేకించారు.
గతంలో మాదిరిగా ప్రభుత్వమే నేరు గా విద్యుత్ బిల్లులతో పాటు బకాయిలు చెల్లిం చాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం, సర్పంచు ల నడుమ ఈ వ్యవహారం కొనసాగుతుండగానే ట్రాన్స్‌కో అధికారులు రంగంలోకి దిగారు. వారం రోజుల వ్యవధిలో జిల్లాలోని దాదాపు రెండువందల గ్రామపంచాయతీల్లో విద్యుత్ కనెక్షన్లు కట్ చేశారు. దీనిపై సర్పంచులు తీవ్రం గా స్పందించారు. విద్యుత్ బిల్లులు గ్రామపంచాయతీలు చెల్లించేది లేదని తీర్మానించారు. పై గా విద్యుత్ కనెక్షన్ తొలగించడానికి ట్రాన్స్‌కో సిబ్బంది వస్తే నిర్బంధించాలంటూ సర్పంచుల సంఘం పిలుపునిచ్చింది. దీంతో ట్రాన్స్‌కో, పంచాయతీల మధ్య ప్రతక్ష్యంగా వార్ మొదలైంది. ఈ మేరకు జిల్లా సర్పంచుల సంఘం నాయకులు శుక్రవారం పలువురు ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, ట్రాన్స్‌కో అధికారులను కలిసి వినతిపత్రాలు అందచేశారు.
చర్యకు ప్రతిచర్య..
విద్యుత్ బకాయిలు వసూలు చేయడానికి ట్రాన్స్‌కో రంగంలోకి దిగగా, అందుకు ప్రతిచర్యకు పంచాయతీలు పూనుకుంటున్నాయి. గ్రామపంచాయతీల్లో ఉన్న విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు, సబ్‌స్టేషన్‌లకు పన్ను విధించేందుకు సర్పంచులు సమాయత్తమవుతున్నారు. గ్రామ అవసరాలకు వినియోగించిన విద్యుత్ బిల్లుల బకాయిల కోసం ట్రాన్స్‌కో కరెంట్ కట్ చేస్తే.. తాము తక్కువ కాదన్నట్లు ట్రాన్స్‌కోకు పన్నుల బకాయిల నోటీసులు పంపించాలని సర్పంచులు యోచిస్తున్నారు. నిబంధనల ప్రకారం గ్రామాల్లో ఉన్న ఒక్కో విద్యుత్ స్తంభానికి రూ.100, ట్రాన్స్‌ఫార్మర్‌కు రూ.వేయి, సబ్‌స్టేషన్‌లకు రూ.10 వేల చొప్పున తక్షణమే విద్యుత్ అధికారులు సంబంధిత గ్రామపంచాయతీలకు పన్నులు చెల్లించాలని సర్పంచులు డిమాండ్ చేస్తున్నారు.
సర్కారు ప్రేక్షకపాత్ర..
ట్రాన్స్‌కో,గ్రామపంచాయతీల నడుమ చిచ్చుపెట్టిన రాష్ట్ర సర్కారు మాత్రం ఈ వ్యవహారంలో ప్రేక్షకపాత్ర వహిస్తోంది. సర్పంచుల ఆందోళనను పరిగణలోకి తీసుకొని సమస్యను పరిష్కరించాల్సిన అధికారులు ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఓవైపు ట్రాన్స్‌కో దూకుడు పెంచగా, మరోవైపు సర్పంచులు అదేస్థాయిలో ప్రతిఘటించేందుకు సిద్ధంకావడంతో జిల్లాలో ప్రచ్ఛన్న యుద్ధానికి తెరలేచింది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని కరెంటు బిల్లుల ‘పంచాయతీ’ని పరిష్కరించాల్సిన అవసరముంది.
ముదిరిన ‘పంచాయతీ’
Published Sat, Aug 2 2014 4:04 AM | Last Updated on Sat, Sep 2 2017 11:14 AM
Advertisement
Advertisement