విశాఖపట్నం/ విజయవాడ, సాక్షి: ఏపీలో ఇవాళ భోగి మంటలతో కూటమి సర్కార్‌కు నిరసన ఎదురైంది. ఇందులో భాగంగా.. స్టీల్ ఫ్యాక్టరీ ఉద్యోగులు వినూత్న నిరసనకు దిగారు. యాజమాన్యం ఇచ్చిన కార్మిక వ్యతిరేక సర్క్యులర్‌లను భోగి మంటల్లో వేసింది పోరాట కమిటీ.
కూటమి ప్రభుత్వ తీరుకి నిరసనగా అడ్మిన్ బిల్డింగ్ వద్ద ఏర్పాటు చేసిన భోగి మంటల వద్ద నిరసన తెలిపారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు స్పందించి వెంటనే జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మరోవైపు..
విజయవాడలో భోగి పండుగ వేళ సీపీఎం వినూత్న నిరసనకు దిగింది. భోగిమంటల్లో కరెంట్ బిల్లులు వేసి తగలబెట్టింది. తక్షణమే ప్రజల పై విద్యుత్ బిల్లుల భారాన్ని తగ్గించాలని ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ నిరసన కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు , రాష్ట్రకార్యవర్గ సభ్యులు సిహెచ్.బాబురావు, రాష్ట్ర నేత దోనేపూడి కాశీనాధ్ తదితరులు పాల్గొన్నారు.
‘‘విద్యుత్ బిల్లుల భారాలకు వ్యతిరేకంగా భోగి మంటల్లో బిల్లులను దహనం చేశాం. తక్షణమే పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలి. స్మార్ట్ మీటర్లు పూర్తిగా రద్దు చేయాలి. విద్యుత్ భారాలు ప్రజల పై లేకుండా చూడాలి. డిస్కంలు అప్పులు పాలైతే ప్రజల నుంచి వసూళ్లు చేస్తారా?.
.. ఈ సంక్రాంతి పండుగకు ప్రజలకు కనీసం నిత్యావసర వస్తువులు ఇవ్వలేదు. P4 విధానం తెస్తున్నామని చంద్రబాబు గొప్పగా చెబుతున్నారు. P4 విధానం అంటే ప్రజల ఆస్తులను ప్రైవేటు పరం చేయడమే. రాష్ట్రాన్ని సంపన్నం చేయడం కాదు.. సంపన్నులకు దోచి పెట్టడమే చంద్రబాబు విధానం. అనిల్ అంబానీ దివాలా తీసిన పారిశ్రామిక వేత్త. అటువంటి వారితో పెట్టుబడులు ఎలా పెట్టిస్తారు?. దివాలా తీసిన వారితో పెట్టుబడులు పెట్టించడమంటే రాష్ట్రాన్ని దివాలా తీయించడమే!. ప్రభుత్వం ప్రోత్సహకాలు ఇస్తే... మళ్లీ దోపిడీనే. చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలి అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment