రాష్ట్ర మంత్రివర్గంలో చోటుకోసం ఎదురుచూస్తున్న సీనియర్ ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ చీఫ్‌విప్‌తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కొప్పులను చీఫ్‌విప్ పదవి వరించడంతో జిల్లాకు మరో క్యాబినెట్ హోదా పదవి దక్కింది. ఇప్పటివరకు ఈటెల రాజేందర్, కె.తారకరామారావు మంత్రులుగా ఉండగా, జెడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ సహాయ క్యాబినెట్ హోదా కలిగి ఉన్నారు. ఇటీవల మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ను సాంస్కృతిక సారథి కార్పొరేషన్ చైర్మన్‌గా నియమిస్తూ, క్యాబినెట్ హోదాను కల్పించారు.
కరీంనగర్‌సిటీ: సౌమ్యుడిగా పేరొం దిన కొప్పుల ఈశ్వర్ తొలుత మేడారం ప్రస్తుత రామగుండం నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహించేవారు. ఎస్సీ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో ధర్మపురి ఎస్సీ రిజర్వడ్ నియోజకవర్గం కావడంతో ఆయన ధర్మపురిని ఎంచుకున్నారు. టీఆర్‌ఎస్ నుంచి వరుసగా ఐదు ఎన్నికల్లో పోటీచేయడంతో పాటు ఘనవిజయం సాధించి రికార్డు నెలకొల్పారు.
రాష్ట్రంలో ఈటెల రాజేందర్,
టి.హరీష్‌రావు మాత్రమే ఈ రికార్డును సొంతం చేసుకున్నారు. అంతటి గుర్తింపు పొందిన కొప్పుల పార్టీ అధినేత కేసీఆర్‌కు సైతం విధేయుడుగా ముద్రపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక, తొలి మంత్రివర్గంలోనే కొప్పులకు చోటు దక్కడం ఖాయమని, అది కూడా ఉప ముఖ్యమంత్రి అని అప్పట్లో ప్రచారం జరిగింది. రెండు ఉప ముఖ్యమంత్రి పదవుల్లో ఒకటి మైనారిటీ, మరొకటి దళిత వర్గానికి ఇస్తానని కేసీఆర్ చెప్పడంతో దళిత కోటాలో డెప్యూటీ సీఎం కొప్పులే అని అంతా భావించారు. చివరి నిమిషంలో పరిస్థితి తారుమారు కావడంతో కొప్పులకు బదులు అదే కోటాలో వరంగల్ జిల్లా నుంచి రాజయ్యను ఉపముఖ్యమంత్రి పదవి వరించింది.
తొలి షాక్ నుంచి తేరుకున్న కొప్పుల తనకు కనీసం మంత్రి పదవైనా ఇస్తారని అధినేతపై గట్టి విశ్వాసం పెట్టుకున్నారు. ఇందులో భాగంగానే స్పీకర్, చీఫ్‌విప్, విప్ తదితర పదవులను ఇస్తామన్నా ఆయన తిరస్కరించినట్లు వార్తలు వచ్చాయి. మంత్రి పదవి తనకు కచ్చితంగా వస్తుందని, ఆ దిశగా కేసీఆర్ హామీ ఇచ్చారనే ధీమాతోనే ఆయన ముఖ్యమైన స్పీకర్ పదవిని కూడా వదులుకున్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి. చివరకు ఏ పదవి వద్దనుకున్నాడో ఆ చీఫ్‌విప్‌తోనే కొప్పుల సరిపెట్టుకోవాల్సి రావడాన్ని ఆయన వర్గీయులు జీర్ణించుకోలేకపోతున్నారు.
సమీకరణల్లో భాగంగానేనా...?
ఇదిలా ఉంటే జిల్లాలు, సామాజిక సమీకరణల మూలంగానే కొప్పులకు మంత్రి పదవి దూరమైంద ని పార్టీ సీనియర్ నేతలు చెబుతున్నారు. మంత్రి వర్గసభ్యుల సంఖ్య మొత్తం శాసనసభ సభ్యుల సంఖ్యలో 15 శాతం మించకూడదనే నిబంధన ఉంది. రాష్ట్రంలో మొత్తం 120 మంది ఎమ్మెల్యేలకు 15 శాతం అంటే 18 మందికి మించి మంత్రి మండలి ఉండరాదు. ఇప్పటికే 12 మందితో రాష్ట్ర మంత్రివర్గం ఏర్పాటైంది. ప్రస్తుతం ప్రాతినిథ్యం లేని జిల్లాలకు ఇవ్వడంతో పాటు, మహిళలు, గిరిజనులు, ఇతర సామాజిక వర్గాలను పరిగణలోకి తీసుకోవడంతో ఆరుగురితో కోటా నిండిపోయింది. దీనితో కొప్పులకు మొండిచేయి తప్పలేదని పార్టీ నేతలు విశ్లేషిస్తున్నారు.
జిల్లాకు తొలిసారి
చీఫ్‌విప్ పదవి జిల్లాను తొలిసారి వరించింది. గతంలో విప్ పదవి జిల్లాకు వచ్చినప్పటికీ చీఫ్ విప్ పదవి రావడం ఇదే మొదటిసారి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు విప్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో మానకొండూర్ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ సైతం విప్‌గా కొనసాగారు. ప్రస్తుతం కొప్పులకు చీఫ్‌విప్ పదవి రావడంతో జిల్లాకు మొదటి సారి ఈ పదవి వ చ్చినట్లయింది.
కక్కలేక...మింగలేక
చీఫ్‌విప్ పదవి రావడంతో కొప్పుల ఈశ్వర్ పరిస్థితి క క్కలేక... మింగలేక అన్నట్లుగా తయారైంది. మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు జరిగినా తనకు మంత్రి పదవి ఖాయమని ధీమాతో ఉన్న కొప్పులకు ఈ పరిణామం మింగుడుపడడం లేదు. చీఫ్‌విప్ పదవి క్యాబినెట్‌హోదా కలిగిందే అయినా మంత్రి పదవితో సమాన స్థాయి కాదనే బాధ ఆయన వర్గీయుల్లో నెలకొంది. మంత్రి పదవి రాలేదు కాబట్టి అసంతృప్తి వ్యక్తం చేయాలా... క్యాబినెట్ హోదాతో చీఫ్‌విప్ పదవి లభించింది కాబట్టి తృప్తిపడి సర్దుకుపోవాలో తెలియని అయోమయంలో కొప్పుల, ఆయన వర్గీయులు ఉన్నారు.
ఎమ్మెల్యేలకు
కార్పొరేషన్ చైర్మన్ వచ్చేనా?
మంత్రివర్గంలో చోటు లభించని ఎమ్మెల్యేలను ఇతర పదవులతో భర్తీ చేస్తున్న క్రమంలో జిల్లా ఎమ్మెల్యేల్లో ఆశలు చిగురిస్తున్నాయి. మంత్రి, ఆ స్థాయి పదవులు రాని ఆరేడుగురు ఎమ్మెల్యేలకు కార్పొరేషన్ చైర్మన్ పదవులు కట్టబెడుతున్నట్లు శనివారం ప్రచారం జరిగింది. దీంతో మంత్రి పదవి రేసులో కూడా లేని కొంతమంది ఎమ్మెల్యేలు కార్పొరేషన్ చైర్మన్ పదవులపై ఆశలు పెంచుకున్నారు. వారి ఆశలు ఏ మేరకు ఫలిస్తాయో వేచిచూడాలి.
రాజకీయ ప్రస్థానం
2004లో గని కార్మికునిగా ఉంటు అదే సంవత్సరంలో మేడారం నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందాడు.
కేసీఆర్ పిలుపు మేరకు ఉద్యమ క్రమంలో ఎమ్మెల్యే పదవికి 2008లో రాజీనామా చేశారు.
2008లో జరిగిన ఉప ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలుపొందారు.
2009 సంవత్సరంలో పునర్విభజనలో అప్పటి బుగ్గారం స్థానంలో ధర్మపురి నియోజకవర్గం (ఎస్సీ రిజర్వడ్)గా మారింది.
2009 అసెంబ్లి ఎన్నికల్లో టీఆర్‌ఎస్ నుంచి పోటీచేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
2010లో తెలంగాణ ఏర్పాటు విషయం లో శ్రీకృష్ణ కమిటీతీర్పును నిరసిస్తూ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.
2010 ఉప ఎన్నికల్లో మళ్లీ భారీ మెజార్టీతో గెలుపొందారు.
2014 సాధారణ ఎన్నికల్లో గెలుపొందారు.
2004 నుంచి 2014 వరకు వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా పోటీచేసి విజయం సాధించారు.
కోల్‌బెల్ట్ నుంచే ఎదిగిన ‘కొప్పుల’ ..
గోదావరిఖని: కొప్పుల ఈశ్వర్ రాజకీయ ప్రస్థానం కోల్‌బెల్ట్ నుంచే ప్రారంభమైంది. ఆయన 1972లో సింగరేణి సీఎస్‌పీ-1లో జనరల్ మజ్దూర్‌గా ఉద్యోగం పొందారు. వివిధ గనుల్లో పనిచేసి 2004లో మేడిపల్లి ఓసీపీలో ట్రిప్‌మెన్‌గా పని చేస్తూ 32 ఏళ్ల సర్వీస్ తర్వాత ఎన్నికల్లో పోటీచేసే నిమిత్తం రాజీనామా చేశారు. ఈశ్వర్ తొలుతవిప్లవ భావాలు కలిగిన సీపీఐఎంఎల్, ఐఎఫ్‌టీయూ, ఏఐఎఫ్‌టీయూలలో నిర్బంధంలో పనిచేశారు. ఆ సమయంలో సింగరేణి కార్మికుల సమస్యలపై వివిధ పోరాటాల్లో పాల్గొన్నారు. పలు సందర్భాలలో ఆయన జైలుకు వెళ్లా రు. టీడీపీలో చేరి మేడారం ఎస్సీ నియోజకవర్గం నుంచి 1994లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. 2001లో టీఆర్‌ఎస్‌లో చేరారు. నాటి నుంచి అంచలంచెలుగా ఎదుగుతూ పార్టీలో పొలిట్‌బ్యూరో సభ్యుడిగా ఉన్నారు. 2004లో కాంగ్రెస్ పొత్తుతో మేడారం నుంచి తొలి సారిగా, అనంతరం ధర్మపురి నియోజకవర్గం నుంచి పలుమార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.
పాపం ‘కొప్పుల’
Published Sun, Dec 14 2014 2:58 AM | Last Updated on Wed, Aug 15 2018 8:23 PM
Advertisement