కరీంనగర్ సిటీ : జిల్లా పరిషత్‌పై గులాబీ జెండా ఎగిరింది. పూర్తి మెజారిటీ సాధించిన టీఆర్‌ఎస్ ఊహించినట్లుగానే శనివారం జరిగిన ఎన్నికల్లో జెడ్పీ చైర్‌పర్సన్, వైస్‌చైర్మన్‌తో పాటు రెండు కో-ఆప్షన్ పదవులను దక్కించుకుంది. మొదట పోటీకి సిద్ధపడ్డ కాంగ్రెస్ సభ్యుల సంఖ్యాబలం లేకపోవడంతో వెనక్కు తగ్గింది. దీం తో ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి. టీఆర్‌ఎస్ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, కథలాపూర్ జెడ్పీటీసీ సభ్యురాలు తుల ఉమ చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో తొలి జెడ్పీ చైర్‌పర్సన్‌గా, జెడ్పీ చరిత్రలో తొలి మహిళా చైర్‌పర్సన్‌గా రికార్డు సృష్టించారు. చైర్‌పర్సన్‌గా ముం దునుంచి అనుకున్నట్లుగానే ఉమ అభ్యర్థిత్వాన్ని పార్టీ ఖరారు చేసింది.
ఉదయం 9.50 గంటలకు తన అభ్యర్థిత్వాన్ని సూచిస్తూ పార్టీ పంపిన అధికారిక లేఖను ఆమె ఎన్నికల అధికారికి అందచేశారు. మధ్యాహ్నం ఒంటిగంటకు జెడ్పీటీసీల ప్రమాణస్వీకారం అనంతరం చైర్‌పర్సన్ ఎన్నిక నిర్వహిం చారు. అంతకుముందు తుల ఉమ తమ చైర్‌పర్సన్ అభ్యర్థి అని పార్టీ జెడ్పీటీసీలకు టీఆర్‌ఎస్ విప్ జారీ చేసింది. ఉమ ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో జెడ్పీ చైర్‌పర్సన్‌గా ఆమె ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి, ఇన్‌చార్జి కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ ప్రకటించారు.
కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక
జిల్లా పరిషత్‌లో ఉన్న రెండు కో-ఆప్షన్ పదవులు టీఆర్‌ఎస్ పరమయ్యాయి. ఉదయం 10లోపు కరీంనగర్ మండలం కొత్తపల్లికి చెందిన ఎండీ.జమీలుద్దీన్, ముస్తాబాద్‌కు చెందిన మహ్మద్‌సర్వర్ నామినేషన్ వేశారు. రెండు నామినేషన్లే రావడం తో వారిద్దరు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఆలస్యంతో చేజారిన అవకాశం
రెండు కో-ఆప్షన్ పదవులకు కరీంనగర్‌కు చెందిన జమీల్, జగిత్యాలకు చెందిన ఫయాజుద్దీన్‌ను పార్టీ ముందుగా ఎంపిక చేసింది. ఫయాజ్ 10 గంట ల్లోపు జెడ్పీకి చేరుకోకపోవడంతో అప్పటికే సిద్ధం గా ఉన్న మహ్మద్‌సర్వర్‌తో నామినేషన్ వేయించా రు. అయినప్పటికీ ఫయాజుద్దీన్‌తో నామినేషన్ వేయించడానికి పార్టీ నాయకులు ప్రయత్నించగా అధికారులు అంగీకరించలేదు. దీంతో ఆయన కో-ఆప్షన్ సభ్యుడిగా అవకాశం కోల్పోయారు.
పార్టీల వారీగా సీటింగ్
జెడ్పీటీసీలకు పార్టీల వారీగా సీటింగ్ ఏర్పాటు చేశారు. ముందు వరుసలో ఎక్స్‌అఫిషియో సభ్యులకు అనంతరం జాతీయ, ప్రాంతీయపార్టీలవారీగా కేటాయించారు. తెలుగు అక్షరమాల ప్రకారం సభ్యులకు సీట్లు ఏర్పాటు చేశారు.
రెండోసారి టీఆర్‌ఎస్ కైవసం
జిల్లా పరిషత్‌ను టీఆర్‌ఎస్ రెండోసారి కైవసం చేసుకుంది. 2001లో పార్టీ ఆవిర్భావం తర్వాత వచ్చిన స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్‌ఎస్ తొలిసారి జెడ్పీ పీఠాన్ని దక్కించుకుంది. 2001 ఆగస్టు 2 నుంచి 2006 జూలై 22 వరకు కేవీ.రాజేశ్వరరావు జెడ్పీ చైర్మన్‌గా ఉన్నారు. ప్రస్తుతం తుల ఉమ చైర్‌పర్సన్‌గా ఎన్నికవడం ద్వారా టీఆర్‌ఎస్ జెండా జెడ్పీపై జెండా ఎగురవేసింది.
కొలువుదీరిన పాలకవర్గం
మూడేళ్ల సుదీర్ఘ విరామం అనంతరం జెడ్పీ పాలకవర్గం శనివారం కొలువుతీరింది. మధ్యాహ్నం ఒంటి గంటకు 41 మంది టీఆర్‌ఎస్ జెడ్పీటీసీలు, 14 మంది కాంగ్రెస్ జెడ్పీటీసీలు, ఒక బీజేపీ, ఒక టీడీపీ సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమాల్లో రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్, పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్, ఎమ్మెల్యేలు కమలాకర్, మనోహర్‌రెడ్డి, విద్యాసాగర్‌రావు, మధు, సత్యనారాయణ, రమేష్‌బాబు, ఈశ్వర్, సతీష్‌బాబు పాల్గొన్నారు. ఇన్‌చార్జి కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ ఎన్నికల అధికారిగా వ్యహరించగా, జెడ్పీ సీఈవో సదానందం ఎన్నికలు నిర్వహించారు.
జిల్లా పరిషత్‌పై గులాబీ జెండా
Published Sun, Jul 6 2014 3:07 AM | Last Updated on Sat, Sep 2 2017 9:51 AM
Advertisement
Advertisement