సోమవారం అమిత్ షాతో భేటీ తర్వాత అధికారికంగా ప్రకటించే చాన్స్
కిషన్‌రెడ్డికి మళ్లీ కేంద్ర మంత్రి పదవి రావడంతో.. రాష్ట్ర పార్టీకి కొత్త అధ్యక్షుడి నియామకం
స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని మరింత బలోపేతం చేయడంపై ఫోకస్
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం చేజిక్కించుకోవాలనే దీర్ఘకాలిక వ్యూహం
సాక్షి, హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ నియామకం కానున్నట్టు ఆ పార్టీలోని విశ్వసనీయ వర్గాల సమాచారం. సోమవా రం ఢిల్లీలో కేంద్ర మంత్రి అమిత్ షాతో ఈటల సమావేశం కానున్నారు. అనంతరం ఈటలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమిస్తూ అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్టు తెలిసింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న జి.కిషన్‌రెడ్డికి మళ్లీ కేంద్ర కేబినెట్ మంత్రిగా అవకాశం దక్కిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఈటల రాజేందర్‌ను రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించి, పార్టీ బలోపేతంపై దృష్టిపెట్టాలని జాతీయ నాయకత్వం నిర్ణయానికి వచ్చినట్టు బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. ఆదివారం తనకు సన్నిహితులైన అస్సాం సీఎం, అధిష్టానం దూత హిమంత బిశ్వతో ఈటల భేటీ అయిన సందర్భంగా జాతీయ నాయకత్వం ఆలోచనలు, ఇతర అంశాలపై స్పష్టత వచ్చినట్టు సమాచారం. అంతకుముందు అమిత్ షా కూడా ఈటలతో ఫోన్‌లో మాట్లాడి ఈ అంశాలను వివరించినట్టు తెలిసింది. తెలంగాణ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ పుంజుకుందని.. పార్టీ శ్రేణులను పూర్తిస్థాయిలో సమాయత్తం చేసి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకెళ్లాలని వారిద్దరు సూచించినట్టు సమాచారం.
కేంద్ర మంత్రి పదవి ఆశించినా..
ఈటల రాజేందర్ తొలుత కేంద్ర మంత్రి పదవి ఆశించారు. కానీ పార్టీ అగ్ర నాయకత్వం ఒప్పించడంతో రాష్ట్ర అధ్యక్ష పదవి చేపట్టేందుకు ఆయన సిద్ధమైనట్టు పార్టీ నాయకులు చెప్తున్నారు. రాష్ట్రంలో త్వరలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని క్షేత్రస్థాయి నుంచి పటిష్టం చేయడంపై జాతీయ నాయకత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని అంటున్నారు.
దాదాపు ఇరవై ఏళ్లపాటు టీఆర్‌ఎస్‌లో, తెలంగాణ ఉద్యమ సమయంలో గుర్తింపుతోపాటు కేసీఆర్ కేబినెట్‌లో నంబర్ టూగా కొనసాగిన నేపథ్యంలో.. ఈటలకు ఉన్న విస్తృత పరిచయాలు, మంత్రిగా పనిచేసిన అనుభవం, సమర్థవంతమైన నాయకుడిగా ఉన్న ఇమేజీ పార్టీ పురోగతికి దోహదపడతాయని భావిస్తున్నట్టు చెప్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈటలకున్న గుర్తింపు, వివిధ సామాజిక వర్గాలతో ముఖ్యంగా బీసీ వర్గాలు, సంఘాలతో మంచి సంబంధాలు ఉండటం కూడా బీజేపీ బలోపేతానికి ఉపయోగపడుతుందని పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment