ఈ నెలాఖరులోగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని ఎన్నిక
పోటీలో పది మంది
సాక్షి, అమరావతి: బీజేపీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఏపీ బీజేపీ అధ్యక్ష పదవికి ఈ నెలాఖరులోగా ఎన్నిక జరగనుంది. అధ్యక్ష బాధ్యతల్లో ఉన్న దగ్గుబాటి పురందేశ్వరి స్థానంలో కొత్త వారు నియమితులవుతారని పార్టీ వర్గాల్లో విస్తృత ప్రచారం సాగుతోంది. 2023 జూలైలో పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన ఆమెను కొనసాగించే అవకాశం లేకపోలేదని కూడా కొందరు నేతలు అంటున్నారు. అయితే, పురందేశ్వరి పార్టీ అధ్యక్ష బాధ్యతల కంటే.. కేంద్ర మంత్రివర్గంలో చోటుకోసమే ఎక్కువ ఆసక్తితో ఉన్నారని చెబుతున్నారు.
కాగా.. పార్టీ అధ్యక్ష పదవి కోసం దాదాపు 10 మంది వరకు పోటీ పడుతున్నట్టు పేర్కొంటున్నారు. విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి, మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్, ప్రస్తుతం పార్టీ ఉపాధ్యక్షునిగా పనిచేస్తున్న విష్ణువర్థన్‌రెడ్డితో పలువురు పేర్లు ప్రచారంలో ఉన్నాయి. పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా మండల కమిటీల ఎన్నిక పూర్తవగా, వచ్చే వారంలో జిల్లా అధ్యక్ష పదవులకు ఎన్నికలు జరగనున్నాయి.
సంస్థాగత ఎన్నికల ప్రక్రియలోనే ఏకాభిప్రాయం ప్రకారమే బీజేపీ జిల్లా అధ్యక్ష పదవులకు ఎన్నిక పూర్తి చేసేందుకు పార్టీ నిర్ణయించింది. దీంట్లో భాగంగా ఇప్పటికీ రాష్ట్ర పార్టీలో పలువురు సీనియర్ నాయకులు ఈ నెల 3, 4 తేదీల్లో వివిధ జిల్లాల్లో పర్యటించి నేతల అభిప్రాయాల మేరకు ఆయా జిల్లాల్లో పార్టీ అధ్యక్ష పదవులకు పేర్లను రాష్ట్ర పార్టీకి నివేదిక రూపంలో అందజేశారని సమాచారం.
నివేదికలో సూచించిన పేర్లపై కొద్ది రోజుల క్రితం పార్టీ జాతీయ సహ సంఘటనా కార్యదర్శి శివప్రకాశ్ నేతృత్వంలో కోర్‌కమిటీ సమావేశమై చర్చించింది. సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు వచ్చే వారం, పది రోజుల్లోనే జిల్లాల అధ్యక్షులను ప్రకటించే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment