నామినేషన్లు దాఖలు చేస్తున్న బల్మూరి వెంకట్, మహేశ్ గౌడ్. చిత్రంలో వివేక్, భట్టి, పొంగులేటి, తుమ్మల, అంజన్ కుమార్, ఉత్తమ్, వీహెచ్ తదితరులు
సాక్షి, హైదరాబాద్: శాసన మండలిలో ఎమ్మెల్యే కోటాలో ఖాళీగా ఉన్న రెండు స్థానాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా బల్మూరి వెంకట్, మహేశ్ కుమార్ గౌడ్ గురువారం నామినేషన్ దాఖలు చేశారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల ఉప ఎన్నిక నోటిఫికేషన్ ఈనెల 11న వెలువడింది. నామినేషన్ల స్వీకరణకు గురువారం చివరి రోజు కాగా కాంగ్రెస్ అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను అసెంబ్లీ రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. నామినేషన్ దాఖలు కార్యక్రమానికి డిప్యూటీ సీఎం భట్టి విక్ర మార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హాజర య్యారు. వీరితో పాటు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు గిడుగు రుద్రరాజు, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యతో పాటు పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
ఎన్నిక ఏకగ్రీవమే
రెండు స్థానాలకు ఇద్దరు అభ్యర్థులు మాత్రమే నామినేషన్ వేయడంతో ఎన్నిక ఏకగ్రీవం కానుంది. అయితే ఈ నెల 19న నామినేషన్ల పరిశీలన, 22న ఉపసంహరణ ప్రక్రియ ముగిసిన తర్వాత ఫలితాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు. 119 ఎమ్మెల్యేలు కలిగిన తెలంగాణ అసెంబ్లీలో సీపీఐతో కలుపుకుని కాంగ్రెస్‌కు 65 మంది సభ్యుల సంఖ్యాబలం ఉంది. మరోవైపు 39 మంది ఎమ్మెల్యేలు కలిగిన బీఆర్‌ఎస్ పార్టీ ఈ ఎన్నిక పక్రియకు దూరంగా ఉంది. దీంతో కాంగ్రెస్ తరపున ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఇద్దరు అభ్యర్థులు నామినేషన్లు వేయడంతో ఎమ్మెల్సీలుగా బల్మూరు వెంకట్, మహేశ్ కుమార్ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశముంది. నామినేషన్ల అనంతరం మంత్రి ఉత్తమ్ మీడియాతో మాట్లాడారు. పార్టీలో కష్టపడిన వారికి గుర్తింపు లభిస్తుందనేందుకు ఈ ఇద్దరు నాయకులను శాసన మండలికి పంపడమే ఉదాహరణ అని ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment