
'నేనెప్పుడు చనిపోతానా అని చూస్తున్నారు'
మెదక్: టీఆర్ఎస్ నాయకురాలు, మెదక్ ఎంపీ విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఎప్పుడు చనిపోతానా అని కొందరు ఎదురుచూస్తున్నారని అన్నారు. తెలంగాణ కోసం 10 సంవత్సరాలపాటు కష్టపడితే తనను ఒంటరిని చేసి రోడ్డున పడేశారని ఆమె వాపోయారు. తననిక ప్రజలే ఆదరించాలని కోరారు. మెదక్‌లో జరిగిన రైల్వేస్టేషన్ శంకుస్థాపన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
టీఆర్ఎస్ తనను వెన్నుపోటు పొడిచిందని పరోక్షంగా వ్యాఖ్యానించారు. తనపై రాజకీయాలు ఆపి ప్రజల సంక్షేమం గురించి ఆలోచించాలని హితవు పలికారు. రాజకీయాలు కాదు, ప్రజల ఆప్యాయత ముఖ్యమన్నారు. తాను పాలకపక్షంలో లేనని విపక్షంలో ఉన్నానని స్పష్టం చేశారు. తాను ఒంటరిని.. తనకంటూ ఎవ్వరూ లేరని విజయశాంతి భావోద్వేగానికి గురయ్యారు.