మనసుకి నచ్చిన కథ వచ్చే వరకూ కొందరు స్టార్స్ ఖాళీగా ఉంటారు తప్ప ఏ సినిమా పడితే అది చేయరు. కొందరికి నచ్చిన కథ వచ్చినా ఆరోగ్యం బాగా లేక ఇంటిపట్టున ఉండాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. వేరే వ్యక్తిగత కారణాల వల్ల కూడా కొందరు బ్రేక్ తీసుకుంటారు. కారణాలు ఏమైనా ఈ మధ్య కొందరు స్టార్స్ సినిమాలకు గ్యాప్ ఇచ్చారు. బ్రేక్ తర్వాత కెమెరా ముందుకి వచ్చి, ఆ తారామణులు చేస్తున్న, చేసిన చిత్రాల గురించి తెలుసుకుందాం.
⇒ తెలుగు ప్రేక్షకుల మనసుల్లో లేడీ సూపర్ స్టార్‌గా నిలిచిపోయారు నటి విజయశాంతి. ‘నాయుడమ్మ’ (2006) సినిమా తర్వాత పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి వెళ్లారామె. దాదాపు 14 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మహేశ్‌బాబు హీరోగా నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ (2020) సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు విజయశాంతి.
ప్రోఫెసర్ భారతి పాత్రలో తనదైన నటనను, భావోద్వేగాలను ప్రదర్శించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారామె. ‘సరిలేరు నీకెవ్వరు’ తర్వాత మళ్లీ రాజకీయాల్లో బిజీ అయిన విజయశాంతి దాదాపు మూడున్నరేళ్ల తర్వాత ఓ సినిమా కమిట్ అయ్యారు. కల్యాణ్ రామ్ హీరోగా రూపొందుతున్న తాజా చిత్రంలో నటిస్తున్నారామె. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహిస్తున్న
ఈ చిత్రంలో వైజయంతీ ఐపీఎస్ అనే పవర్‌ఫుల్ పాత్ర చేస్తున్నారు. ఈ నెల 24న విజయశాంతి పుట్టినరోజుని పురస్కరించుకుని ఆమె పాత్ర తాలూకు గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. ‘వైజయంతీ ఐపీఎస్. తాను పట్టుకుంటే పోలీస్ తుపాకీకి ధైర్యం వస్తుంది.. వేసుకుంటే యునిఫామ్‌కి ΄ûరుషం వస్తుంది.. తనే ఒక యుద్ధం. మేమే తన సైన్యం’ అంటూ విడుదలైన
గ్లింప్స్‌కి అద్భుతమైన స్పందన వస్తోంది.
⇒ తెలుగులో జేజమ్మగా ప్రేక్షకుల మనసు దోచుకున్నారు అనుష్క. గత ఏడాది ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చారు ఈ బ్యూటీ. 2018లో విడుదలైన ‘భాగమతి’ మూవీ తర్వాత ‘నిశ్శబ్దం’ (2020)లో కథానాయికగా నటించారు. ఈ రెండు చిత్రాలకు మధ్య ‘సైరా’లో అతిథి పాత్ర చేశారు. ‘నిశ్శబ్దం’ తర్వాత కాస్త గ్యాప్ తీసుకుని, ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ (2023) చేశారు. ఈ చిత్రం విడుదలైన ఏడాదికి కొత్త చిత్రాలు కమిట్ అయ్యారు.
ప్రస్తుతం ఆమె ‘కథనార్–ది వైల్డ్ సోర్సెరర్’ అనే మలయాళ సినిమాలో నటిస్తున్నారు. తెలుగులో అంగీకరించిన చిత్రం ‘ఘాటీ’. ఈ చిత్రానికి క్రిష్ దర్శకుడు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ సినిమా రూపొందుతోంది. ఒడిశాలోని ఒక మహిళ జీవితంలో జరిగిన వాస్తవ ఘటన నేపథ్యంలో ‘ఘాటీ’ని తెరకెక్కిస్తున్నారని టాక్. అందుకే ఆంధ్రా–ఒడిశా బోర్డర్‌లో తొలి షెడ్యూల్ చిత్రీకరణ జరిపారట. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుగుతోంది.
⇒ ‘ఛాతీ మీద చటాకు మాంసం లేదు నువ్వు పెద్ద రౌడీవా?, రేయ్.. నీకంటే పెద్ద రౌడీరా నేను.. ముందు నాతో కొట్లాడు.. సిద్ధిపేటలో అడుగు చాందినీ గురించి చెబుతారు’ అంటూ ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రంలో నభా నటేశ్ చెప్పిన మాస్ డైలాగులు ప్రేక్షకుల మనసుల్లో లోతుగా గుచ్చుకున్నాయి. సుధీర్ బాబు హీరోగా నటించిన ‘నన్ను దోచుకుందువటే’ (2018) సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చారీ బ్యూటీ.
ఆ తర్వాత ‘అదుగో, ఇస్మార్ట్ శంకర్, డిస్కో రాజా, సోలో బ్రతుకే సో బెటర్’ వంటి మూవీల్లో నటించారు. కాగా ‘ఇస్మార్ట్ శంకర్’ మూవీతో హిట్‌ని తన ఖాతాలో వేసుకోవడంతో పాటు ప్రేక్షకుల్లో ‘ఇస్మార్ట్ బ్యూటీ’గా పేరు తెచ్చుకున్నారు నభా. ఓ కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఆమె దాదాపు మూడేళ్లు సినిమాలకు బ్రేక్ ఇచ్చారు. ప్రస్తుతం నిఖిల్ హీరోగా రూపొందుతున్న ‘స్వయంభూ’లో హీరోయిన్‌గా నటిస్తున్నారు నభా.
⇒ మలయాళ తార మమతా మోహన్‌దాస్ తెలుగులో హీరోయిన్‌గా నటించిన తొలి చిత్రం ‘యమదొంగ’(2007). ఈ చిత్రంలో ‘చంపేస్తాన్రా రేయ్.. ఆగండ్రా.. రేయ్ యాడికి పోతార్రా.. ఏదో ఒకరోజు దొరకాల.. నెల్లూరు ట్రంకు రోడ్డులో గుడ్డలూడదీసి తంతాను నాయాల్లారా..’ అంటూ ‘యమదొంగ’లో మమతా మోహన్‌దాస్ చెప్పిన డైలాగ్స్ బాగా పాపులర్ అయ్యాయి. ఆ తర్వాత తెలుగులో వరుస అవకాశాలు అందుకున్నారామె.
నాగార్జున హీరోగా నటించిన ‘కేడీ (2009) తర్వాత మరో తెలుగు సినిమా చేయలేదు. దాదాపు 14 ఏళ్ల తర్వాత ‘రుద్రంగి’ (2023) చిత్రంతో తెలుగులో రీ ఎంట్రీ ఇచ్చారు మమతా మోహన్‌దాస్. ఇటీవల ఆమె నటించిన ‘మహారాజ’ (విజయ్ సేతుపతి హీరో) సినిమా ఈ నెల 14న తెలుగు, తమిళ భాషల్లో విడుదలైంది.
⇒ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు శోభన. కృష్ణ, చిరంజీవి, మోహన్‌బాబు, నాగార్జున, వెంకటేశ్, బాలకృష్ణ, రాజేంద్ర ప్రసాద్, జగపతిబాబు వంటి హీరోలందరికీ జోడీగా నటించారామె. ప్రత్యేకించి కార్తీ హీరోగా నటించిన ‘అభినందన’ (1988) సినిమాలో ఆమె నటన అద్భుతం. ఇక ‘సూర్య పుత్రులు’ (1997) తర్వాత దాదాపు పదేళ్లు తెలుగు సినిమాల నుంచి విరామం తీసుకున్న ఆమె మోహన్‌బాబు, విష్ణు మంచు నటించిన ‘గేమ్’ (2006) మూవీతో రీ ఎంట్రీ ఇచ్చారు. ఆ చిత్రం తర్వాత తెలుగులో దాదాపు పద్దినిమిదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ప్రభాస్ హీరోగా నటించిన ‘కల్కి 2898 ఏడీ’ మూవీతో రీ ఎంట్రీ ఇచ్చారు శోభన. ఈ చిత్రంలో శంబాల రాజ్యానికి చెందిన నాయకురాలు మరియంగా తనదైన నటనతో ఆకట్టుకున్నారామె. ఈ చిత్రం ఈ గురువారం (మే 27) విడుదలైంది.
Comments
Please login to add a commentAdd a comment