రాహుల్ కోసమే రాష్ట్ర విభజన: హరికృష్ణ
కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని దేశ ప్రధాన మంత్రిని చేసేందుకే యూపీఏ సర్కార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు మొగ్గు చూపుతోందని రాజ్యసభ మాజీ సభ్యుడు నందమూరి హరికృష్ణ ఆరోపించారు. శుక్రవారం న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేంలో ఆయన మాట్లాడారు. రానున్న సాధారణ ఎన్నికల్లో రాహుల్ను మెదక్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేయించేందుకు కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోందని ఆయన పేర్కొన్నారు. విభజనకు కాంగ్రెస్ పార్టీయే బాధ్యత వహించాలన్నారు.
తన తండ్రి ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం తర్వలో యాత్ర చేపడతానన్నారు. హైదరాబాద్ నగరం అన్ని ప్రాంతాలవారి సమాహారం అని హరికృష్ణ తెలిపారు. అలనాడు మహాభారతంలో పాండవులు, కౌరవులు మధ్య శకుని పోషించిన పాత్రను ఈనాడు కాంగ్రెస్ పార్టీ పోషిస్తుందని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనను నిరసిస్తూ రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ గురువారం తన సభ్యత్వానికి రాజీనామా చేశారు. హరికృష్ణ చర్యపై ఓయూ జేఏసీ గురువారం తీవ్ర అగ్రహాం వ్యక్తం చేసింది. నందమూరి హరికృష్ణ కుమారుడు జూనియర్ ఎన్టీఆర్ చిత్రాల విడుదలను అడ్డుకుంటామని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో హరికృష్ణ శుక్రవారం పై విధంగా స్పందించారు.