మెదక్ ఎంపీ అభ్యర్థిపై కేసీఆర్ కసరత్తు
మెదక్ ఎంపీ అభ్యర్థి ఎంపికపై టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ కసరత్తును తీవ్ర తరం చేశారు. జూన్ 2వ తేదీన తెలంగాణ సీఎంగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆ లోపే మెదక్ ఎంపీ అభ్యర్థిని ఎంపిక చేసేందుకు తీవ్రంగా కేసీఆర్ కృషి చేస్తున్నారు. అయితే ఆ లోక్సభ స్థానాన్ని ఎవరికి కేటాయించాలి అనే అంశంపై పార్టీ సీనియర్ నేతలు, ఉద్యోగ సంఘాల నేతలతో ఆయన తీవ్రంగా చర్చిస్తున్నారు. మెదక్ లోక్సభ స్థానానికి తమ సంఘం నాయకుడు దేవీప్రసాద్ని ఎంపిక చేయాలని తెలంగాణ ఎన్జీవో సంఘానికి చెందిన నేతలు కేసీఆర్పై ఒత్తిడి తెస్తున్నారు.
మెదక్ ఎంపీ స్థానానికి పోటీ చేయాలని మాజీ మంత్రి నాయిని నరసింహారెడ్డిని కేసీఆర్ కోరగా, నాయిని సున్నితంగా తిరస్కరించారు. తానకు ఎమ్మెల్సీ పదవి ఇస్తే ఇక్కడే ఉంటూ రాష్ట్రానికి సేవ చేసుకుంటానని ఆయన కేసీఆర్కు తన మనసులోని మాట చెప్పారు. అలాగే మాజీ ఐఏఎస్ అధికారి కె.వి.రమణాచారి అయితే ఎలా ఉంటుంది అనే అంశంపై కూడా పార్టీ నాయకులతో తీవ్రంగా చర్చించారు.
మెదక్ ఎంపీ అభ్యర్థి పేరుని రేపటిలోగా ఖరారు చేయాలని కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కేసీఆర్ అటు గజ్వేల్ అసెంబ్లీతోపాటు ఇటు మెదక్ లోక్సభ స్థానానికి పోటీ చేసి రెండు చోట్ల విజయం సాధించారు. జూన్ 2వ తేదీ కేసీఆర్ తెలంగాణ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ సందర్బంగా మెదక్ లోక్సభ స్థానానికి కేసీఆర్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.