సాక్షి, నర్సాపూర్ : దేశంలో ఎన్నికలంటే కుల గజ్జి, మత గజ్జి , డబ్బులు పంచుడుగా మారిందని తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు వ్యాఖ్యానించారు. బుధవారం నర్సాపూర్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగించారు. బుధవారం రోజు 3లక్షల మందిని కలుసుకున్నానని, ఎక్కడికి వెళ్లినా ఒకటే ఉత్సాహం కనిపిస్తోందని సంతోషం వ్యక్తం చేశారు. మదన్ రెడ్డి విజయం ఖాయమైపోయిందని జోష్యం చెప్పారు. ఎన్నికలు వస్తే చాలా పార్టీలు రంగంలోకి వస్తాయని, మన దేశంలో రావాల్సినంత పరిణితి రాలేదన్నారు. ఎన్నికల్లో గెలవాల్సింది పార్టీలు కాదని, ప్రజలు గెలవాలని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఎవరు గెలిస్తే మేలు జరుగుతుందో ఆలోచించుకోవాలని ప్రజలకు సూచించారు.
సభకు వచ్చిన ప్రజలంతా ఊర్లకు వెళ్లి దీనిపై చర్చించాలని విజ్ఞప్తి చేశారు. టీఆర్‌ఎస్ హయాంలో ప్రవేశపెట్టినన్ని సంక్షేమ, అభివృద్ధి పథకాలు కాంగ్రెస్, టీడీపీ హయాంలో ఎప్పుడైనా ప్రవేశపెట్టారా అని ప్రశ్నించారు. ఏ పథకం అమలు చేసినా సంతృప్తిగా ఉండాలన్నారు. అందుకే రూ.200 పింఛన్‌ను రూ. 1000కి పెంచామన్నారు. 4లక్షల బీడీ కార్మికులకు, ఒంటరి మహిళలకు పింఛన్లు ఇస్తున్నామని తెలిపారు. మళ్లీ టీఆర్‌ఎస్ అధికారంలోకి రాగానే పింఛన్‌ను రూ. 2016 చేస్తామన్నారు. తనను విమర్శించే చంద్రబాబు, మోదీ ఇవన్నీ అమలు చేస్తున్నారా అని, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇన్ని పథకాలు అమలు చేస్తున్నారా అని ప్రశ్నించారు. తెలంగాణలో ఎవరైనా ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment