సాక్షి, జహీరాబాద్ : తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని, సంక్షేమ కార్యక్రమాలతో ప్రతిపక్షాల్లో పుట్టగతులుండవనే భయం ఏర్పడిందని తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అన్నారు. బుధవారం జహీరాబాద్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగించారు. టీపీసీసీ ప్రెసిడెంట్ ఒక దద్దమ్మ అంటూ విమర్శించారు. బాధ్యతతోనే తాను విమర్శిస్తున్నట్లు తెలిపారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం రాకముందు కాగితాలమీద ప్రాజెక్టులు రూపొందించారని పేర్కొన్నారు. తెలంగాణలో ఉన్న నీటిని వాడుకోవాలన్న ప్రయత్నం జరగలేదన్నారు. తాము జల నిపుణులతో పూర్తి స్థాయి పథకాలు రూపొందించామని తెలిపారు.
నీళ్ల మీద చర్చ జరగకుండానే అసెంబ్లీ నుంచి ప్రతిపక్షాలు పారిపోయాయని, ఉద్యమం జరుగుతుంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు మంత్రి పదవుల్లో హాయిగా సేద తీరారని మండిపడ్డారు. ఉద్యమం జరుగుతున్న సమయంలో 400 మందిని పిట్టల్ని కాల్చినట్లు కాల్చి పొట్టన పెట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షాల హెలిప్యాడ్ల వద్ద ఉన్న జనాలు వారి సభలో లేరని ఎద్దేవా చేశారు. రిజర్వేషన్ల విషయం ఇతర పథకాల గురించి ఎన్ని సార్లు కేంద్రానికి చెప్పినా పట్టించుకోలేదన్నారు. 19 రాష్ట్రాల్లో 1000 రూపాయల పింఛన్ ఇస్తున్నారా అని ప్రశ్నించారు. నరేంద్ర మోదీకి అది కనపడటం లేదా?.. కంటి వెలుగులో మోదీ పరీక్షలు చేసుకోవాలంటూ ఎద్దేవా చేశారు.
అన్ని పార్టీల చరిత్ర మీకు తెలుసు : కేసీఆర్
నారాయణఖేడ్ : ఓటర్లు కన్ఫూజన్‌లో లేరని, క్లారిటీతో ఉన్నారని, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీల చరిత్ర వారికి తెలుసునని తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఓటర్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. బుధవారం నారాయణఖేడ్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగించారు. నారాయణఖేడ్‌లో టీఆర్‌ఎస్ గెలిచిన తర్వాత మంచి అభివృద్ధి జరిగిందన్నారు. ఎవరి ప్రభుత్వంలో కరెంట్ సమస్యలు లేవో ప్రజలు ఆలోచన చేయాలని, లేకపోతే చీకట్లో ఉండిపోతామని హెచ్చరించారు. నేడు 24 గంటల కరెంటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా లేదన్నారు. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు హైదరాబాద్ తానే కట్టానంటాడు.. మరి అప్పట్లో విద్యుత్ నిరంతరం ఎందుకివ్వలేదని ప్రశ్నించారు. కబ్జాలు, గూండాయిజం తమ హయాంలో లేవని స్పష్టం చేశారు. పరిణితి గల ప్రజాస్వామ్య ఎన్నికల్లో అంతిమంగా ప్రజలే గెలవాలని కోరారు.
మా బాసులు ఢిల్లీలో లేరు : కేసీఆర్
అంధోల్ : తెలంగాణ ప్రజలే తమకు బాసులని, తమ బాసులు ఢిల్లీలో లేరని తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారు. బుధవారం అంధోల్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగించారు. పనులు చేసేవాళ్లకే ఓటెయ్యాలని విజ్ఞప్తి చేశారు. అవినీతిని అరికట్టి.. పెంచిన సంపదను ప్రజలకు పంచిపెడుతున్నామని తెలిపారు. నాణ్యమైన విద్య అందే ఏర్పాట్లు చేశామన్నారు. అంధోల్‌లో లక్ష ఎకరాలకు నీరందిస్తామని చెప్పారు. సంపదను పెంచుకుంటున్న తెలంగాణ మీద అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. అంధోల్ టీఆర్‌ఎస్ అభ్యర్థి క్రాంతి కిరణ్ లక్ష మెజార్టీతో గెలవటం ఖాయమని.. లక్ష ఓట్ల మెజార్టీ భారం కూడా భుజాలపై పడుతుందన్నారు. క్రాంతి అన్నింటికి సిద్దంగా ఉండాలని సూచించారు. తొలిసారి ఈ గడ్డ బిడ్డ ఎమ్మెల్యే అవుతున్నాడని అన్నారు .
Comments
Please login to add a commentAdd a comment