సాక్షి, మెదక్: ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పోటాపోటీగా ప్రచారం చేస్తూ ఎవరికివారు పైచేయి సాధించేందుకు కృషి చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వైఫల్యాలే తమను గట్టెక్కిస్తాయని నమ్మకంతో ఉంది.
టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులు మాత్రం సీఎం కేసీఆర్ అమలుచేసిన సంక్షేమ పథకాలు తమకు విజయాన్ని కట్టబెడతాయని ధీమాగా ఉన్నారు. ప్రతీ నియోజకవర్గంలో ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు దాదాపుగా 60వేల పైచిలుకు ఉన్నట్లు అంచనా. ఎమ్మెల్యే అభ్యర్థులతో టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఇటీవల సమావేశమయ్యారు.
ఈ సమావేశంలో లబ్ధిదారులను ఎమ్మెల్యే అభ్యర్థులు ప్రత్యేకంగా కలవాలని సూచించారు. టీఆర్‌ఎస్ అమలు చేసిన ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో లబ్ధిపొందిన వారు మద్దతు పలికితే టీఆర్‌ఎస్ విజయం సునాయాసం అవుతుందని తెలిపారు. అలాగే ప్రతీ నియోజకవర్గంలో సంక్షేమ పథకాల ద్వారా లబ్ధిపొందిన వారి జాబితాను ఎమ్మెల్యే అభ్యర్థులకు అందజేశారు.
మెదక్ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పద్మాదేవేందర్‌రెడ్డి ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. మెదక్‌లో రైతుబంధు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ఆసరా పింఛన్లు, ఆరోగ్యశ్రీ,, కేసీఆర్ కిట్లు ఇలా సంక్షేమ పథకాల ద్వారా లబ్ధిపొందిన లబ్ధిదారుల సంఖ్య 58,960 మంది ఉన్నారు.
గ్రామాల వారీగా ప్రత్యేకంగా లబ్ధిదారుల జాబితాను రూపొందించారు. ఈ జాబితా ఆధారంగా ప్రచార సమయంలో ప్రభుత్వ పథకాల లబ్ధిదారులను ప్రత్యేకంగా కలుస్తున్నారు. టీఆర్‌ఎస్ అమలు చేసిన సంక్షేమ పథకాల వల్ల మీరు లబ్ధి పొందారని, ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇస్తే మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తామని, ఆసరా పింఛన్లు పెంచుతామని టీఆర్‌ఎస్ మేనిఫెస్టోలోని అంశాలను వివరిస్తున్నారు.
ప్రత్యేక ప్రణాళికలు..
ముఖ్యంగా రైతులను ఆకట్టుకునేందుకు ఎక్కువగా ప్రయత్నిస్తున్నారు. రైతుబంధు, రైతుబీమా పథకాల ద్వారా లబ్ధిపొందిన రైతులను కలిసి టీఆర్‌ఎస్‌కు అండగా నిలవాలని కోరుతున్నారు. యువత ఉపాధి కల్పన, నిరుద్యోగ భృతి అంశాల గురించి వివరించి వారి మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు.
టీఆర్‌ఎస్ బూత్ కమిటీలకు లబ్ధిదారుల జాబితాను అందజేసి వారితో ఓట్లు వేయించే బాధ్యతను అప్పగించారు. నియోజకవర్గంలోని ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఓట్లు వేస్తే గెలుపు ఖాయమని టీఆర్‌ఎస్ నాయకులు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. నర్సాపూర్ నియోజకవర్గంలో లబ్ధిదారుల సంఖ్య దాదాపుగా 60వేల వరకు ఉన్నట్లు అంచనా.
టీఆర్‌ఎస్ అధిష్టానం నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి వివరాలతోపాటు సంక్షేమ పథకాల లబ్ధిదారుల జాబితాను ఎమ్మెల్యే అభ్యర్థి మదన్‌రెడ్డికి అందజేసింది. ఈ జాబితా ఆధారంగా మదన్‌రెడ్డి ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఓట్లు టీఆర్‌ఎస్‌కు దక్కేలా పావులు కదుపుతున్నారు.
సీఎం సహాయ నిధి నుంచి ఎమ్మెలే అభ్యర్థి మదన్‌రెడ్డి సుమారు నియోజకవర్గంలోని 3వేల మందికిపైగా రోగులకు రూ.7.88 కోట్ల ఆస్పత్రి బిల్లులు ఇప్పించారు. సీఎంఆర్‌ఎఫ్ లబ్ధిదారులు టీఆర్‌ఎస్‌కు ఓటు వేసేలా మదన్‌రెడ్డి చర్యలు తీసుకుంటున్నారు. అలాగే నియోజకవర్గంలోని రైతులు, ముస్లిం మైనార్టీలు, గిరిజన లబ్ధిదారుల మద్దతు కూడగట్టే ప్రయత్నంలో నిమగ్నమయ్యారు
Comments
Please login to add a commentAdd a comment