ఆశీర్వదించండి.. అభివృద్ధి చేస్తాం.. | KCR Fires On Congress In Husnabad Praja Ashirvada Sabha | Sakshi
Sakshi News home page

ఆశీర్వదించండి.. అభివృద్ధి చేస్తాం..

Published Sat, Sep 8 2018 11:07 AM | Last Updated on Sat, Sep 8 2018 11:07 AM

KCR Fires On Congress In Husnabad Praja Ashirvada Sabha - Sakshi

‘జీవన విధ్వంసం జరిగిన ప్రాంతాన్ని బాగు చేయడానికి నోరు కట్టుకుని, కడుపు కట్టుకొని పని చేసినం. శాశ్వత ప్రయోజనాలు చేకూరేలా సంక్షేమ పథకాలను రూపకల్పన చేసినం. ముదనష్టపు, దరిద్రపుగొట్టు కాంగ్రెస్‌ పాలనలో 50 ఏండ్ల తెలంగాణ రాష్ట్రం ఎంతగా చితికి పోయిందో హుస్నాబాదే నిదర్శనం. ఇలా తెలంగాణ అంతట కరువే. కరువుకు మూల కారణమే కాంగ్రెస్‌ పార్టీ. మీ దీవెనలు, ఆశీర్వాదంతో అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో 40 ఏళ్లలో జరగని అభివృద్ధి చేసి చూపించినం. ఇప్పుడు ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నం. మళ్లీ ఆశీర్వదిస్తే కనీవినీ ఎరగని రీతిలో అభివృద్ధి చేస్తాం’ అంటూ గుళాబీ దళపతి, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు.

సాక్షిప్రతినిధి, కరీంనగర్‌ : కోటి ఎకరాల మాగాణి, ఆకుపచ్చ తెలంగాణ తన స్వప్నమని, అందుకోసమే అధికారంలో ఇంకా కొనసాగే అవకాశం ఉన్నా అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నామని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. శుక్రవారం ఉమ్మడి కరీంనగర్‌ హుస్నాబాద్‌ నియోజకవర్గం వేదికగా సీఎం కేసీఆర్‌ ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్‌ పాల్గొని ప్రసంగించారు. ‘ఎలక్షన్‌ ఎందుకు వచ్చిందో నిన్ననే నేను చెప్పాను. హుస్నాబాద్‌తో నాకు చాలా అనుబంధం ఉంది. కొత్తకొండ వీరన్న కొలువుదీరిన నేల హుస్నాబాద్‌. అభివృద్ధి కార్యక్రమాలన్నీ మీ ముందే ఉన్నాయి. తెలంగాణ అభివృద్ధి, సంక్షేమ పథకాలను మీరందరూ చూస్తున్నారు. చైతన్యవంతమైన హుస్నాబాద్‌ ప్రజలు ఆలోచించాలి’ అని కోరారు.

ముందస్తు ఎన్నికలు రావడానికి ప్రధాన కారణం కాంగ్రెస్‌ పార్టేనని, ప్రభుత్వం, అధికారుల మనోస్థెర్యాన్ని దెబ్బతీసేలా కాంగ్రెస్‌ ఆరోపణలు చేసిందని, ప్రభుత్వం మీద కాంగ్రెస్‌ పార్టీ చేసిన ఆరోపణలు రుజువు కాలేదని, అయినప్పటికీ మళ్లీ ప్రజాక్షేత్రంలో తేల్చుకోవాలనుకున్నామని కేసీఆర్‌ అన్నారు. సమైక్య పాలనలో శిథిలమైన తెలంగాణను తీర్చిదిద్దుతున్నామమని, నాలుగేళ్లలో 17.17 నుంచి 29.17 వరకు ఆర్థిక వృద్ధి సాధించామని, ఇది తాను చెప్పడం కాదని.. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక శాఖ ప్రకటించిందన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చిన సమయంలో కరెంట్‌ సమస్య ఉండేదని.. కరెంట్‌ విషయంలో భయంకరమైన పరిస్థితులు ఉండేవని..

కరెంట్‌ 24 గంటలు ఇస్తే.. తానే గులాబీ కండువా కప్పుకుంటానని జానారెడ్డి శాసనసభలో అన్నారని, ఇప్పుడు 24 గంటల నాణ్యమైన విద్యుత్‌ ఇస్తున్నామని, జానారెడ్డికి నిజాయితీ ఉంటే ఆ పని చేసి చూపించాలని సవాల్‌ విసిరారు. కాంగ్రెస్‌ నేతలు కంటి వెలుగులో పరీక్షలు చేయించుకొని రాష్ట్రాభివృద్ధిని చూడాలని.. కాంగ్రెస్‌ దరిద్రపు పాలన వల్లే ఒక్క హుస్నాబాద్, తెలంగాణ కాదు.. యావత్‌ భారత్‌ మోసపోయిందని, అవినీతి రహితంగా పాలన చేస్తేనే రాష్ట్రం బాగుపడుతుంది అని కేసీఆర్‌ పేర్కొన్నారు.

కాంగ్రెస్‌ పార్టీపై నిప్పుల చెరిగిన కేసీఆర్‌..
‘కాంగ్రెస్‌ నేతల బతుకు ఢిల్లీలో డిసైడైతది. తెలంగాణ కోసం కాంగ్రెస్‌ నేతలు ఎవ్వరూ పనిచేయలేదు. నేను తెలంగాణ కోసం నిరాహార దీక్ష చేసి చావు అంచుల దాకా వెళ్లా. రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణ ప్రజలు దీవించి అధికారం ఇచ్చారు. టీఆర్‌ఎస్‌ పాలనలో ప్రజలకు భరోసా వచ్చింది. కొత్త మండలాలు, రెవెన్యూ డివిజన్లు 31 జిల్లాల ఏర్పాటు అన్నది సాహసోపేత నిర్ణయం. కనీవిని ఎరగని అభివృద్ధి చేస్తే కాంగ్రెసోళ్లు అవాకులు చవాకులు పేలుతున్నారు.  ప్రాజెక్టుల రీడిజైనింగ్‌ తప్పట. నోటికి హద్దు పద్దూ లేకుండా మాట్లాడే వారికి సిగ్గుండాలి. అధికారం ఢిల్లీ పెద్దల చేతుల్లో కాదు. మన చేతుల్లో ఉండాలి. మళ్లీ టీఆర్‌ఎస్‌కు అధికారం అప్పగిస్తే ఐదేళ్లు బ్రహ్మాండంగా పాలిస్తాం’ అని కేసీఆర్‌ స్పష్టం చేశారు.

కాంగ్రెసోళ్లు అధికారం కోసం ఆవురావురు అంటున్నారని, వారికి అధికారం ఇస్తే పంటికి తగలకుండా మింగేస్తారని అన్నారు. ఢిల్లీ గులాములైన కాంగ్రెస్‌ పార్టీ నేతలు తమను కూడా అక్కడ తాకట్టు పెడతారని, వచ్చే ఎన్నికల్లో జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. 2014కు ముందు కాంగ్రెస్‌ హయాంలో తెలంగాణ ఎంత నాశనమైందో అందరికీ తెలుసని, కాంగ్రెస్‌ హయాంలో అభివృద్ధి జరిగి ఉంటే తెలంగాణ ఉద్యమం ఎందుకు వచ్చేదని ప్రశ్నించారు. తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులు ఏనాడూ క్రియాశీలకంగా పనిచేయలేదని, కిరణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణకు ఒక్క పైసా ఇవ్వనంటే తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులు కనీసం నోరు మెదపలేదని గుర్తు చేశారు.

కాంగ్రెస్‌ పాలనలో పైసలు తినడానికి, పైరవీలు చేయడానికి వారికి సమయం సరిపోలేదని, పెన్షన్‌ రూ.2 వేలు ఇస్తామని హర్రాజ్‌ పాట పాడినట్లు పాడుతున్న కాంగ్రెస్‌ పార్టీ సిగ్గుపడాలని, ఏనాడైనా పెన్షన్‌ రూ.వెయ్యి రూపాయలు ఇవ్వాలని మీ బుర్రలకు తట్టిందా? అని కేసీఆర్‌ ప్రశ్నించారు. గౌరవెల్లి ప్రాజెక్టుపై మెదడు కరిగించి ఒక టీఎంసీ నుంచి ఎనిమిది టీఎంసీలకు తీసుకొచ్చినామని, గౌరవెల్లి ప్రాజెక్టు కింద ప్రజల పొలాలు పారుతాయా..? కేసీఆర్‌ పొలాలు పారుతాయా? దీన్ని కూడా రాజకీయం చేస్తున్నారని అన్నారు.

ఎన్‌కౌంటర్లు లేవు..మట్క లేదు, గుట్క లేదు..
‘తెలంగాణ రాష్ట్ర సమితి పాలనలో ఎన్‌కౌంటర్లు లేవు. ఎరువుల కొరత లేదు. పేకాట క్లబ్బులు లేవు. గుట్కా లేదు, మట్కా లేదు. కాంగ్రెస్‌ పార్టీ ఖర్మకాలి అధికారంలోకి వస్తే మళ్లీ కరెంటు ఎటమటం అవుతుంది’ అంటూ కేసీఆర్‌ ప్రజలను అప్రమత్తం చేశారు. ఇప్పుడు కరెంటు బాధలు పోయినయని, మత కల్లోలాలు లేవని, అన్ని వర్గాల ప్రజలు ఆత్మగౌరవంతో బతకాలని అన్నారు. రైతు బంధు పథకం ద్వారా ఎకరాకు రూ.8 వేల పెట్టుబడి సహాయం అందిస్తున్నామని, రైతు బీమా ద్వారా చనిపోయిన రైతు కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక వెసులుబాట కల్పిస్తున్నామన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్ధమన్న ప్రతిపక్షాలు ఇప్పుడు ఎందుకు భయపడుతున్నాయని ప్రశ్నించారు.

సతీష్‌ నా తమ్ముడు, మా కెప్టెన్‌ సాబ్‌ కొడుకు.. గెలిపించండి..
హుస్నాబాద్‌ నుంచి ఒడితెల సతీష్‌కుమార్‌ను మళ్లీ ఆశీర్వదించాలని కేసీఆర్‌ కోరారు. ‘సతీష్‌ నా తమ్ముడు. మా కెప్టెన్‌ సాబ్‌ కొడుకు. కెప్టెన్‌ సాబ్‌ నేను పద్దెనిమిదేళ్లుగా ఉద్యమంలో, పార్టీలో కలిసి పని చేస్తున్నం. హుస్నాబాద్‌ రెవెన్యూ డివిజన్‌ ఇవ్వకపోతే నా దగ్గరికి వచ్చి కన్నీరు పెట్టుకుని మరి సాధించుకున్నడు. ఆయనను మరోసారి గెలిపించండి’ అని కోరారు. కారు గుర్తుకు ఓటు వేసి టీఆర్‌ఎస్‌ పార్టీని మళ్లీ అధికారంలోని తీసుకురావాలని అన్నారు.

సమావేశంలో ఆపద్ధర్మ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, ఆపద్ధర్మ మంత్రులు ఈటల రాజేందర్, టి.హరీష్‌రావు, జెడ్పీ చైర్‌పర్సన్‌ తుల ఉమ, ఎంపీలు వినోద్‌కుమార్, కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతారావు, ఎమ్మెల్సీలు నారదాసు లక్ష్మణ్‌రావు, పాతూరి సుధాకర్‌రెడ్డి, భానుప్రసాద్, తాజా మాజీ ఎమ్మెల్యేలు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, రసమయి బాలకిషన్, దాసరి మనోహర్‌రెడ్డి, వి.సతీష్‌కుమార్, కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, చెన్నమనేని రమేష్‌బాబు, పుట్ట మధు, బొడిగె శోభ తదితరులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement