
మెదక్‌లో తగ్గిన పోలింగ్
ఉప ఎన్నిక ప్రశాంతం... 65.74 శాతం పోలింగ్ నమోదు
సాధారణ ఎన్నికల్లో పోలైన 77.35 శాతం కంటే 11.4 శాతం తక్కువ
అత్యధికంగా నర్సాపూర్‌లో 77%.. తక్కువగా పటాన్‌చెరులో 52 శాతం
ఆంధ్రప్రదేశ్‌లోని నందిగామ అసెంబ్లీ ఉప ఎన్నికలో 67.5% పోలింగ్
సాక్షి, హైదరాబాద్, సంగారెడ్డి: మెదక్ లోక్‌సభ స్థానం ఉప ఎన్నికలో పోలింగ్ శాతం భారీగా తగ్గింది. సాధారణ ఎన్నికల్లో ఇక్కడ 77.35 శాతం పోలింగ్ నమోదుకాగా... శనివారం జరిగిన ఉప ఎన్నికలో 11.4% తగ్గిపోయి 65.74 శాతమే నమోదైంది. మొత్తంగా మెదక్ లోక్‌సభ స్థానంతో పాటు ఏపీలోని నందిగామ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాం తంగా ముగిసింది. రైతులు, మహిళలు, వలస జీవులు దూరంగా ఉండటం వల్లే మెదక్ లోక్‌సభ స్థానంలో పోలింగ్ పడిపోయినట్లు అధికారుల అంచనా. అత్యధికంగా నర్సాపూర్ నియోజకవర్గంలో 77%, అత్యల్పంగా పటాన్‌చెరు నియోజకవర్గంలో 52% పోలింగ్ నమోదైంది. టీఆర్‌ఎస్ ప్రభావం ఎక్కువగా ఉన్న సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్ నియోజకవర్గాల్లో పోలింగ్ శాతం భారీగా తగ్గటం టీఆర్‌ఎస్ శ్రేణులను కొంత ఆందోళనకు గురి చేస్తోంది.
ఓటర్లు ఆసక్తి చూపలేదు: భన్వర్‌లాల్
నందిగామ అసెంబ్లీ, మెదక్ ఎంపీ స్థానాలకు నిర్వహించిన ఉప ఎన్నికలు ప్రశాంతంగా ముగి శాయని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ వెల్లడించారు. ఆయన శనివారం రాత్రి సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ఎక్కడా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదని, రీ పోలింగ్ ప్రస్తావన కూడా లేదన్నారు. ఉప ఎన్నికల్లో పోలింగ్ శాతం ఆశాజనకంగా లేదని, ఇరు ప్రాంతాల్లోని పట్టణ ప్రాంత ఓటర్లు పెద్దగా ఆసక్తి చూపలేదని పేర్కొన్నారు. మెదక్ లోక్‌సభ స్థానం పరిధిలో అక్రమంగా తరలిస్తున్న రూ. కోటి, నందిగామలో రూ. 60 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ఈ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు 16న ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుందన్నారు. మెదక్ స్థానానికి హైదరాబాద్‌లోని గీతం వర్సిటీలో, నందిగామకు అదే ప్రాంతంలోని కేవీఆర్ కళాశాలలో ఓట్ల లెక్కింపు జరుగుతుందన్నారు.
ఓటు వేసిన కేసీఆర్ దంపతులు
ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు తన స్వగ్రామం సిద్దిపేట మండలం చింతమడకలో తన సతీమణి శోభతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భారీ సంఖ్యలో అక్కడికి తరలివచ్చి కేసీఆర్‌కు ఘనస్వాగతం పలికారు.
టీఆర్‌ఎస్ అధికార దుర్వినియోగం: బీజేపీ
మెదక్ పార్లమెంటు ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని బీజేపీ ఆరోపించింది. అసెంబ్లీ నియోజకవర్గానికో మంత్రి, గ్రామానికో ఎమ్మెల్యే చొప్పున ఉండి ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.ఆచారి ఓ ప్రకటనలో పేర్కొన్నారు.