సాక్షి, మహబూబ్‌నగర్: మెదక్ పార్లమెంట్ ఉపఎన్నిక సెగ పాలమూరును తాకింది. ఆయా రాజకీయ పార్టీలకు చెందిన ముఖ్య నేతలంతా ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. అన్నిపక్షాలు కూడా ఈ ఎన్నికను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో నాయకులంతా అటువైపే క్యూ కట్టారు. ఇప్పటికే జిల్లాకు చెందిన పలువురు ముఖ్యనేతలు మెదక్‌లో మకాం వేసి ప్రచారపర్వంలో మునిగిపోయారు. ముఖ్యంగా అధికారపార్టీ టీఆర్‌ఎస్‌కు చెందిన ఎంపీ ఏపీ జితేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు జూపల్లి కృష్ణారావు, డాక్టర్ సి.లక్ష్మారెడ్డి, వి.శ్రీనివాస్‌గౌడ్, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, మర్రి జనార్దన్‌రెడ్డి, గువ్వల బాల్‌రాజ్, అంజయ్య యాదవ్‌లకు మెదక్‌లోని ఆయా నియోజకవర్గాల ఎన్నికల ప్రచార బాధ్యతలు అప్పగించారు. లకా్ష్మరెడ్డికి మెదక్ నియోజకవర్గం, జూపల్లి కృష్ణారావు, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, అంజయ్య యాదవ్‌లకు దుబ్బాక నియోజకవర్గం, వి.శ్రీనివాస్‌గౌడ్‌కు పటాన్‌చెరు నియోజకవర్గం, మర్రి జనార్దన్‌రెడ్డికి నర్సాపూర్ నియోజకవర్గం, గువ్వల బాల్‌రాజ్ సంగారెడ్డి నియోజకవర్గ ప్రచార బాధ్యతలు చూస్తున్నారు. కాంగ్రెస్ నుంచి ఎంపీ నంది ఎల్లయ్య, ఎమ్మెల్యేలు డీకే అరుణ, జి.చిన్నారెడ్డి, వంశీచందర్‌రెడ్డి, మల్లు రవి తదితరులు కూడా మెదక్‌కు పయనమయ్యారు. అరుణకు మెదక్ అసెంబ్లీ సెగ్మెంట్ ప్రచార బాధ్యతలు అప్పగించింది. ఈ నేపథ్యంలో ఆమె ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని దూసుకెళ్తున్నారు.
టీడీపీ, బీజేపీ నేతలు కూడా..
మెదక్ బరిలో ఎన్‌డీ ఏ కూటమి నుంచి బీజేపీ అభ్యర్థికి మద్దతుగా టీడీపీ, బీజేపీ నేతలు పయనమయ్యారు. టీడీపీ నుంచి మంచి వాగ్దాటి కలిగిన కొడంగల్ ఎమ్మెల్యే ఎ.రేవంత్‌రెడ్డి ఎన్నికల ప్రచారంలో ముందునుండి స్టార్ క్యాంపెనర్‌గా కొనసాగుతున్నారు. అలాగే జిల్లాలో సీనియర్ నేత రావుల చంద్రశేఖర్‌రెడ్డి కూడా మెదక్‌లో మకాం వేసి వ్యూహరచన చేస్తున్నారు. బీజేపీ ముఖ్యనేత నాగం జనార్దన్‌రెడ్డి తమ పార్టీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేసేందుకు మెదక్ పయనమయ్యారు. నాగంకు మెదక్ పార్లమెంట్ ప్రచారం నిర్వహించాల్సిందిగా పార్టీ దిశానిర్దేశం చేసింది.
స్థానం సుస్థిరం కోసమే...!
అన్ని పార్టీల ముఖ్యనేతలు కూడా వారివారి స్థానాలను సుస్థిరం చేసుకోవడానికి పడరాని పాట్లు పడుతున్నారు. ముఖ్యంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు మంత్రివర్గ విస్తరణలో స్థానం పదిలం చేసుకునేందుకు శతవిధాల యత్నిస్తున్నారు. మంత్రివర్గంలో స్థానంకోసం పోటీపడుతున్న జూపల్లి కృష్ణారావు, సి.లకా్ష్మరెడ్డి, వి.శ్రీనివాస్‌గౌడ్ తమదైన శైలిలో ప్రచారం నిర్వహిస్తున్నారు. అలాగే కాంగ్రెస్ ముఖ్యనేత డీకే అరుణ పార్టీలో కీలకస్థానం కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఇటీవల ఆమె ఢిల్లీ వెళ్లి మంత్రాంగం నడిపించారు.
ఈ నేపథ్యంలో మెదక్ ఉప ఎన్నికలను ఆమె ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అలాగే కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నందున ముఖ్య పదవి కోసం నాగం జనార్దన్‌రెడ్డి తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఏదైనా రాష్ట్రం కోటాలో రాజ్యసభ సీటు దక్కించుకునేందుకు కష్టపడుతున్నారు. ఇలా జిల్లా నేతలకు కూడా మెదక్ ఉప ఎన్నికల ప్రతిష్టాత్మకంగా మారింది.
మెదక్ బాటలో..
Published Tue, Sep 2 2014 2:50 AM | Last Updated on Tue, Oct 9 2018 5:54 PM
Advertisement
Advertisement