సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : ముందస్తు ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాజకీయ పార్టీ లు... ప్రచారాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. ఓటర్లను కలుసుకోవడం కోసం నియోజకవర్గంలో విస్తృతంగా కలియ తిరుగుతూనే... రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌తో పాటు రాష్ట్రాన్ని దాటి మరీ వెళ్లి ప్రత్యేక సమావేశాలు ఏర్పా టు చేస్తున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రజలు అత్యధిక మంది ఉపాధి అవకాశాల కోసం భారీగా హైదరాబాద్, ముంబై తదితర ప్రాంతాల్లో నివసిస్తున్నారు. ప్రతీ గ్రామం నుంచి ప్రతీ ఇంటికి సంబంధించిన వారు ఎవరో ఒక్కరు ఆయా ప్రాంతాల్లో జీవనం సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల సందర్భంగా అక్కడ స్థిరపడిన వారిని కలుసుకోవడం కోసం పార్టీల అభ్యర్థులు ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఆదివారం వచ్చిందంటే చాలు... అభ్యర్థులు ఆయా ప్రాంతాల్లో సమావేశాల ఏర్పాటుకు ప్రాధానం ఇస్తున్నారు. ఇక అభ్యర్థులే తమ వద్దకు రావడంతో ఓటర్లు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ప్రతీ ఓటు కీలకమే..
ఈసారి అసెంబ్లీ ఎన్నికలను అన్ని రాజకీయ పార్టీలు ఛాలెంజింగ్‌గా తీసుకున్నాయి. ప్రధాన పార్టీలైన టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ ఎన్నికల్లో గెలుపు కోసం వేస్తున్న ఎత్తులు, వ్యూహాలు రసవత్తరంగా మారాయి. రాష్ట్రంలోనే ఉమ్మడి పాలమూరు జిల్లాలో అత్యధిక అసెంబ్లీ స్థానాలు ఉండడంతో అన్ని పార్టీలు కూడా జిల్లాపై దృష్టి సారించాయి. అయితే పాలమూరుకు చెందిన ప్రజలు చాలా వరకు ఉపాధి అవకాశాల కోసం ముంబై, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో భారీగా స్థిరపడ్డారు. ఇందులో కొందరు అక్కడ తాత్కాలిక నివాసం ఏర్పాటుచేసుకోగా.. మరికొందరు స్థిరపడ్డారు కూడా! కానీ చాలామంది ఓటు హక్కు మాత్రం సొంత గ్రామాల్లో పదిలంగా ఉంది. ఇలా ప్రతీ నియోజకవర్గం నుంచి దాదాపు 10వేల ఓట్ల వరకు హైదరాబాద్‌లో స్థిరపడిన వారివే ఉన్నాయి.
ఇక ముంబైలోనూ పెద్దసంఖ్యలో ఇక్కడి ప్రజలు వివిధ వృత్తుల్లో కొనసాగుతున్నారు. కాగా, వీరందరూ కూడా ఎన్నికల వేళ తమ తమ స్వంత గ్రామాలకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటారు. దీన్ని దృష్టిలో పెట్టుకున్న ఆయా పార్టీల అభ్యర్థులు ఓటర్లను మచ్చిక చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా ఆయా నియోజకవర్గంలోని ప్ర జలు అత్యధికంగా నివసించే ప్రాంతాల ఫంక్షన్ హాళ్లలో ‘ఆత్మీయ సమ్మేళనాలు’ ఏర్పాటు చేస్తున్నారు. తద్వారా వారిని నేరుగా కలుసుకుని నియోజకవర్గానికి సంబంధించి తమ ఆలోచనలను వారి తో పంచుకుంటున్నారు. అంతేకాదు ఆయా గ్రా మాలకు సంబంధించి ఇంకా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనే విషయాలను కూడా ఆరా తీస్తున్నారు. మొత్తం మీద నియోజకవర్గానికి చెందిన ఓటర్లను నేరుగా కలిసి... రానున్న ఎన్ని కల్లో తమకు అండగా ఉండాలని కోరుతున్నారు.
ప్రత్యేక ప్రణాళిక
నియోజకవర్గ ఓటర్లను హైదరాబాద్‌లో కలుసుకోవడానికి అభ్యర్థులందరూ ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకుంటున్నారు. నగరంలో నియోజకవర్గానికి చెందిన వారు ఎక్కడెక్కడ అధికంగా నివసిస్తున్నారనే విషయాలను ఆరా తీస్తున్నారు. అందుకోసం ప్రతీ గ్రామం నుంచి పార్టీ కార్యకర్తల ద్వారా ఆరా తీసి, మండల కమిటీ అక్కడి నుంచి నియోజకవర్గ స్థాయి కమిటీకి చేరవేస్తున్నారు. ఇలా మొత్తం మీద నియోజకవర్గానికి చెందిన వారు ఎక్కడెక్కడ ఉన్నారనే విషయాలను పరిగణనలోకి తీసుకొని అక్కడిక్కడే సమావేశాలకు ప్రణాళిక రూపొందిస్తున్నారు. అంతేకాదు ఒక వాట్సప్ గ్రూపు రూపొందించి కొందరు కీలకమైన వ్యక్తులకు నేరుగా ఫోన్లు చేసి సమావేశాలకు రావాల్సిందిగా కోరుతున్నారు. అందుకోసం స్థానికంగా ఒక ఫంక్షన్ హాల్‌ను వేదికగా ఏర్పాటుచేసి భోజన సదుపాయాలు కూడా కల్పిస్తున్నారు. తద్వారా ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు అభ్యర్థులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
స్థానిక పోరు మాదిరిగానే..
ఈసారి అసెంబ్లీ ఎన్నికలను స్థానిక పోరును తలపిస్తున్నాయి. ముఖ్యంగా సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ వంటి ఎన్నికలను ఆయా అభ్యర్థులు అత్యంత ప్రతిష్టాత్మంగా తీసుకుంటారు. అంతేకాదు ప్రతీ ఓటు అత్యంత కీలకం కావడంతో ఏ ఒక్కరినీ వదిలేవారు కాదు. తమకు పరిచయం ఉన్న వారందరితో సంప్రదింపులు చేయడం, వారిని ఓట్ల కోసం అభ్యర్థించే వారు. స్థానిక ఎన్నికల సందర్భంగా ఆయా అభ్యర్థులు హైదరాబాద్‌లో సమావేశాలు ఏర్పాటు చేసి తమ గ్రామాలకు చెందిన వారితో చర్చలు జరిపేవారు. అంతేకాదు పోలింగ్ సందర్భంగా వారు సొంత ప్రాంతానికి వచ్చేలా వాహన సదుపాయాలతో పాటు ఇతరత్రా వ్యవహారాలన్నీ కల్పించేవారు. అలాగే ఈసారి అసెంబ్లీ ఎన్నికలకు కూడా అభ్యర్థులు అలాంటి వ్యూహాలనే అమలు చేస్తున్నారు. ఇలా అసెంబ్లీ ఎన్నికలకు ముంబై, హైదరాబాద్‌లో సమావేశాలు ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారి అంటూ రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment