
మటన్ కీమా.. ఓటు మామా !
మహబూబ్‌నగర్ మహాకూటమి అభ్యర్థి ఎర్ర శేఖర్ ప్రచారాన్ని విస్తృతం చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన జిల్లా కేంద్రంలోని రైతుబజార్, కొత్తగంజ్, కోయనగర్‌ల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. బజార్‌లో మటన్ షాపుల వద్ద వెళ్లి వ్యాపారులను కలిసి తనకు ఓటు వేయాలని కోరారు. అక్కడ కొద్దిసేపు మటన్ కొడుతూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.
– మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్
కాదేది ప్రచారానికి అనర్హం
రానున్న ఎన్నికలను పురస్కరించుకుని మహాకూటమి, కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికలో ఆలస్యం జరిగింది. దీంతో వారికి ప్రచారం చేసుకునేందుకు తక్కువ సమయం మిగిలింది. ఈ మేరకు ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదలకుండా ప్రచారానికి వాడుకుంటున్నారు. ఇందులో భాగంగా మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలోని భూత్పూర్ మండలంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల ప్రచారం సందర్భంగా గంగిరెద్దులు కనిపించగా.. దాని కొమ్ములకు కాంగ్రెస్ జెండాలు కట్టి కాసేపు ఆడించారు.
– దేవరకద్ర
అభివృద్ధి మోత మోగిస్తా !
వేదికలపై స్పీచ్ ఇవ్వడంతో పాటు నియోజకవర్గ అభివద్ధికి లక్ష్యాలు ఉన్న తనకు... వాద్యాలకు అనుగుణంగా తాళం కొట్టడడం కూడా నాకు వచ్చు... అంటూ జోగుళాంబ గద్వాల జిల్లా గద్వాల నియోజక వర్గ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బండ్ల కష్ణమోహన్‌రెడ్డి కుర్వ డోలు వాయించే వారిని ఇలా ఉత్సాహ పరిచారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తారాపురం, జోకన్‌గట్టు గ్రామాలకు ఆదివారం వచ్చిన కష్ణమోహన్‌రెడ్డిని కుర్వడోలుతో స్వాగతం పలికారు. ఈ మేరకు ఆయన కార్యకర్త చేతుల నుంచి తాళం తీసుకుని కాసేపు కొడుతూ వారిలో ఉత్సాహ నింపారు.
– గట్టు
సెల్ఫీ ప్లీజ్!
ఎన్నికల ప్రచారం నారాయణపేట నియోజకవర్గంలో ఊపందుకుంది. ఆదివారం జాజాపూర్ గ్రామానికి వెళ్లిన బీజేపీ అభ్యర్థి కొత్తకాపు రతంగపాండురెడ్డి కార్యకర్తలు ఘన స్వాగతం పలికి హారతులు ఇచ్చారు. ఈ సందర్భంగా పలువురు యువకులు, మహిళలు, చిన్నారులు ఆయనతో కలిసి ఫొటోలు, సెల్ఫీలు దిగుతూ సంబరపడ్డారు.
– నారాయణపేట రూరల్