సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రజలను అత్యంత ఆసక్తి, ఉత్కంఠతకు గురి చేస్తోంది. ముందస్తు రూపంలో వచ్చిన శాసనసభ ఎన్నికలను అన్ని రాజకీయ పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో...పోలింగ్ జరిగే వరకు కూడా హోరాహోరీగా ప్రచారం సాగింది.
అంతేకాదు గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి భారీగా పోలింగ్ జరగడం అన్ని రాజకీయ పార్టీల మధ్య ఆసక్తికరమైన చర్చకు దారి తీస్తోంది. జిల్లాలో సరాసరిగా 79.7 శాతం పోలింగ్ నమోదైంది. దీంతో ఎవరికి వారు ఈ భారీ పోలింగ్ తమకే అనుకూలమంటూ పార్టీల నేతలు లెక్కలు వేసుకుంటున్నారు.
అలాగే, పోలింగ్ ముగిసిన వెంటనే జాతీయ ఛానెళ్లు వెలువరించిన ఎగ్జిట్ పోల్ నివేదికలు కూడా చర్చనీయాంశంగా మారాయి. ఇలా మొత్తం మీద తీవ్ర ఉత్కంఠతకు గురిచేస్తున్న పోలింగ్, 11వ తేదీన వెలువడనున్న ఫలితాలపై జోరుగా బెట్టింగ్‌లు మొదలయ్యాయి. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసే పార్టీల మధ్య... ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థుల గెలుపోటముల మీద హోరాహోరీ బెట్టింగ్ కొనసాగుతోంది.
చర్చంతా భారీ పోలింగ్‌పైనే..
పాలమూరు జిల్లాలో గత ఎన్నికల్లో ఎన్నడూ లేని విధంగా ఈ సారి రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది. ఎక్కడా కూడా 70శాతానికి తగ్గకుండా పోలింగ్ జరిగింది. అంతేకాదు ఉమ్మడి జిల్లాలోనే దేవరకద్ర అత్యధికంగా 84.6 శాతం పోలింగ్ నమోదైంది. అతి తక్కువ పోలింగ్ కూడా 73.5 శాతం మహబూబ్‌నగర్ నియోజకవర్గంలో నమోదు కావడం విశేసం.
భారీ పోలింగ్ నేపథ్యంలో రాజకీయ పార్టీల నాయకులు, అభ్యర్థుల నడుమ ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. ప్రభుత్వ వ్యతిరేకత వల్లే ప్రజలు భారీగా తరలి వచ్చి ఓట్లు వేశారని ప్రతిపక్ష పార్టీల నాయకులు చెబుతున్నారు. హామీలు నెరవేర్చని కారణంగా ప్రభుత్వంపై కోపంతో ప్రజలు ఓటుతో సమాధానం చెప్పారని ప్రజాఫ్రంట్, ఇతర పార్టీల నేతలు పేర్కొంటున్నారు.
అయితే అధికార టీఆర్‌ఎస్ నుంచి మాత్రం ఇందుకు భిన్నమైన సమాధానం వస్తోంది. ఓటింగ్ ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో జరగడం.. ప్రజలందరూ టీఆర్‌ఎస్ సంక్షేమ పథకాలపై సంతృప్తిగా ఉండడంతోనే ఇలా జరిగిందని ఉన్నారని పేర్కొంటుంది.
ముఖ్యంగా వృద్దాప్య పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, రైతు బంధు, రైతు బీమా వంటి పథకాల పట్ల ప్రజలు చాలా సంతృప్తిగా ఉన్నారని.. ఆయా వర్గాల ఓట్లు పూర్తి స్థాయిలో టీఆర్‌ఎస్ వైపే ఉన్నాయని చెబుతున్నారు. ఇలా మొత్తం మీద టీఆర్‌ఎస్, ప్రజాఫ్రంట్ పార్టీలకు చెందిన నేతలు పోలింగ్ సరళిని ఎవరికి వారు అనుకూలంగా భావిస్తున్నారు.
పాలమూరుపై ప్రత్యేక దృష్టి
ఎన్నికల ఫలితాల విషయంలో ఈసారి రాష్ట్రం మొత్తం ఉమ్మడి పాలమూరు జిల్లా వైపు అత్యంత ఆసక్తిగా చూస్తోంది. ఈ జిల్లా మొదటి నుంచి కాంగ్రెస్, టీడీపీకి మంచి పట్టున్న ప్రాంతం కావడంతో.. గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ఆశించిన ఫలితాలు రాబట్టలేకపోవడంతో దృష్టి మొత్తం పాలమూరు మీదే ఉంది.
టీఆర్‌ఎస్ కూడా ఈసారి పాలమూరు అత్యధిక స్థానాలు గెలవబోతున్నా మని ఘంటా పథకంగా చెబుతోంది. ముఖ్యంగా సీఎం కేసీఆర్ జిల్లాలో జరిగిన ప్రతీ సభలో కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు. జిల్లాకు టీఆర్‌ఎస్ హయాంలోనే లబ్ధి జరిగిందని పదేపదే ప్రస్తావించారు. అంతేకాదు టీఆర్‌ఎస్ ముఖ్యనేతలు హరీశ్‌రావు, కేటీఆర్ కూడా పలుమార్లు జిల్లా పర్యటనలు చేసి పార్టీని గాడిన పెట్టే ప్రయత్నం చేశారు.
కాంగ్రెస్‌లోని ముఖ్యనేతలు డీకే.అరుణ, రేవంత్ రెడ్డిని కూడా ఈసారి ఓడిస్తామని శపథాలు చేశారు. మరోవైపు పాలమూరులో టీఆర్‌ఎస్‌ను మట్టి కరిపిస్తామని ప్ర జాఫ్రంట్ ధీమా వ్యక్తం చేస్తోంది. టీఆర్‌ఎస్ ఊహిస్తున్న ఫలితాలకు పూర్తి భిన్నమైన తీర్పు రాబోతుందని పేర్కొంటుంది. ఇలా మొత్తం మీద ఎవరికి వారు చేస్తున్న ప్రకటనలు మరింత తీవ్ర ఉత్కంఠతకు గురిచేస్తున్నాయి.
బెట్టింగ్‌లు షురూ
జిల్లాలో ఎన్నికల ఫలితాలపై ఈసారి భారీగా బెట్టింగ్‌లు జరుగుతున్నాయి. జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా రెండు స్థానాలపై భారీగా బెట్టింగ్‌లు చోటు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కొడంగల్ నుంచి కాంగ్రెస్ తరఫున బరిలో ఉన్న రేవంత్‌రెడ్డి గెలుపోటములతో పాటు మెజార్టీపై కూడా పలువురు బెట్టింగ్‌కు దిగినట్లు చెబుతున్నారు.
అలాగే కాంగ్రెస్‌లో ఫైర్‌బ్రాండ్‌గా పేరొందిన డీకే.అరుణ విషయంలో కూడా జోరుగా బెట్టింగక్ష జరుగుతోంది. ఈసారి ఎట్టి పరిస్థితిలో డీకే అరుణను ఓడించాలని టీఆర్‌ఎస్ అధిష్టానం గట్టి పట్టుదలతో పనిచేసింది. ఇదే విషయాన్ని సీఎం కేసీఆర్ వనపర్తిలో సభలోనూ ప్రస్తావించారు. దీంతో గద్వాల నుంచి వరుసగా మూడుసార్లు గెలుపొందిన అరుణ గెలుపోటములు, మె జార్టీపై బెట్టింగ్‌కు దిగినట్లు తెలుస్తోంది. అలాగే, మిగతా నియోజకవర్గాల అభ్యర్థుల విషయంలోనూ గతంలో ఎన్నడూ లేని విధంగా బెట్టింగ్‌లు జరుగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment