స్వాధీనం చేసుకున్న డబ్బును పరిశీలిస్తున్న అధికారులు
సాక్షి,మహబూబ్‌నగర్, నెట్‌వర్క్: ఓటర్లను ప్రభావితం చేయడానికి చివరిరోజు నగదు చేతులు మారవచ్చని, మద్యం విరివిగా పంపిణీ కావచ్చనే అనుమానంతో పోలీసు, ఎక్సైజ్‌శాఖ అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. గురువారం ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు కూడా అడుగడుగునా సోదాలు చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన చెక్‌పోస్టులు, జాతీయ, అంతరాష్ట్ర రహదారి, సరిహద్దుల వద్ద పోలీసులు ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు.
మక్తల్‌లో హల్‌చల్
మక్తల్ స్వంత్య్ర అభ్యర్థి మాదిరెడ్డి జలంధర్‌రెడ్డి తరఫున మాజీ జెడ్పీటీసీ సభ్యుడు లక్ష్మారెడ్డి డబ్బు పంపిణీ చేస్తున్నారనే సమాచారంతో గురువారం సాయంత్రం పోలీసులు ఆయన సోదాలు చేశారు. ఆ సమయంలో లక్ష్మారెడ్డి లేకపోవడంతో తాళం పగులగొట్టి మరీ తనిఖీ చేశారు. అంతలోనే లక్ష్మారెడ్డికి అక్కడకు చేరకోగా ఆయనను సైతం తనిఖీ చేసిన పోలీసులు ఆయన వద్ద నుంచి రూ.40 వేలు, ఇంట్లో లభించిన రూ.4 వేలను స్వాధీనం చేసుకుని ఎన్నికల అధికారికి అప్పగించారు. విషయం తెలుసుకున్న నాయకులు అప్పటికే తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని డబ్బులకు సంబంధించిన ఆధారాలు చూపించడంతో తిరిగి లక్ష్మారెడ్డికి అందజేశారు. ఇదిలాఉండగా ఈ విషయంపై స్వతంత్ర అభ్యర్థి మాదిరెడ్డి జలందర్‌రెడ్డి తనిఖీలను తప్పుపట్టారు. కేవలం లక్ష్మారెడ్డి ఇంటికే వచ్చి తనిఖీ చేయడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు.
రూ.5లక్షల మద్యం పట్టివేత
కల్వకుర్తి రూరల్: ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో కల్వకుర్తి రేంజ్ పరిధిలో ఇటీవల జరిపిన దాడుల్లో మొత్తం రూ.5లక్షల విలువచేసే మద్యం పట్టుబడిందని ఎక్సైజ్ సీఐ శంకర్ గురువారం విలేకరులకు తెలిపారు. ఐదు ద్విచక్ర వాహనాలు, రెండు ఆటోలను సీజ్ చేశామని తెలిపారు. పోలీసు, ఎక్సైజ్‌శాఖ సంయుక్తంగా దాడులు, తనిఖీలు చేపట్టాయని తెలిపారు. ఓటర్లను ప్రలోభాలకు గురించేయడానికి ప్రయత్నిస్తుండగా ప్రజలు చైతన్యమై సమాచారం అందించడంతోనే మద్యం, నగదు పట్టుబడిందని తెలిపారు.
రూ.1.46 లక్షలు స్వాధీనం
మన్ననూర్ (అచ్చంపేట): అక్రమంగా తరలుతున్న డబ్బును ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం సభ్యులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడానికి అమ్రాబాద్ మండలం దోమలపెంటకు చెందిన శివారెడ్డి తన వాహనంతో పాటు మరో రెండు వాహనాల్లో డబ్బులు తీసుకువెళ్తున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ మేరకు వాహనాన్ని నిలిపి ఫ్లయింగ్ స్క్వాడ్ బృందానికి సమాచారం ఇచ్చారు. వారు వచ్చి వాహనం తనిఖీ చేయగా రూ.1,46,500 లభించాయి. లేబర్‌కు ఇవ్వాల్సిన డబ్బులు బ్యాంకు నుంచి నాలుగు రోజుల కిందట డ్రా చేశానని, వాటిని కూలీలకు ఇవ్వడం మరిచిపోయానని, అవి నా వాహనంలోనే ఉండిపోయాయని పొంతన లేని మాటలు చెప్పడంతోపాటు ఎలాంటి ఆధారాలు చూపించపోవడంతో ఫ్లయింగ్ స్క్వాడ్ ఏఓ రమేష్ స్వాధీనం చేసుకున్నారు. ఇదిలాఉండగా డబ్బులు తరలిస్తున్న సమాచారం తెలియగానే ఆయా పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. తనిఖీలో ఎస్‌ఐలు రామన్‌గౌడ్, బద్యానాయక్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
నగదు, ముక్కుపుడకలు పట్టివేత
గద్వాల క్రైం: మండలంలోని గోనుపాడు, వీరాపురం, బీరోలు, కుర్వపల్లి, గద్వాల పట్టణంలోని పలు కాలనీలో ఓటర్లకు డబ్బులతోపాటు బంగారు ముక్కుపుడుకలు పంపిణీ చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. పోలింగ్‌కు కేవలం ఒకేరోజు ఉండటంతో గురువారం పలు కాలనీలో ఓటర్లకు డబ్బులు పంచుతున్నట్లు పక్కా సమాచారం రావడంతో పోలీసులు దాడులు చేపట్టగా రూ.85,900 నగదు, 4 ముక్కుపుడకలను పట్టుకున్నారు. అనంతరం 9 మందిని అదుపులోకి తీసుకుని వారిపై కేసులు నమోదు చేసినట్లు ఎస్‌ఐలు సత్యనారాయణ, నాగశేఖర్‌రెడ్డి తెలిపారు. ఎవరైనా మద్యం, డబ్బులు, ముక్కుపుడకలు లాంటివి పంపిణీ చేస్తుంటే పోలీసులకు సమాచారం అందించాలని వారు ప్రజలను కోరారు.
Comments
Please login to add a commentAdd a comment