యాదగిరిగుట్టలో వివరాలు వెల్లడిస్తున్న ఎస్‌ఓటీ సీఐ రాజు, ఆలేరులో నగదుతో పట్టుబడిన వాహనం
మిర్యాలగూడ అర్బన్ : మిర్యాలగూడ పట్టణంలో ఈదులగూడ వద్ద రోడ్డు పక్కన గురువారం రూ.4లక్షల రూపాయలు దొరకడం కలకలం సృష్టించింది. శుక్రవారం జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా వివిధ పార్టీల నాయకులు డబ్బులు పంచుతూ పోలీసులకు పట్టుబడ్డారు. ఎన్నికల విధుల్లో భాగంగా పట్టణంలోని ఈదులగూడ చౌరస్తా వద్ద వన్‌టౌన్ సీఐ సదానాగరాజు ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అయిన హౌజింగ్‌బోర్డు కాలనీకి చెందిన సురేందర్‌రెడ్డి వద్ద రూ.40వేల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల రాకను చూసిన సదరు వ్యక్తులు మరో రూ.4లక్షల రూపాయలను రోడ్డు పక్కన పడవేయడంతో గమనించిన పోలీసులు వాటిని కూడా స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. ఎన్నికల నియమావళికి విరుద్ధంగా డబ్బులను పంపిణీ చేస్తున్న సురేందర్‌రెడ్డిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. అదేవిదంగా బంగారుగడ్డలో డబ్బులు పంచుతున్న టీఆర్‌ఎస్‌కు చెందిన కోటిరెడ్డి అనే వ్యక్తిని కూడా టూటౌన్ పోలీసులు అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి రూ.30వేల రూపాయలను స్వాధీనం చేసుకున్నట్లు టూటౌన్ సీఐ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. అదేవిధంగా ఏడుకోట్లతండా వద్ద పోలీసులు తనిఖీ చేస్తుండగా కె. నరేష్ వద్ద నుంచి 60వేల రూపాయలను స్వాధీనం చేస్తున్నారు.
రూ.6.90లక్షలు నగదు పట్టివేత
యాదగిరిగుట్ట : ఎన్నికల నేపథ్యంలో ఓటర్లను ప్రలోభపెట్టడానికి అక్రమంగా తీసుకెళ్తున్న నగదును రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ఎస్‌ఓటీ పోలీసులు గురువారం పట్టుకున్నారు. ఎస్‌ఓటీ సీఐ రాజు తెలిపిన వివరాల ప్రకారం.. ఎన్నికల నేపథ్యంలో భాగంగా యాదగిరిగుట్ట పట్టణంలో గురువారం వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని గగన్‌పాడ్‌లో గల రాజేంద్రనగర్‌కు చెందిన బూత్కూర్ ఆనంద్ అనుమానాస్పదంగా ద్విచక్రవాహనంపై కనిపించాడు. దీంతో ఆనంద్‌ను అదుపులోకి తీసుకొని తనిఖీలు చేయగా అతనివద్ద రూ.6.90లక్షలు ఉన్నట్లు గు ర్తించారు. అతడిని అదుపులోకి తీసుకొని డబ్బును సీజ్ చేశారు. ఆ డబ్బు ఎక్కడి నుంచి తీసుకువస్తున్నారు.. ఎవరు పంపించారు.. ఎందుకు తీసుకెళ్తున్నాయనే విషయాలపై డబ్బుతో పట్టుబడిన ఆనంద్‌ను విచారిస్తున్నట్లు ఎస్‌ఓటీ సీఐ రాజు పేర్కొన్నారు. కేసు నమోదు చేసి పట్టణ పోలీస్ స్టేషన్‌లో అప్పగించినట్లు వెల్లడించారు.
ఆలేరులో రూ. 13లక్షలు..
ఆలేరు : అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పోలీసులు నిర్వహించిన తనిఖీలో ఆలేరు చెక్‌పోస్టు వద్ద గురువారం తెల్లవారుజామున రూ. 13.03లక్షలు పట్టుబడ్డాయి. హైదరాబాద్ నుంచి తొర్రూర్‌కు వెళ్తున్న టాటాఏస్ వాహనంలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా, కొన్ని కాటన్ డబ్బాలలో కప్పుసాసర్లు ఉన్నాయి. అనుమానం వచ్చిన పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ నిర్వహించగా ఓ చిన్న అట్టడబ్బలో డబ్బుల కట్టలు లభ్యమయ్యాయి. దీంతో వాహనంతో పాటు డ్రైవర్ సురేశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయమై డ్రైవరన్‌ను విచారించగా కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఆలేరు సాయిబాబా గుడి వద్ద తన వాహనాన్ని ఆపి అట్టడబ్బాల్లో నగదును పెట్టారని ఆ డబ్బును తరలిస్తే రూ. 5వేలు కిరాయి ఇస్తామని మాట్లాడుకున్నారని పోలీసుల విచారణలో తెలిపారు. ఈ తనిఖీ సర్వైవల్ అధికారి జ్ఞానప్రకాశ్ ఆద్వర్యంలో కొనసాగాయి. తన వాహనంలో ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
పెద్దఅడిశర్లపల్లి : ఎన్నికల దృష్ట్యా పోలీసులు చేపట్టిన తనిఖీల్లో బుధవారం రాత్రి రూ.లక్ష నగదును పోలీసులు పట్టుకున్నారు. గుడిపల్లి ఎస్‌ఐ వీరరాఘవులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎన్నికల విధుల్లో భాగంగా చేపడుతున్న తనిఖీల్లో పీఏపల్లి మండల కేంద్రంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఓ వ్యక్తి వద్ద నుంచి రూ.లక్ష నగదు పట్టుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment