కట్టె కాలేవరకు పులిలా కొట్లాడతా: కేసీఆర్‌ | KCR Fires On Congress Party Leaders | Sakshi
Sakshi News home page

కట్టె కాలేవరకు పులిలా కొట్లాడతా: కేసీఆర్‌

Published Wed, Feb 14 2024 12:49 AM | Last Updated on Wed, Feb 14 2024 12:49 AM

KCR Fires On Congress Party Leaders - Sakshi

సాక్షి ప్రతినిధి, నల్లగొండ: తనకు చేతనైనా కాకపోయినా.. తన కట్టె కాలే వరకు, చివరి శ్వాస వరకు ప్రజలకు అన్యాయం జరిగితే పులిలా పోరాడతానని.. లేచి కొట్లాడతా తప్ప పిల్లిలా ఉండనని బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కె.చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. ఆరునూరైనా ప్రజలకు కృష్ణా జలాల విషయంలో అన్యాయం జరగనివ్వనన్నారు. కృష్ణా జలాల పరిరక్షణ పేరిట మంగళవారం నల్లగొండలోని మర్రిగూడ బైపాస్‌లో  నిర్వహించిన బహిరంగ సభలో కేసీఆర్‌ ప్రసంగించారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే. 

ఇది చిల్లర మల్లర రాజకీయ సభ కాదు 
‘‘చలో నల్లగొండ’ రాజకీయ సభ కాదు.. కొందరికి రాజకీయం. మనకు మాత్రం ఉద్యమ, పోరాట సభ. కృష్ణా నీళ్లపై ఆధారపడిన మన బతుకులకు సంబంధించిన సమస్య. ఖమ్మం, నల్లగొండ, మహబూబ్‌నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ప్రజల జీవన్మరణ సమస్య. చావో రేవో తేల్చే సమస్య. అందుకే నా కాలు విరిగిపోయినా కుంటి నడకతో కట్టె పట్టుకొని ఇంత ఆయాసంతో రావాల్సి వచ్చింది.

కొంతమంది మంది సన్నాసులు తెలివి లేక, వాళ్లకు వ్యతిరేకంగా ఈ సభ పెట్టామని అనుకుంటున్నారు. వారిలా ఇది చిల్లర మల్లర రాజకీయ సభ కాదు. నీళ్లు పంచడానికి సిద్ధంగా ఉన్న బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌కు, కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర నీటి పారుదల మంత్రికి, మన నీళ్లు దొబ్బిపోదామనుకునే స్వార్థ శక్తులకు ఈ సభ ఒక హెచ్చరిక..’ అని కేసీఆర్‌ పేర్కొన్నారు.  

రాష్ట్ర బిల్లు కోసమే తాత్కాలిక సర్దుబాటుకు ఒప్పుకున్నాం 
‘ఆనాడు అధికారంలో ఉన్న, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఒక్క ఏడాది కోసం తాత్కాలికంగా సర్దుబాటు చేసుకోండి.. ఆ తరువాత ఎవరి వాటా వారికి వస్తాయని చెప్పింది. ఆనాడు ప్రత్యేక రాష్ట్ర బిల్లు పాస్‌ కావాలి.. తెలంగాణ రావాలి.. ఇదొక ఆటంకం కాకూడదు. తర్వాత చూసుకుందాం అనే ఉద్దేశంతో సరే కానివ్వండి అని చెప్పినం. ఆ తరువాత వాళ్లు పోయి మోదీ ప్రభుత్వం వచ్చింది.

మేం మునిగిందే నీళ్లల్లో.. నీళ్లు లేక మా బతుకులు ఆగమైపోయాయి.. వెంటనే నీళ్లు పంపిణీ చేయండని వందల ఉత్తరాలు రాశాం. ట్రిబ్యునల్‌ వేయమన్నా వేయలే. దాంతో సుప్రీంకోర్టుకు వెళ్లి తగాదా పెట్టాం. ఆ తరువాత మీటింగ్‌లో మేము గట్టిగా నిలదీస్తే మీరు కేసు ఉపసంహరించుకోండి.. నీటి పంపకాలకు మేము ట్రిబ్యునల్‌ ఏర్పాటు చేస్తాం అని చెబితే ఉపసంహరించుకున్నాం. అయినా తొందరగా వేయలేదు. మళ్లీ ఉత్తరాలు రాశా. లోక్‌సభ వారం రోజులపాటు స్తంభింపజేశాం. ఆ ఒత్తిడికి తలొగ్గి మొన్న ఎన్నికలకు నాలుగైదు నెలల ముందు ట్రిబ్యునల్‌ ఏర్పాటు చేశారు..’ అని తెలిపారు.  

పాలిచ్చే బర్రెను అమ్మి దున్నపోతును తెచ్చుకున్నరు 
‘ఏ ప్రభుత్వం ఉన్నా ట్రిబ్యునల్‌ ముందుకుపోయి గట్టిగా వాదించాలి. అది మొగోడు చేయాల్సిన పని. జనంపై ప్రేమ ఉన్నోడు చేయాల్సిన పని. మీకేం కోపం వచ్చిందో.. ఏం భ్రమలో పడ్డారో.. పాలిచ్చే బర్రెను అమ్మి దున్నపోతును తెచ్చుకున్నరు. ఈ ప్రభుత్వం మన జీవితాలను దెబ్బకొట్టేలా కృష్ణా జలాలను కృష్ణా రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డుకు (కేఆర్‌ఎంబీ) అప్పగించింది. జలాల్లో వాటా తేల్చమని అడుగాల్సిన ప్రభుత్వం ఆ పని చేయకుండా ప్రాజెక్టులను అప్పగిస్తూ సంతకం పెట్టింది. దాని మెమోరాండం దొరికింది.

దానివల్ల జరిగే నష్టం నీళ్ల మంత్రిగా పనిచేసిన హరీశ్‌రావుకు తెలుసు కాబట్టి గర్జించారు. దాంతో నాలుగైదు రోజులు నాటకాలు ఆడారు. అబద్ధాలు ఆడారు. బిడ్డా మిమ్మల్ని బజారున నిలబెట్టి మీ సంగతి ప్రజల ముందే తేల్చుకుంటాం..అని చలో నల్లగొండకు పిలుపు ఇచ్చా. ఇజ్జత్‌ మానం పోతోందని అతి ముఖ్యమైన బడ్జెట్‌ పక్కకు పెట్టారు. ఆగమేఘాలపై అసెంబ్లీలో తీర్మానం పెట్టారు. అది కూడా సరిగ్గా పెట్టకుండా తాగునీటి కోసమని పెట్టారు. కరెంటు ఉత్పత్తి గురించి పెట్టలేదు..’ అని కేసీఆర్‌ ధ్వజమెత్తారు.  

నాలుగు రోజులు విశ్రాంతి తీసుకుందామనుకున్నా.. 
‘ప్రజలు అధికారం ఇచ్చారు. ఐదేళ్లు ఉండండి. మాకు అభ్యంతరం లేదు. నేను నాలుగు రోజులు ఆరాంగా కూర్చుందామనుకున్నా. కానీ ఏం చేశారు. నల్లముఖం పిల్లిపోయి సచ్చిన ఎలుకను పట్టినట్లు.. ప్రభుత్వం వచ్చుడు వచ్చుడే కృష్ణా నీళ్లను తీసుకెళ్లి కేఆర్‌ఎంబీకి అప్పగించింది. కట్టమీద మొత్తం రిజర్వు పోలీసోళ్లు ఉన్నరు. మంచినీళ్లను చిప్పపట్టి అడుక్కోవాలి. విద్యుత్తు ఉత్పత్తి చేయాలంటే అడుక్కోవాలి. మనకున్న అధికారులను వారికి అప్పగించారు. నన్ను బెదిరించినా అప్పగించలే.

గవర్నమెంట్‌ను పడగొడతామన్నారు. రాష్ట్రపతి పాలన పెడతమన్నారు. అయినా ఒప్పుకోలేదు. నా తలకాయ పోయినా ప్రాజెక్టులను అప్పగించనని చెప్పా. కానీ ఈ ప్రభుత్వం అప్పగించింది. ఇటీవల బీఆర్‌ఎస్‌ ఎంపీలు వెళ్లి అడిగితే మీ ప్రభుత్వం ఒప్పుకుందని చెప్పారు. ఇప్పటికైనా పిచ్చి ప్రేలాపనలు, పిచ్చి ఆలోచనలు మాని వెంటనే బడ్జెట్‌ సమావేశాలు ముగించి కృష్ణా, గోదావరి జలాల్లో రాష్ట్రానికి రావాల్సిన సంపూర్ణమైన వాటా కోసం అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకుపోవాలి. ప్రధానిని నిలదీయాలి. ఆరు నెలల్లో వాటాలు తేల్చండి అంటూ ప్రధాని ఆదేశించేలా పోరాటాలు నిర్వహించాలి..’ అని సూచించారు. 

దద్దమ్మల రాజ్యం ఇలాగే ఉంటుంది 
‘మంత్రి ఉత్తమ్‌కుమార్‌ ఉమ్మడి రాష్ట్రమే బాగుందని అసెంబ్లీలోనే అన్నారు. అదే మంచిగుంటే మరి అంత పెద్ద ఉద్యమం ఎందుకు జరిగింది.. కోట్ల మంది ఎందుకు పాల్గొన్నారు.. శ్రీకాంతాచారి ఎందుకు చనిపోయారనే సోయి లేకుండా మంత్రులు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్‌ వాళ్లకు పదవులు కావాలి.. పైరవీలు కావాలి.. డబ్బు కావాలి తప్ప ప్రజల హక్కుల గురించి పట్టించుకోరు. ‘టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చాక ఏడాదిన్నరలోనే 24 గంటల ఇచ్చాం. కేసీఆర్‌ ప్రభుత్వం పోగానే ఆ కరెంట్‌ పోతదా? తొ‘మ్మిదిన్నరేళ్లు ఇచ్చిన కరెంటు ఈరోజు ఏమైంది.

ఏమైనా మాయ రోగం వచ్చిందా? దద్దమ్మల రాజ్యం ఉంటే ఇలాగే ఉంటుంది. చేతగాని చవటల రాజ్యం ఉంటే గిట్లనే ఉంటది. కరెంటు ఎందుకు ఇస్తలేరు. ఎందుకు తిప్పలు పెడుతున్నారు? ఏమైందిరా బిడ్డా కరెంట్‌ అని మీరు అడగాలి. బిడ్డా.. ఈ సభతో ఆపం. ఎక్కడ దొరికితే అక్కడ బజారుకీడుస్తాం. కరెంటు, సాగునీరు, తాగునీటి విషయంలో ప్రజలను ఇబ్బందులు పెడితే ఎక్కడికక్కడ నిలదీస్తాం. అసెంబ్లీలో జనరేటర్‌ పెట్టిన చరిత్ర వీరిదే. అసెంబ్లీలో మాట్లాడుతుంటే ఏడుసార్లు కరెంట్‌ పోతదా?’ అని కేసీఆర్‌ నిలదీశారు.   

రైతు బంధు అడిగితే చెప్పుతో కొడతామంటారా.. 
‘రైతుబంధు అడిగితే ఇవ్వడానికి చేతకావడం లేదా? ఇంత దద్దమ్మలా.. ఇవ్వకపోతే ఇవ్వలేదు.. రైతు బందు అడిగితే చెప్పుతో కొడతానని రైతులను అంటావా? పంటలు పండించే రైతులకు కూడా చెప్పులు ఉంటయ్‌. అవి గట్టిగా ఉంటాయ్‌. ఒక్కసారికి మూడు పళ్లు రాలిపోతాయి. మీకు ఇవ్వడం చేతగాకపోతే తరువాత ఇస్తామని చెప్పు. లేదంటే డబ్బులు లేవని చెప్పాలి.

చలో నల్లగొండ పెడితే కేసీఆర్‌ను తిరగనీయం అంటారా? ఇంత మొగోళ్లా? తెలంగాణ తెచ్చిన కేసీఆర్‌నే తిరగనీయరా? ఏం చేస్తరు చంపుతారా? దా చంపుదువు రా.. కేసీఆర్‌ను చంపి మీరుంటరా? మీకు దమ్ముంటే పాలమూరు రంగారెడ్డి, ఖమ్మంలో సీతారామ ప్రాజెక్టు పూర్తిచెయ్‌. మేడిగడ్డకు పోతం.. బొందల గడ్డ పోతాం అని వెళ్తున్నావు. బిడ్డా మేము కూడా ఈ స్టేజీ మీద ఉన్నోళ్లమంతా పోతాం. మీ బండారం బయట పెడతం. మేడిగడ్డకు పోయి ఏం పీకుతావు. దమ్ముంటే ప్రాణహిత నీటిని ఎత్తిపోయి. డోర్నకల్‌కు నీరు వస్తలేవు. సూర్యాపేటకు, తుంగతుర్తికి మునుపు వచ్చిన నీరు ఎందుకు తగ్గిపోయాయి..’ అని ప్రశ్నించారు. 

కాళేశ్వరం ఆట»ొమ్మ అనుకుంటున్నవా? 
‘కాళేళ్వరం అంటే ఒక ఆట బొమ్మ కాదు. మూడు బ్యారేజీలు, 20 రిజర్వాయర్లు, 200 కి.మీ సొరంగాలు, 1,500 కి.మీ కాలువ, 19 సబ్‌ స్టేషన్లు ఉంటాయి. మేడిగడ్డలో 250 పిల్లర్లు ఉంటాయి. రెండు కుంగిపోయాయి. గతంలో ఎన్నిసార్లు కుంగిపోలే. నాగార్జునసాగర్‌లో కుంగిపోలేదా? కడెం ప్రాజెక్టు గేట్లు కొట్టకపోలేదా?  మూసీ గేట్లు కొట్టుకు పోలేదా. ఏదన్న పోతే బాగుచేయాలి. తొందరగా పనిచేసి రైతులకు నీళ్లియ్యాలి.

అది చేయకుండా అంత చిల్లర రాజకీయం ఎందుకు? ఎవరికీ అధికారం శాశ్వతం కాదు. మేం మళ్లీ డబుల్‌ స్పీడ్‌తో అధికారంలోకి వస్తం. అప్పుడు నేను గిట్టనే మాట్లాడాలా? ఇకనైనా ప్రజల హక్కుల కోసం పనిచేయాలి. ఈరోజు నేను వచ్చింది రాజకీయాల కోసం కాదు. పార్లమెంటు ఎన్నికలకు రెండు మూడు నెలల సమయం ఉంది. నేను మీ బిడ్డను. 15 ఏళ్లు పోరాడి, చావునోట్లో తలపెట్టి ఈ తెలంగాణ తెచ్చింది నేను. అందుకే నాకు ఆరాటం ఉంటది. రాష్ట్రం నాశనం కావద్దనే తపన ఉంటది. దీన్ని అర్థం చేసుకోండి..’ అని కేసీఆర్‌ అన్నారు. 

మద్దతు ధర ఇస్తే బోనస్‌ ఇవ్వరట 
‘కొత్త ప్రభుత్వం వచ్చినపుడు గతంలో కంటే బాగా పనిచేయాలి. వాళ్లు వచ్చినప్పటి నుంచి ఒక్కటైన మంచి మాట అన్నరా. పొద్దున లేస్తే కేసీఆర్‌ను ఎట్లా తిట్టాలనే ఆలోచనే. కేసీఆర్‌ను తిడితే, బురద జల్లితే పెద్దోల్లవుతారా? అధికారం కోసం నోటికొచ్చిన అబద్ధాలు చెప్పారు. ఇప్పుడు మాట మార్చుతున్నారు. ధాన్యానికి మద్దతు ధర వస్తే రూ.500 బోనస్‌ ఇవ్వరట. దొంగ మాటలతో, నంగనాచి మాటలతో తప్పించుకుంటామంటే నడవదు బిడ్డా జాగ్రత్త. అధికారం ఉన్నా లేకున్నా తెలంగాణ ప్రజల పక్షాన పోరాడతాం..’ అని కేసీఆర్‌ హెచ్చరించారు.      

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement