Nalgonda Town
-
కట్టె కాలేవరకు పులిలా కొట్లాడతా: కేసీఆర్
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: తనకు చేతనైనా కాకపోయినా.. తన కట్టె కాలే వరకు, చివరి శ్వాస వరకు ప్రజలకు అన్యాయం జరిగితే పులిలా పోరాడతానని.. లేచి కొట్లాడతా తప్ప పిల్లిలా ఉండనని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కె.చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. ఆరునూరైనా ప్రజలకు కృష్ణా జలాల విషయంలో అన్యాయం జరగనివ్వనన్నారు. కృష్ణా జలాల పరిరక్షణ పేరిట మంగళవారం నల్లగొండలోని మర్రిగూడ బైపాస్‌లో నిర్వహించిన బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగించారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే. ఇది చిల్లర మల్లర రాజకీయ సభ కాదు ‘‘చలో నల్లగొండ’ రాజకీయ సభ కాదు.. కొందరికి రాజకీయం. మనకు మాత్రం ఉద్యమ, పోరాట సభ. కృష్ణా నీళ్లపై ఆధారపడిన మన బతుకులకు సంబంధించిన సమస్య. ఖమ్మం, నల్లగొండ, మహబూబ్‌నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ప్రజల జీవన్మరణ సమస్య. చావో రేవో తేల్చే సమస్య. అందుకే నా కాలు విరిగిపోయినా కుంటి నడకతో కట్టె పట్టుకొని ఇంత ఆయాసంతో రావాల్సి వచ్చింది. కొంతమంది మంది సన్నాసులు తెలివి లేక, వాళ్లకు వ్యతిరేకంగా ఈ సభ పెట్టామని అనుకుంటున్నారు. వారిలా ఇది చిల్లర మల్లర రాజకీయ సభ కాదు. నీళ్లు పంచడానికి సిద్ధంగా ఉన్న బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్‌కు, కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర నీటి పారుదల మంత్రికి, మన నీళ్లు దొబ్బిపోదామనుకునే స్వార్థ శక్తులకు ఈ సభ ఒక హెచ్చరిక..’ అని కేసీఆర్ పేర్కొన్నారు. రాష్ట్ర బిల్లు కోసమే తాత్కాలిక సర్దుబాటుకు ఒప్పుకున్నాం ‘ఆనాడు అధికారంలో ఉన్న, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క ఏడాది కోసం తాత్కాలికంగా సర్దుబాటు చేసుకోండి.. ఆ తరువాత ఎవరి వాటా వారికి వస్తాయని చెప్పింది. ఆనాడు ప్రత్యేక రాష్ట్ర బిల్లు పాస్ కావాలి.. తెలంగాణ రావాలి.. ఇదొక ఆటంకం కాకూడదు. తర్వాత చూసుకుందాం అనే ఉద్దేశంతో సరే కానివ్వండి అని చెప్పినం. ఆ తరువాత వాళ్లు పోయి మోదీ ప్రభుత్వం వచ్చింది. మేం మునిగిందే నీళ్లల్లో.. నీళ్లు లేక మా బతుకులు ఆగమైపోయాయి.. వెంటనే నీళ్లు పంపిణీ చేయండని వందల ఉత్తరాలు రాశాం. ట్రిబ్యునల్ వేయమన్నా వేయలే. దాంతో సుప్రీంకోర్టుకు వెళ్లి తగాదా పెట్టాం. ఆ తరువాత మీటింగ్‌లో మేము గట్టిగా నిలదీస్తే మీరు కేసు ఉపసంహరించుకోండి.. నీటి పంపకాలకు మేము ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తాం అని చెబితే ఉపసంహరించుకున్నాం. అయినా తొందరగా వేయలేదు. మళ్లీ ఉత్తరాలు రాశా. లోక్‌సభ వారం రోజులపాటు స్తంభింపజేశాం. ఆ ఒత్తిడికి తలొగ్గి మొన్న ఎన్నికలకు నాలుగైదు నెలల ముందు ట్రిబ్యునల్ ఏర్పాటు చేశారు..’ అని తెలిపారు. పాలిచ్చే బర్రెను అమ్మి దున్నపోతును తెచ్చుకున్నరు ‘ఏ ప్రభుత్వం ఉన్నా ట్రిబ్యునల్ ముందుకుపోయి గట్టిగా వాదించాలి. అది మొగోడు చేయాల్సిన పని. జనంపై ప్రేమ ఉన్నోడు చేయాల్సిన పని. మీకేం కోపం వచ్చిందో.. ఏం భ్రమలో పడ్డారో.. పాలిచ్చే బర్రెను అమ్మి దున్నపోతును తెచ్చుకున్నరు. ఈ ప్రభుత్వం మన జీవితాలను దెబ్బకొట్టేలా కృష్ణా జలాలను కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు (కేఆర్ఎంబీ) అప్పగించింది. జలాల్లో వాటా తేల్చమని అడుగాల్సిన ప్రభుత్వం ఆ పని చేయకుండా ప్రాజెక్టులను అప్పగిస్తూ సంతకం పెట్టింది. దాని మెమోరాండం దొరికింది. దానివల్ల జరిగే నష్టం నీళ్ల మంత్రిగా పనిచేసిన హరీశ్‌రావుకు తెలుసు కాబట్టి గర్జించారు. దాంతో నాలుగైదు రోజులు నాటకాలు ఆడారు. అబద్ధాలు ఆడారు. బిడ్డా మిమ్మల్ని బజారున నిలబెట్టి మీ సంగతి ప్రజల ముందే తేల్చుకుంటాం..అని చలో నల్లగొండకు పిలుపు ఇచ్చా. ఇజ్జత్ మానం పోతోందని అతి ముఖ్యమైన బడ్జెట్ పక్కకు పెట్టారు. ఆగమేఘాలపై అసెంబ్లీలో తీర్మానం పెట్టారు. అది కూడా సరిగ్గా పెట్టకుండా తాగునీటి కోసమని పెట్టారు. కరెంటు ఉత్పత్తి గురించి పెట్టలేదు..’ అని కేసీఆర్ ధ్వజమెత్తారు. నాలుగు రోజులు విశ్రాంతి తీసుకుందామనుకున్నా.. ‘ప్రజలు అధికారం ఇచ్చారు. ఐదేళ్లు ఉండండి. మాకు అభ్యంతరం లేదు. నేను నాలుగు రోజులు ఆరాంగా కూర్చుందామనుకున్నా. కానీ ఏం చేశారు. నల్లముఖం పిల్లిపోయి సచ్చిన ఎలుకను పట్టినట్లు.. ప్రభుత్వం వచ్చుడు వచ్చుడే కృష్ణా నీళ్లను తీసుకెళ్లి కేఆర్ఎంబీకి అప్పగించింది. కట్టమీద మొత్తం రిజర్వు పోలీసోళ్లు ఉన్నరు. మంచినీళ్లను చిప్పపట్టి అడుక్కోవాలి. విద్యుత్తు ఉత్పత్తి చేయాలంటే అడుక్కోవాలి. మనకున్న అధికారులను వారికి అప్పగించారు. నన్ను బెదిరించినా అప్పగించలే. గవర్నమెంట్‌ను పడగొడతామన్నారు. రాష్ట్రపతి పాలన పెడతమన్నారు. అయినా ఒప్పుకోలేదు. నా తలకాయ పోయినా ప్రాజెక్టులను అప్పగించనని చెప్పా. కానీ ఈ ప్రభుత్వం అప్పగించింది. ఇటీవల బీఆర్ఎస్ ఎంపీలు వెళ్లి అడిగితే మీ ప్రభుత్వం ఒప్పుకుందని చెప్పారు. ఇప్పటికైనా పిచ్చి ప్రేలాపనలు, పిచ్చి ఆలోచనలు మాని వెంటనే బడ్జెట్ సమావేశాలు ముగించి కృష్ణా, గోదావరి జలాల్లో రాష్ట్రానికి రావాల్సిన సంపూర్ణమైన వాటా కోసం అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకుపోవాలి. ప్రధానిని నిలదీయాలి. ఆరు నెలల్లో వాటాలు తేల్చండి అంటూ ప్రధాని ఆదేశించేలా పోరాటాలు నిర్వహించాలి..’ అని సూచించారు. దద్దమ్మల రాజ్యం ఇలాగే ఉంటుంది ‘మంత్రి ఉత్తమ్‌కుమార్ ఉమ్మడి రాష్ట్రమే బాగుందని అసెంబ్లీలోనే అన్నారు. అదే మంచిగుంటే మరి అంత పెద్ద ఉద్యమం ఎందుకు జరిగింది.. కోట్ల మంది ఎందుకు పాల్గొన్నారు.. శ్రీకాంతాచారి ఎందుకు చనిపోయారనే సోయి లేకుండా మంత్రులు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ వాళ్లకు పదవులు కావాలి.. పైరవీలు కావాలి.. డబ్బు కావాలి తప్ప ప్రజల హక్కుల గురించి పట్టించుకోరు. ‘టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ఏడాదిన్నరలోనే 24 గంటల ఇచ్చాం. కేసీఆర్ ప్రభుత్వం పోగానే ఆ కరెంట్ పోతదా? తొ‘మ్మిదిన్నరేళ్లు ఇచ్చిన కరెంటు ఈరోజు ఏమైంది. ఏమైనా మాయ రోగం వచ్చిందా? దద్దమ్మల రాజ్యం ఉంటే ఇలాగే ఉంటుంది. చేతగాని చవటల రాజ్యం ఉంటే గిట్లనే ఉంటది. కరెంటు ఎందుకు ఇస్తలేరు. ఎందుకు తిప్పలు పెడుతున్నారు? ఏమైందిరా బిడ్డా కరెంట్ అని మీరు అడగాలి. బిడ్డా.. ఈ సభతో ఆపం. ఎక్కడ దొరికితే అక్కడ బజారుకీడుస్తాం. కరెంటు, సాగునీరు, తాగునీటి విషయంలో ప్రజలను ఇబ్బందులు పెడితే ఎక్కడికక్కడ నిలదీస్తాం. అసెంబ్లీలో జనరేటర్ పెట్టిన చరిత్ర వీరిదే. అసెంబ్లీలో మాట్లాడుతుంటే ఏడుసార్లు కరెంట్ పోతదా?’ అని కేసీఆర్ నిలదీశారు. రైతు బంధు అడిగితే చెప్పుతో కొడతామంటారా.. ‘రైతుబంధు అడిగితే ఇవ్వడానికి చేతకావడం లేదా? ఇంత దద్దమ్మలా.. ఇవ్వకపోతే ఇవ్వలేదు.. రైతు బందు అడిగితే చెప్పుతో కొడతానని రైతులను అంటావా? పంటలు పండించే రైతులకు కూడా చెప్పులు ఉంటయ్. అవి గట్టిగా ఉంటాయ్. ఒక్కసారికి మూడు పళ్లు రాలిపోతాయి. మీకు ఇవ్వడం చేతగాకపోతే తరువాత ఇస్తామని చెప్పు. లేదంటే డబ్బులు లేవని చెప్పాలి. చలో నల్లగొండ పెడితే కేసీఆర్‌ను తిరగనీయం అంటారా? ఇంత మొగోళ్లా? తెలంగాణ తెచ్చిన కేసీఆర్‌నే తిరగనీయరా? ఏం చేస్తరు చంపుతారా? దా చంపుదువు రా.. కేసీఆర్‌ను చంపి మీరుంటరా? మీకు దమ్ముంటే పాలమూరు రంగారెడ్డి, ఖమ్మంలో సీతారామ ప్రాజెక్టు పూర్తిచెయ్. మేడిగడ్డకు పోతం.. బొందల గడ్డ పోతాం అని వెళ్తున్నావు. బిడ్డా మేము కూడా ఈ స్టేజీ మీద ఉన్నోళ్లమంతా పోతాం. మీ బండారం బయట పెడతం. మేడిగడ్డకు పోయి ఏం పీకుతావు. దమ్ముంటే ప్రాణహిత నీటిని ఎత్తిపోయి. డోర్నకల్‌కు నీరు వస్తలేవు. సూర్యాపేటకు, తుంగతుర్తికి మునుపు వచ్చిన నీరు ఎందుకు తగ్గిపోయాయి..’ అని ప్రశ్నించారు. కాళేశ్వరం ఆట»ొమ్మ అనుకుంటున్నవా? ‘కాళేళ్వరం అంటే ఒక ఆట బొమ్మ కాదు. మూడు బ్యారేజీలు, 20 రిజర్వాయర్లు, 200 కి.మీ సొరంగాలు, 1,500 కి.మీ కాలువ, 19 సబ్ స్టేషన్లు ఉంటాయి. మేడిగడ్డలో 250 పిల్లర్లు ఉంటాయి. రెండు కుంగిపోయాయి. గతంలో ఎన్నిసార్లు కుంగిపోలే. నాగార్జునసాగర్‌లో కుంగిపోలేదా? కడెం ప్రాజెక్టు గేట్లు కొట్టకపోలేదా? మూసీ గేట్లు కొట్టుకు పోలేదా. ఏదన్న పోతే బాగుచేయాలి. తొందరగా పనిచేసి రైతులకు నీళ్లియ్యాలి. అది చేయకుండా అంత చిల్లర రాజకీయం ఎందుకు? ఎవరికీ అధికారం శాశ్వతం కాదు. మేం మళ్లీ డబుల్ స్పీడ్‌తో అధికారంలోకి వస్తం. అప్పుడు నేను గిట్టనే మాట్లాడాలా? ఇకనైనా ప్రజల హక్కుల కోసం పనిచేయాలి. ఈరోజు నేను వచ్చింది రాజకీయాల కోసం కాదు. పార్లమెంటు ఎన్నికలకు రెండు మూడు నెలల సమయం ఉంది. నేను మీ బిడ్డను. 15 ఏళ్లు పోరాడి, చావునోట్లో తలపెట్టి ఈ తెలంగాణ తెచ్చింది నేను. అందుకే నాకు ఆరాటం ఉంటది. రాష్ట్రం నాశనం కావద్దనే తపన ఉంటది. దీన్ని అర్థం చేసుకోండి..’ అని కేసీఆర్ అన్నారు. మద్దతు ధర ఇస్తే బోనస్ ఇవ్వరట ‘కొత్త ప్రభుత్వం వచ్చినపుడు గతంలో కంటే బాగా పనిచేయాలి. వాళ్లు వచ్చినప్పటి నుంచి ఒక్కటైన మంచి మాట అన్నరా. పొద్దున లేస్తే కేసీఆర్‌ను ఎట్లా తిట్టాలనే ఆలోచనే. కేసీఆర్‌ను తిడితే, బురద జల్లితే పెద్దోల్లవుతారా? అధికారం కోసం నోటికొచ్చిన అబద్ధాలు చెప్పారు. ఇప్పుడు మాట మార్చుతున్నారు. ధాన్యానికి మద్దతు ధర వస్తే రూ.500 బోనస్ ఇవ్వరట. దొంగ మాటలతో, నంగనాచి మాటలతో తప్పించుకుంటామంటే నడవదు బిడ్డా జాగ్రత్త. అధికారం ఉన్నా లేకున్నా తెలంగాణ ప్రజల పక్షాన పోరాడతాం..’ అని కేసీఆర్ హెచ్చరించారు. -
ఏపీ,తెలంగాణాలో మరో 8 నగరాలకు జియో ట్రూ5జీ సేవలు
సాక్షి,ముంబై: టెలికాం మేజర్ రిలయన్స్ జియో తన 5G కవరేజీని ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని మరో 8 నగరాలకు విస్తరించింది. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు, కడప, నరసరావు పేట, ఒంగోలు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, విజయనగరంతోపాటు, తెలంగాణలోని నల్గొండతో కలిపి తెలుగు రాష్ట్రాల్లోని ఎనిమిది నగరాలు మంగళవారం నుండి Jio True 5G సేవలను పొందనున్నాయి. దీంతో ఏపీలోని 16, తెలంగాణాలో 6 నగరాల్లో జియో ట్రూ5జీని వినియోగ దారులకు అందిస్తోంది. రిలయన్స్ జియో ఈ నగరాల్లో చాలా వరకు 5జీ సేవలను ప్రారంభించిన తొలి ఏకైక ఆపరేటర్‌గా అవతరించిందని కంపెనీ ఒక ప్రకటనలె తెలిపింది. ఈ నగరాల్లోని జియో వినియోగదారులు ఈరోజు నుండి ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా గరిష్టంగా 1 Gbp వేగంతో అపరిమిత డేటాను పొందేందుకు Jio వెల్కమ్ ఆఫర్‌ను పొందనున్నారు. ఏపీ, తెలంగాణాలోని మరికొన్ని నగరాలకు జియో ట్రూ5 జీ సేవల విస్తరణపై జియో సంతోషం వెలిబుచ్చింది. దేశం మొత్తం డిసెంబర్ 2023 నాటికి 5G సేవల్ని అందించాలన్నలక్క్ష్యంలో భాగంగా మొత్తంగా 17 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 50 పట్టణాల్లో జియో ట్రూ 5జీ ప్రారంభించినట్టు రిలయన్స్ జియో ప్రకటించింది. ఇప్పటికే ఏపీలోని ఆంధ్రప్రదేశ్‌లోని తిరుమల, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుపతి, నెల్లూరు, ఏలూరు, కాకినాడ, కర్నూలులోను, తెలంగాణలోని హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మంలో జియో ట్రూ5జీ సేవలను అందుబాటులోకి తెచ్చింది. -
నల్గొండలో దారుణం.. కన్నీళ్లు తెప్పించే ఘటన..
నల్లగొండ టౌన్: సాధారణ ప్రసవం పేరిట వైద్యులు చేసిన కాలయాపనకు ఓ నిండు ప్రాణం బలైంది. తీవ్ర రక్త స్రావంతో బాలింత చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటన నల్లగొండ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో చోటు చేసుకుంది. ఆమె మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ బంధువులు శనివారం ఆస్పత్రి ఎదుట ఆందో ళనకు దిగారు. కట్టంగూరు మండలం చెర్వు అన్నారం గ్రామానికి చెందిన శిరసు అఖిల మొదటి కాన్పు నిమిత్తం ఈ నెల 9న నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రిలోని మాతాశిశు ఆరోగ్య కేంద్రంలో చేరింది. చదవండి: పోలీస్ స్టేషన్లోకి చొచ్చుకెళ్లిన హిజ్రాలు.. ఎందుకంటే? మూడు రోజులుగా ఆమె నొప్పులతో ఇబ్బందిపడుతున్నా సాధారణ ప్రసవం పేరిట వైద్యులు కాలయాపన చేశారు. ఆపరేషన్ చేయకుండా ఈ నెల 11న నార్మల్ డెలివరీకి ప్రయత్నించారు. ఈ క్రమంలో అఖిల కడుపును వైద్యులు బలంగా ఒత్తడంతో మగశిశువును ప్రసవించింది. అదే సమయంలో ఆమెకు తీవ్ర రక్తస్రావమైంది. దీంతో కుటుంబసభ్యులు బాధితు రాలిని ఏదైనా ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్తామని వేడుకున్నా వైద్యులు అంగీకరించకుండా మూడు రోజులపాటు ఆమెకు రక్తం ఎక్కిస్తూ గడిపారు. అనంతరం పరిస్థితి విషమించి అఖిల కోమాలోకి వెళ్లడంతో వైద్యులు ఈ నెల 14న సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్ప త్రికి తరలించారు. అక్కడ అఖిల పరిస్థితి మరింత విషమించి శుక్రవారం రాత్రి మృతి చెందింది. మృతదేహంతో ఆందోళన: అఖిల మృతికి నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ మాతాశిశు ఆరోగ్య కేంద్రం ఎదుట మృతదేహంతో కుటుంబసభ్యులు, బంధువు లు శనివారం ఆందోళనకు దిగారు. ఆస్పత్రి డాక్టర్లు, సిబ్బంది నిర్లక్ష్యంగా నార్మల్ డెలివరీ చేయడంతో గర్భసంచి పగిలిపోయి రక్తస్రావమైందని ఆరోపించారు. అఖిల మృతికి కారణమైన వైద్యులు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆమె కుటుంబానికి, శిశువు సంరక్షణకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, టూటౌన్ పోలీసులు, ఆస్పత్రి సూపరింటెండెంట్ వచ్చి కుటుంబసభ్యులతో మాట్లాడారు. డాక్టర్లపై ఫిర్యాదు చేస్తే విచారించి చర్యలు తీసుకుంటామని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పించేందుకు ప్రయత్నిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. -
బాబుకు వెయ్యి.. పాపకు రూ.800.. కాన్పుకు రూ.4వేలు! అన్నిటికీ రేటు ఫిక్స్
నల్లగొండ పట్టణ సమీపంలోని ఓ గ్రామానికి చెందిన రాములమ్మ (పేరుమార్చాం) తన కోడలిని కాన్పు కోసం వారం క్రితం ఎంసీహెచ్‌కు తీసుకొచ్చింది. వచ్చీరాగానే ఆపరేషన్ థియేటర్‌కు వీల్‌చైర్‌లో తీసుకెళ్లేటప్పుడు రూ.200 అడగడంతో సరేలే అని ఇచ్చింది. ఆపరేషన్ పూర్తయ్యాక ఆడపిల్ల పుట్టిందని తీసుకొచ్చి చూపించినందుకు రూ.800 వసూలు చేశారు. చీరె మార్చినందుకు రూ.200, వార్డుకు తీసుకొచ్చినందుకు రూ.300 అడగడంతో వెంటనే ఇచ్చేసింది. వారం రోజులు ఆస్పత్రిలోని వార్డులో ఉండడంతో వార్డు ఊడ్చిన వాళ్లకు రోజూ వంద చొప్పున రూ.800, మందులకు రూ.700, డిశ్చార్జ్ సమయంలో వార్డులో అందరికీ కలిపి రూ.700 సమర్పించుకుంది. ఇంటికొచ్చే సరికి మొత్తం రూ.3,700 ఇవ్వాల్సి వచ్చిందని వాపోయింది. ఇదీ ఎంసీహెచ్‌లో వసూళ్ల పర్వానికి ఉదాహరణ. నల్లగొండ టౌన్ : ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలోని మాతాశిశు ఆరోగ్య కేంద్రంలో కాన్పుల వార్డులో పనిచేస్తున్న సిబ్బంది కాసులకు కక్కుర్తి పడుతున్నారు. కాన్పులకు వచ్చినవారి నుంచి ముక్కుపిండి డబ్బులు వసూలు చేస్తున్నారు. ప్రతి పనికి ఓ రేటు నిర్ణయించి దండుకుంటున్నారు. వసూలు చేసిన డబ్బులు ఆ వార్డులోని సిబ్బంది సమానంగా పంచుకుంటున్నారు. కాసుల పంట పండిస్తున్న కాన్పుల వార్డులో డ్యూటీ కోసం సిబ్బంది పోటీ పడుతున్నారు. స్టాఫ్ నర్సు దగ్గరి నుంచి వార్డుబాయ్, ఆయా, ఇతర సహాయ సిబ్బంది అక్కడ డ్యూటీ వేసుకోవడానికి పైరవీలు చేస్తున్నారంటే ఏ స్థాయిలో వసూళ్ల పర్వం కొనసాగుతుందో స్పష్టమవుతుంది. ఈ వసూళ్లకు భయపడి పేదలు ఆస్పత్రిలోని కాన్పుల వార్డులో చేరడానికి జంకుతున్నారు. ఈ విషయంలో అధికారులు, ప్రజాప్రతినిధులు ఎన్నిసార్లు హెచ్చరించినా సిబ్బందిలో మార్పు రావడం లేదు. ఇంటికి వేళ్లే వరకు రూ.4 వేలు ఖర్చు మాతా శిశు మరణాల శాతాన్ని తగ్గించడానికి ప్రతి గర్భణి ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవం చేసుకునేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వం వైద ఆరోగ్య శాఖకు ఆదేశాలు జారీ చేస్తోంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాన్పుల కోసం వచ్చే గర్భిణులకు ఉచితంగా వైద్య సేవలను అందించడంతో పాటు పౌష్టికాహారాన్ని, ఉచిత మందులను అందించి వెళ్లేటప్పుడు బాట ఖర్చులను అందిస్తామని ప్రభుత్వం చెబుతోంది. దీంతో జిల్లా వ్యాప్తంగా అనేక మంది కాన్పులు కోసం జీజీహెచ్‌కు వస్తున్నారు. కానీ ఇక్కడి సిబ్బంది ప్రభుత్వ లక్ష్యాన్ని తూట్లు పొడిచే విధంగా వ్యవహరిస్తున్నారు. వార్డులో గర్భిణి అడ్మిట్ అయిన దగ్గరి నుంచి వసూళ్ల పర్వం మొదలవుతోంది. సిబ్బంది అడిగినంత ఇవ్వకపోతే వారినుంచి ఈసడింపులు, వేధింపులను భరించాల్సి వస్తోందని వాపోతున్నారు. పేరుకే ప్రభుత్వ ఆస్పత్రి కానీ కాన్పు జరిగి ఇంటికి వెళ్లే వరకు సుమారు. రూ.4 వేల వరకు ఖర్చవుతోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వసూళ్ల పర్వాన్ని అరికట్టాలని కోరుతున్నారు. ఈ విషయమై ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ లచ్చూని వివరణ కోరడానికి ఫోన్లో ప్రయత్నించగా లిఫ్ట్ చేయలేదు. మందులూ బయటి నుంచే.. మాతాశిశు ఆరోగ్య కేంద్రంలోని కాన్పుల కోసం వచ్చే వారికి బయటి నుంచే కొన్ని మందులు కొనాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. రక్త పరీక్షల దగ్గరినుంచి కాన్పు జరిగే వరకు సిరంజీలు, సెలెన్ బాటిళ్లు, ఇతర మందులు బయట కొనుగోలు చేయిస్తున్నారు. ఇదేమని ప్రశ్నిస్తే మందులు అందుబాటులో లేవని సమాధానం చెపుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అత్యవసర పరిస్థితిలో మందులు అందుబాటులో లేనప్పుడే.. బయటికి రాస్తున్నామని వైద్యులు పేర్కొంటున్నారు. 550 పడకల స్థాయి మెడికల్ కళాశాల అనుబంధంగా పనిచేస్తున్న జనరల్ ఆస్పత్రిలో మందుల కొరతను లేకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు. మందులు బయట కొనమని రాసిచ్చారు మందులు అందుబాటులో లేవని చెప్పి బయట కొనుక్కొని తీసుకురమ్మని చెప్పారు. చేసేది లేక బయట డబ్బులు పెట్టి మందులు కొన్నాను. పేరుకే ప్రభుత్వ ఆస్పత్రి కానీ మందులు కూడా ఇవ్వడం లేదు. బయటికి రాస్తున్నారు. – మంగమ్మ , బోడంగిపర్తి -
నల్లగొండకి ఐటీ కాంతులు.. శుభవార్త చెప్పిన కేటీఆర్
రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామరావు నూతన సంవత్సర కానుకగా నల్లగొండ వాసులకు శుభవార్త తెలిపారు. ఐటీ రంగాన్ని ద్వితియ శ్రేణి పట్టణాలకు విస్తరించే కార్యక్రమంలో భాగంగా నల్లగొండలో ఐటీ ఇంక్యుబేషన్ సెంటర్ నెలకొల్పబోతున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు భవనం డిజైన్ ఎలా ఉంటుందనే అంశాన్ని ట్విట్టర్లో పోస్ట్ చేశారు. 2021 డిసెంబరు 31న నల్లగొండ ఐటీ ఇంక్యుబేషన్ సెంటర్‌కి శంకుస్థాపన చేస్తున్నామని వెల్లడించారు. 18 నెలల్లో ఈ ఇంక్యుబేషన్ సెంటర్ అందుబాటులోకి వస్తుందన్నారు. After Warangal, Karimnagar, Khammam, Nizamabad & Mahbubnagar now it’s the turn of Nalgonda to get an IT Hub As part of policy to encourage IT in Tier 2 towns, will be laying the foundation today & we plan to inaugurate the facility in 18 months pic.twitter.com/QW7NnUItKH — KTR (@KTRTRS) December 31, 2021 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా ఉన్నప్పుడే వరంగల్‌కి ఐటీ ఇంక్యుబేషన్ సెంటర్ మంజూరైంది. అయితే పనులు నత్తనడకన సాగాయి. తెలంగాణ వచ్చిన తర్వాత వరంగల్‌లో ఐటీకి మంచిరోజులు వచ్చాయి. సెయింట్, ఆనంద్ మహీంద్రా, మైండ్‌ట్రీ, ఎల్ అండ్ టీ వంటి సంస్థలు వరంగల్‌లో తమ క్యాంపస్‌లు ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చాయి. ఇదే క్రమంలో ఆ తర్వాత కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్‌లలో కూడా ఐటీ ఇంక్యుబేషన్ సెంటర్లు ప్రారంభించగా ఫలితాలు సానుకూలంగా ఉన్నాయి. ఈ పరంపరలో నల్గొండకు సైతం ఐటీ సెక్టార్ చేరువకానుంది. చదవండి:హైదరాబాద్‌తో ప్రేమలో పడకుండా ఉండగలమా... కేటీఆర్ ఆసక్తికర ట్వీట్ -
నల్లగొండ పర్యటనకు తెలంగాణ గవర్నర్: చకచకా ఏర్పాట్లు
ఎంజీయూ (నల్లగొండ రూరల్): తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ త్వరలో నల్లగొండ జిల్లాలో పర్యటించనున్నారు. నల్లగొండలోని మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం (ఎంజీయూ)లో గాంధీజీ విగ్రహాన్ని ఆవిష్కరణకు హాజరుకానఉన్నారు. అక్టోబర్ 7వ తేదీన గవర్నర్ విగ్రహావిష్కరణ అనంతరం పలు అంశాలపై విశ్వవిద్యాలయ అధికారులతో సమావేశమై చర్చించనున్నారు. దీంతో బుధవారం కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఎస్పీ రంగనాథ్.. వీసీ గోపాల్‌రెడ్డితో కలిసి ఏర్పాట్లపై సమీక్షించారు. సమావేశం జరిగే హాల్, రక్తదాన శిబిరం ప్రాంతాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో ఆర్డీఓ జగదీశ్వర్‌రెడ్డి, డీఎస్పీ వెంకటేశ్వర్‌రెడ్డి, తహసీల్దార్ నాగార్జునరెడ్డి, గోలి అమరేందర్‌రెడ్డి ఉన్నారు. చదవండి: ‘స్త్రీలను కాదు.. రోడ్డు చూసి బండి నడుపు’ పోలీసుల హెచ్చరిక వైరల్ రిపబ్లిక్ డే పరేడ్‌కు వలంటీర్ల ఎంపిక యూనివర్సిటీలో ఎన్ఎస్ఎస్ ప్రీ - రిపబ్లిక్ డే (ఆర్డీ) పరేడ్‌కు బుధవారం వలంటీర్లను ఎంపిక చేశారు. ఈ మేరకు బుధవారం వీసీ గోపాల్‌రెడ్డి ఎంపిక ప్రక్రియను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వ్యక్తిత్వ వికాసానికి ఎన్ఎస్ఎస్ దోహదపడుతుందన్నారు. విద్యార్థులు నాయకత్వ లక్షణాలను కలిగి ఉండాలని చెప్పారు. నిష్పక్షపాతంగా విద్యార్థుల ఎంపిక జరుగుతుందని స్పష్టం చేశారు. జనవరి 26వ తేదీన ఢిల్లీలో జరిగే పరేడ్‌కు విద్యార్థులను ఎంపిక చేస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో ప్రాంతీయ అధికారి రామకృష్ణ, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ రమేశ్ తదితరులు పాల్గొన్నారు. చదవండి: మనసిచ్చిన మేనబావ.. మనువాడుతానని చెప్పి మోసం -
ప్రాధేయ పడినా వినిపించుకోలేదు.. ఏసీబీకి చిక్కిన వ్యవసాయాధికారి
మిర్యాలగూడ అర్బన్: ఏసీబీ వలలో మరో అవినీతి అధికారి చిక్కాడు. రైతు బీమా కోసం దరఖాస్తు చేసుకున్న ఓ రైతు కుటుంబం నుంచి లంచం తీసుకుంటూ వ్యవసాయ అధికారి అడ్డంగా దొరికిపోయిన ఘటన మిర్యాలగూడ పట్టణంలో శుక్రవారం చోటు చేసుకుంది. మిర్యాలగూడ మండలం కొత్తగూడం గ్రామానికి చెందిన మల్గిరెడ్డి అన్విస్‌రెడ్డి(23) ఈ నెల 5న రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. వ్యవసాయ భూమి అతడి పేరుపై ఉండటంతో రైతు బీమాకు అర్హులు అవుతారని, బీమా సొమ్ముతోనైనా ఆ కుటుంబం కొంత ఊరట చెందుతుందనే ఉద్దేశంతో మృతుడి మేనమామ గుండ్ర శ్రీనివాస్‌రెడ్డి ఈ నెల 16న బీమా పథకానికి కావలసిన అన్ని రకాల పత్రాలను తీసుకుని వ్యవసాయ అధికారి బొలి శెట్టి శ్రీనివాస్‌ను కలిశాడు. బీమా సొమ్ము రావాలంటే రూ.15వేలు ఇవ్వాలని.. డబ్బులు ఇస్తేనే సదరు ఫైల్ కదులుతుందని చెప్పాడు. దీంతో శ్రీనివాస్‌రెడ్డి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచనలతో మరోమారు సదరు అధికారితో మాట్లాడారు. చివరకు రూ.12వేలు ఇచ్చేంకు ఒప్పదం కుర్చుకున్నారు. దీంతో పక్కా ప్రణాళిక ప్రకారం శుక్రవారం పట్టంలోని నల్లగొండ రోడ్డు రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ భవనం సమీపంలో బాధితుడు గుండ్ర శ్రీనివాస్‌రెడ్డి నుంచి ఏఓ బొలిశెట్టి శ్రీనివాస్ రూ.12వేలు తీసుకుంటుండగా ఏబీసీ డీఎస్పీ వేణుగోపాల్ ఆధ్వర్యంలో అధికారులు శ్రీనివాస్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం శ్రీనివాస్‌ను వ్యవసాయ శాఖ కార్యాలయానికి తీసుకెళ్లి అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ దాడుల్లో ఏసీబీ సీఐలు రామ్మూర్తి, నగేష్, శివకువర్ ఉన్నారు. ప్రాధేయ పడినా వినిపించుకోలేదు మా మేనళ్లుడు ప్రమాదవశాత్తు మృతిచెందడంతో రాష్ట్ర ప్రభుత్వం అందించే రైతు బీమా కోసం ఏఓ శ్రీనివాస్‌ను కలిశాం. ఆయన రూ.15వేలు ఇస్తేనే ఫైల్ కదులుందని, లేకుంటే 4వేల పెండింగ్ ఫైళ్లలో నీ ఫైలు కూడా కలుస్తుందని చెప్పాడు. దీంతో ఏసీబీకి ఫిర్యాదు చేశాం. పేద కుటుంబ కావండంతో.. బీమా సొమ్ము వస్తే వారి కుటుంబానికి ఆసరాగా ఉంటుందని ఆశించాం. కానీ, ఇక్కడి వచ్చాక వ్యవసాయ అధికారులు లంచం అడిగి ఇబ్బందిపెట్టారు. – బాదితుడు గుండ్ర శ్రీనివాస్‌రెడ్డి -
నల్లగొండలో అద్భుతం: ‘కంచి’ శాసనచిహ్నాలు
రామగిరి (నల్లగొండ): తమిళనాడులోని కంచి పాలకుడైన 3వ వీరభల్లాలుడి శాసన చిహ్నాలు నల్లగొండలో వెలుగు చూశాయి. కొత్త చరిత్ర బృందం సభ్యుడు చిక్కుళ్ల యాదగిరి ఇటీవల నల్లగొండ పాతబస్తీలో ఉన్న కోట మైసమ్మ ఆలయంలోని ఏకశిల రాతిపలకను శుభ్రం చేసి పరిశీలించగా భైరవుడు, గండభేరుండం, పులి శిల్పాలు చెక్కి ఉన్నాయి. ఈ రాతిపలకం ఫొటోలను ప్రముఖ చరిత్రకారుడు రామోజు హరగోపాల్‌కు కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు యాదగిరి, సత్తయ్య, సట్టు నారాయణ, ఆమనగంటి వెంకన్న, నాగిళ్ల చక్రపాణి పంపగా భైరవుడు శైవమతానికి గుర్తయితే, గండభేరుండం వైష్ణవ మతచిహ్నమని, పులి రాజరికానికి, వీరత్వానికి ప్రతీక అని ఆయన వివరించారు. కంచి పాలకుడైన 3వ హోయసల వీరభల్లాలుడి శాసనాల మీద గండభేరుండం, పులి బొమ్మలు కనిపిస్తుంటాయని హరగోపాల్ తెలిపారు. తమిళనాడులోని భల్లాలుడి రాజ్యానికి తెలంగాణలోని నల్లగొండ పట్టణానికి 500 నుంచి 600 కిలోమీటర్ల దూరం ఉందని, ఇక్కడ కూడా ఆయన ప్రాతినిధ్యం ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. వీరభల్లాలుడిని, అతని మిత్రులు శాంబువరాయుణ్ణి, చంద్రగిరి యాదవరాయుడిని కాకతీయ సేనాని రుద్రుడు ఓడించి కంచిని కాకతీయ సామ్రాజ్యంలో కలిపాడని పేర్కొన్నారు. ఇవి నల్లగొండ జిల్లా కేంద్రంలోని కాపురాలగుట్ట ముందు కనిపించాయని పేర్కొన్నారు. కాకతీయ సామ్రాజ్య పతనానంతరం వీరభల్లాలుడు కాపయనాయకుడితో కలసి యుద్ధా ల్లో పాల్గొన్నట్లు ఆధారాలున్నాయని చెప్పారు. -
కొన ఊపిరితో ఉన్న తల్లి కోసం కుమార్తె అగచాట్లు
నల్లగొండ జిల్లా గట్టుపల్ మండలానికి చెందిన రాజ్యమ్మ శ్వాసలో ఇబ్బందితో నల్లగొండ ప్రభుత్వాస్పత్రిలో చేరింది. పరిస్థితి విషమించడంతో గురువారం హైదరాబాద్‌కు తరలించడానికి ఆమె కుమార్తె అంబులెన్స్, ఆక్సిజన్ సిద్ధం చేసింది. అయితే రాజ్యమ్మలో చలనం లేకపోవడంతో.. వైద్యులతో మాట్లాడి స్ట్రెచర్‌పై ఉన్న తల్లిని తిరిగి అదే ప్రభుత్వాస్పత్రిలోకి తీసుకెళ్లింది. కొద్దిసేపటికే తల్లి కన్నుమూసింది. కొన ఊపిరితో తల్లి.. ఎలాగైనా ఆమెను దక్కించుకోడానికి కుమార్తె పడిన ఆరాటం.. చివరకు తల్లి కన్నుమూయడంతో ఆమె విలపించిన తీరు అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది. - సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, నల్లగొండ -
పట్టభద్రుల పోరు.. బరిలో కోటీశ్వరులు
సాక్షి, నల్లగొండ: శాసనమండలి నల్లగొండ–ఖమ్మం–వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గంనుంచి పోటీ చేస్తున్న ప్రధాన పార్టీల అభ్యర్థులంతా కోటీశ్వరులే. నామినేషన్ల దాఖలు సందర్భంగా వీరు సమర్పించిన అఫిడవిట్లు అదే తేలుస్తున్నాయి. రాష్ట్ర ఎన్నికల కమిషన్ వీరి చదువు, ఆస్తిపాస్తులు, కేసుల వివరాలు ఉన్న అఫిడవిట్లను తన వెబ్సైట్లో ప్రజలకు అందుబాటులో ఉంచింది. అధికార టీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డికి స్థిర, చరాస్తులు అన్నీ కలిపి రూ.31.70 కోట్లు ఉన్నాయి. బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, తెలంగాణ ఇంటి పార్టీ అభ్యర్థి డాక్టర్ చెరుకు సుధాకర్, యువ తెలంగాణ పార్టీ అభ్యర్ధి రాణి రుద్రమ, తెలంగాణ జన సమితి అభ్యర్థి ప్రొఫెసర్ కోదండరామ్, తదితర అభ్యర్థులందరికీ రూ. రెండు కోట్లు ఆపైననే ఆస్తులు ఉన్నాయి. కాంగ్రెస్ అభ్యర్థి రాములు నాయక్‌కు రూ.2కోట్ల లోపు ఆస్తులు ఉండగా, సీపీఐ అభ్యర్ధి జయ సారథిరెడ్డికి కేవలం రూ.లక్షల్లోనే ఆస్తులు ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్లలో పేర్కొన్నారు. ఇక, టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డికి సొంతకారు కూడా లేకపోవడం విశేషం. నల్లగొండ ప్రేమేందర్‌రెడ్డికి రూ.3.72 కోట్ల ఆస్తులు బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డికి రూ.3,72,55,207 విలువైన ఆస్తులు ఉన్నాయి. ఇందులో రూ.2,09,05,207 చరాస్తి కాగా, రూ.1,63,50,000లు స్థిరాస్తిగా చూపించారు. వరంగల్ అర్బన్ జిల్లా దామెరలో 13 ఎకరాల భూమి ఉంది. బీమారంలో తిరుమల సర్వీస్ సెంటర్ పేరుతో కమర్షియల్ బిల్డింగ్ ఉంది. ఆయనకు ఒక ఇన్నోవా వాహనంతోపాటు, అశోక్ లేల్యాండ్ ట్యాంకర్ ఒకటి ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో రూ.18.84లక్షల రొక్కం ఉందని, బ్యాంకులో డిపాజిట్ల రూపంలో మరో రూ.28 లక్షలు ఉన్నాయని, భార్యచేతిలో రూ.4.59లక్షల నగదు కూడా ఉన్నట్లు పేర్కొన్నారు. అప్పుల రూపంలో రూ.86.79లక్షల ఓడీ లోన్ ఉన్నట్లు పేర్కొన్నారు. పల్లా అప్పులు రూ.4.10కోట్లు ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్న వివరాల ప్రకారం పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యులకు ఉన్న స్థిర, చరాస్తుల విలువ రూ.31,70,92,030. కాగా, ఇందులో చరాస్తులు విలువ రూ.13,15,98,390, స్థిరాస్తుల విలువ రూ.18,54,93,640గా పేర్కొన్నారు. ఇక, ఆయనకు సొంత కారు కూడా లేదు. కానీ, పల్లా భార్య పేరు మీద ఒక కారు (మారుతీ సెలిరీయో 2017 మోడల్) ఉన్నట్లు అఫిడవిట్లో ప్రకటించారు. ఇక ఆయనకు ఉన్న అప్పులు రూ.4,10,17,703. పల్లాకు వారసత్వంగా నాలుగు ఎకరాల భూమి రాగా, ఆయన తన సంపాదన నుంచి మరికొంత భూమి కొనుగోలు చేశారు. మొత్తంగా ఆయన పేరున 32.10 ఎకరాలు, ఆయన భార్య పేరున 10.27 ఎకరాలు, కుటుంబ సభ్యుల పేరు మీద 41.39 ఎకరాల భూములు ఉన్నాయి. రాణిరుద్రమ: యువ తెలంగాణ పార్టీ (వైటీపీ) వర్కింగ్ ప్రెసిడెంట్, ఆ పార్టీ అభ్యర్థి జి.రాణి రుద్రమకు రూ. 3,98,86,700 ఆస్తులు ఉన్నాయి. ఇందులో రూ. 58,06,700 చరాస్తి రూ.3,40,80,000 విలువైన స్థిరాస్తులు ఉన్నాయి. ఆమెకు రూ.42.98లక్షల విలువైన 89 తులాల బంగారు నగలు, రూ.1.08లక్షల విలువైన. కేజిన్నర వెండి ఆభరణాలు ఉన్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. ప్రొఫెసర్ కోదండరామ్: తెలంగాణ జనసమితి (టీజేఎస్) అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థి కూడా అయిన ప్రొఫెసర్ కోదండరామ్‌కు రూ.2,06,95,099 విలువైన ఆస్తులు ఉన్నాయి. ఇందులో రూ.52,75,099 విలువైన చరాస్తి, రూ.1,54,20,000 విలువైన స్థిరాస్తి ఉంది. అంతే కాకుండా ఆయన పేరు మంచిర్యాలలో ఒక కమర్షియల్ గోదాము కూడా ఉన్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. కోదండరామ్‌కు, ఆయన భార్యకు చెరో వాహనం ఉంది. సీపీఐ అభ్యర్థి జయ సారథిరెడ్డి: ఈయన పేరున రూ.4.08లక్షల చరాస్తి ఉండగా, ఆయన భార్యపేరున రూ.37.75లక్షల విలువైన చరా స్తి మాత్రమే ఉన్నట్లు పేర్కొన్నారు. సొంతంగా కొనుగోలు చేసిన స్థిరాస్తి రూ.15.95లక్షల విలువగలది ఆయన పేరున, రూ.33.88లక్షల విలువగల ఆస్తి భార్య పేరు ఉంది. కాంగ్రెస్ అభ్యర్థి రాములు నాయక్: ఈయనకు రూ.1.88 కోట్ల ఆస్తులు ఉన్నా యి. ఇందులో చరాస్తులు రూ.40,71,305లు కాగా, స్థిరా స్తులు రూ.1,47,61,580గా పేర్కొన్నారు. మొత్తంగా ఆయనకు రూ.1,8 8,32,885 విలువైన ఆస్తులు ఉండగా.. రూ.16,42,764 అప్పులున్నా యి. ఒక ఇన్నోవా కార్ కూడా ఉంది. ఇక, ఆయన భార్యకు రూ.4లక్షల విలువ చేసే బంగారు నగలు ఉన్నాయి. తెలంగాణ ఇంటిపార్టీ (టీఐపీ) అధ్యక్షుడు, ఆ పార్టీ అభ్యర్థి డాక్టర్ చెరుకు సుధాకర్‌కు రూ.3. 37కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. ఇందులో రూ.7 లక్షల విలువైన చరాస్తి, రూ.3.30కోట్ల విలువైన స్థిరాస్తి ఉంది. -
ఫోర్జరీతో కదులుతున్న.. డొంక!
ఓపెన్ స్కూల్స్ జిల్లా కోఆర్డినేటర్ పోస్టు కోసం మంగళ సృష్టించిన ఫోర్జరీ లేఖ వ్యవహారంలో తీగలాగితే డొంక కదులుతోంది. ఆమెకు సంబంధించి ఒక్కో అంశం వెలుగులోకి వస్తోంది. ఆమెను ఈ పోస్టులో కొనసాగించేందుకు రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్, డైరెక్టరేట్ కార్యాలయం నుంచి జిల్లావిద్యాశాఖకు అందిన లేఖ కూడా ఫోర్జరీదేనని తెలుస్తోంది. సాక్షి, నల్లగొండ : ఓపెన్ స్కూల్స్ జిల్లా కో ఆర్డినేటర్‌గా కొనసాగేందుకు ఏకంగా రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సంతకాన్ని ఫోర్జరీ చేసి సృష్టించిన నకిలీ రికమెండేషన్ లేఖ వ్యవహారం జిల్లాలో చర్చనీయాంశమైంది. ఈ వ్యవహారంపై శుక్రవారం ‘సాక్షి’ మినీలో ప్రచురించిన ‘పోస్టింగ్ కోసం .. ఫోర్జరీ’ ప్రత్యేక కథనం సంచలనం రేపింది. జిల్లా ఉన్నతాధికారులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. రావులపెంట జెడ్పీ హైస్కూల్ ప్రధానోపాధ్యాయురాలు ఎం.మంగళను ఓపెన్స్ స్కూల్స్ కో ఆర్డినేటర్ పోస్టులో కొనసాగించేందుకు అధికారికంగా జరిగిన ‘కరస్పాండెన్సు’కు సంబంధించిన ఫైళ్లను కలెక్టర్ డాక్టర్ గౌరవ్ ఉప్పల్ తెప్పించుకున్నారు. జిల్లా విద్యాశాఖ అధికారిని పిలిపించి మాట్లాడాలని కలెక్టర్ ప్రయత్నించినా, కోర్టు కేసు విషయంలో డీఈఓ సరోజీనిదేవి హైదరాబాద్ వెళ్లడంతో కుదరలేదు. అదే మాదిరిగా, స్థానిక వన్ టౌన్ సీఐ సురేష్ సైతం డీఈఓ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు తీసుకోవడానికి ప్రయత్నించినా, డీఈఓ లేని కారణంగా వీలుపడలేదు. జిల్లా నిఘా విభాగం అధికారులు సైతం మంత్రి కేటీఆర్ సంతకం ఫోర్జరీ వ్యవహారంపై పూర్తి వివరాలు సేకరించే పనిలో పడ్డారు. పరీక్షల నిర్వహణలో అవినీతి..? మరోవైపు జిల్లా ఓపెన్ స్కూల్స్ నిర్వహణతోపాటు, పరీక్షల నిర్వహణలో కూడా పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి. పరీక్షల సమయంలో ఒక్కో విద్యార్థి నుంచి కనీసం రూ. వెయ్యి చొప్పున వసూలు చేశారని చెబుతున్నారు. ఈ వ్యవహారంలో ఓపెన్స్ స్కూల్స్ సొసైటీ అధికారులతో పాటు, జిల్లా విద్యాశాఖ అధికారులకూ ప్రమేయం ఉందని ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో విచారణ జరి పితే మరిన్ని నిజాలు బయట పడతాయని జిల్లా ఉన్నతాధికారులను కోరారు. సస్పెండ్ చేయాలి : డీటీఎఫ్ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సంతకాన్ని ఫోర్జరీ చేసిన ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ మంగళను సస్పెండ్ చేయాలని డెమోక్రటిక్ టీచర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఎండీ ఖుర్షీద్‌మియా, ప్రధాన కార్యదర్శి వెంకులు, ఉపాధ్యక్షుడు వెంకటేశ్వర్లు, అడ్‌హక్ కమిటీ కన్వీనర్ కె.వీరయ్య శుక్రవారం ప్రకటనలో కోరారు. విద్యాశాఖ కార్యాలయం అవినీతి అక్రమాలకు నిలయమైందని, అక్రమ డిప్యుటేషన్లు ఇస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని వీటిపై కూడా విచారణ చేసి రద్దు చేయాలని డిమాండ్ చేశారు. డీఈఓపై చర్యలు తీసుకోవాలి : ఎస్ఎఫ్ఐ ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ పోస్టింగ్ విషయంలో మంత్రి కేటీఆర్ సంతకాన్ని ఫోర్జరీ చేసి రికమెండేషన్ లెటర్ సృష్టించిన మంగళపై చర్యలు తీసుకోవడంతో పాటు ఆ లేఖను సరైన విధంగా పరిశీలించని విద్యాశాఖాధికారిపై కూడా చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లం మహేశ్ అధికారులను ఒక ప్రకటనలో కోరారు. -
మోగిన ఉప ఎన్నిక నగారా !
సాక్షి,సూర్యాపేట : జిల్లాలోని హుజూర్నగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది. హుజూర్నగర్ నియోజకవర్గానికి సాధారణ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎన్నికైన టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తదుపరి జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో నల్లగొం డ అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందారు. ఆ తర్వా త ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఈ స్థానానికి ఉప ఎన్ని అనివార్యమైంది. కేంద్ర ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికలకు శని వారం షెడ్యూల్ విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా 64 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగనుండగా తెలంగాణలో ఏకైక స్థానం హుజూర్‌నగర్‌కు ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో సిట్టింగ్ స్థానం మళ్లీ దక్కించుకోవాలని కాంగ్రెస్, గులాబీ జెండా ఎగురవేయాలని టీఆర్ఎస్ పావులు కదుపుతున్నాయి. గతంలో ఈ స్థానం నుంచి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విజయం సాధించారు. ఆ తర్వాత ఆయన ఎంపీగా పోటీ చేసి ఈ నియోజకవర్గం నుంచి 11 వేల ఓట్లపై చిలుకు మెజార్టీ సాధించారు. ఉప ఎన్నికల్లో ఆయన సతీమణి పద్మావతిని బరిలోకి దింపారు. కాగా, అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తమ్‌పై శానంపూడి సైదిరెడ్డి ఈ స్థానంలో పోటీచేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. మళ్లీ అయన్నే అభ్యర్థిగా ముఖ్య మంత్రి కేసీఆర్ ఖరారు చేశారు. దీంతో వచ్చే నెల 21న నియోజకవర్గ ఓటర్లు ఎవరికి పట్టం కడతారోనని రాష్ట్ర మొత్తం ఈ నియోజకవర్గం వైపే చూస్తోంది. ఈ ఎన్నిక ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, కాంగ్రెస్‌కు బిగ్ ఫైట్‌గా మారింది. షెడ్యూల్ ఇలా.. ఈనెల 23న ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల కానుంది. అదే రోజు నుంచి నామినేషన్‌ను స్వీకరించనున్నారు.అక్టోబర్ 1న నామినేషన్ల పరిశీలన, అక్టోబర్ 3 వరకు ఉపసంహరణ జరగనుంది. అక్టోబర్ 21న పోలింగ్ నిర్వహించి.. 24వ తేదీన కౌంటింగ్ ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. నోటిఫికేషన్లో నామినేషన్ల ఉపసంహరణ, ఎన్నికల నియామవళికి సంబంధించిన అంశాలన్ని వివరంగా పేర్కొననున్నారు. షెడ్యూల్ రావడంతో జిల్లా వ్యాప్తంగా అన్ని రాజకీయ పక్షాల్లో పొలిటికల్ హీట్ పెరిగింది. కాంగ్రెస్, టీఆర్ఎస్ అభ్యర్థులును ప్రకటించడంతో ఈ స్థానంలో పోటీ చేసే ందుకు బీజేపీ, వామపక్షాలు కూడా సై అంటున్నాయి. మూడు, నాలుగు రోజుల్లో తమ అ భ్యర్థులను ఆపార్టీలు ప్రకటించే అవకాశం ఉంది. కాంగ్రెస్ అభ్యర్థిగా పద్మావతి హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా కోదాడ మాజీ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతిని ఆపార్టీ ఇప్పటికే ప్రకటించింది. గతంలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కోదాడ నియోజకవర్గం నుంచి 1999, 2004లో, హుజూర్నగర్ నుంచి 2009, 2014, 2018లో మొత్తం ఐదు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలు పొందారు. 2018 డిసెంబర్లో జరిగిన సాధారణ ఎన్నికల్లో ఉత్తమ్ 7 వేల పైచిలుకు ఓట్ల మె జార్టీతో టీఆర్ఎస్పై గెలుపొందారు. అదేవిధంగా ఆయన ఎంపీగా పోటీ చేసి విజయం సాధించడంలో ఈ నియోజకవర్గంలో వచ్చిన ఓట్ల మెజార్టీనే కీలకమైంది. 11 వేల పైగా ఓట్ల మెజార్టీ ఈ నియోజకవర్గంలో ఆయనకు దక్కిం ది. అటు అసెంబ్లీ, ఇటు పార్లమెంట్ ఎన్నికల్లో నియోజకవర్గ ఓటర్లు తమ వైపే ఉన్నారని ఖ చ్చితంగా ఉప ఎన్నికల్లో తమ అభ్యర్థే విజయం సాధిస్తుందనే ధీమాతో కాంగ్రెస్ ఉంది. టీఆర్ఎస్ అభ్యర్థిగా శానంపూడి.. గత అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలైన టీఆర్ఎస్ ఈసారి ఎలాగైనా విజయం సాధించాలనే భావనతో గతంలో ఓటమి పొందిన శానంపూడి సైదిరెడ్డికే మరో అవకాశం కల్పించారు. ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలైన కొద్ది గంటల్లోనే ఆయన్ను పార్టీ అభ్యర్థిగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. షెడ్యూల్ విడుదలైన వెంటనే సీఎం ఉమ్మడి జిల్లా ముఖ్య నేతలతో సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల జోరుగా పార్టీలో చేరికలు జరిగాయని, ఈ సారి విజయం తమదేనని టీఆర్ఎస్ ధీమా వ్యక్తంచేస్తోంది. విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి హైదరాబాద్‌లో మాట్లాడుతూ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించుకొని జిల్లాలో క్లీన్‌స్వీప్ చేయడం తథ్యమన్నారు. సైదిరెడ్డిని అభ్యర్థిగా ప్రకటించడం, ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో టీఆర్ఎస్ శ్రేణులు బాణా సంచా కాల్చి ఆనందం వ్యక్తం చేశాయి. నేటి నుంచి ఎన్నికల కోడ్ అమలు.. షెడ్యూల్ విడుదల కావడంతో సూర్యాపేట జిల్లావ్యాప్తంగా నేటినుంచి ఎన్నికల కోడ్ అమలులోకి రానున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌కుమార్ ప్రకటించారు. ఈనెల 23న నోటిఫికేషన్ విడుదల కానుండడంతో నేటి నుంచే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి రానున్నట్లు తెలిపారు. 2019 జనవరి 1 నాటికి ఓటర్లజాబితా ప్రకారం ఉప ఎన్నికలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఉప ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో మంత్రులు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనరాదని, జిల్లా వ్యాప్తంగా ఉద్యోగుల బదిలీలు చేపట్టరాదని తెలిపారు. హుజూర్నగర్ ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతంలో ఉన్నందున పటిష్ట బందోబస్తు చర్యలు చేపడతామని, మద్యం, డబ్బు సరఫరాపై నిఘా ఉంచనున్నామని తెలిపారు. సి విజిల్ యాప్ ద్వారా ఎన్నికల నియమావళి ఉల్లంఘనపై ఫిర్యాదు చేయవచ్చన్నారు. హుజూర్నగర్ నియోజకవర్గ ఓటర్లు.. హుజూర్నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా గత ఎన్నికల్లో 302 పోలింగ్ కేంద్రాలు కేటాయించారు. నియోజకవర్గంలో 2లక్షల 35వేల 308 మంది ఓటర్లుండగా లక్ష 15వేల 626 మంది పురుషులు, లక్ష 19వేల 682 మంది స్త్రీలున్నారు -
గుట్టల వరదతో ‘నీలగిరి’కి ముప్పు!
నల్లగొండ టూటౌన్ : నీలగిరి పట్టణం రోజురోజుకూ భారీగా విస్తరిస్తోంది. అందుకు తగ్గట్టు వసతులు లేకపోవడంతో భారీ వర్షాలు వచ్చిన ప్రతిసారీ నష్టం చవిచూడాల్సి వస్తోంది. గతంలోనే కురిసిన భారీ వర్షాలకు నీలగిరి పట్టణం అతలాకుతలమైన విషయం తెలిసిందే. అప్పుడు మూడు నాలుగు రోజులు భారీ వర్షాలు పడడంతో పట్టణంలోని రోడ్లన్నీ నదులను తలపించాయి. ఏ రోడ్డు చూసినా మోకాల్లోతుపైనే వరద నీరు పారిన విషయం ఇంకా అందరి కళ్లలో మెలుగుతూనే ఉంది. నీలగిరి పట్టణాన్ని వరదలు ముంచెత్తటానికి ప్రధాన కారణం పట్టణంలో ఉన్న రెండు గుట్టలు. కుండపోతగా వర్షం వచ్చినా, మూడు నాలుగు రోజులు వర్షాలు పడినా గుట్టలపై నుంచి వరద నీరు భారీగా పట్టణంలోకి చేరుతోంది. ఇళ్లల్లోకి నీరు పోవడం, సీసీ రోడ్లు, డ్రెయినేజీ కాల్వలు, మట్టి రోడ్లు కోతకు గురవడం లాంటి సంఘటనలతో భారీ నష్టం వాటిల్లుతోంది. భారీ వర్షాలు కురిసిన ప్రతిసారీ ప్రజా ప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారులు పట్టణంలో పర్యటించడం, స్థానిక నాయకులను, అధికారులను వివరాలు అడిగి తెలుసుకోవడంతోనే సరి పుచ్చుతున్నారనే విమర్శలు లేకపోలేదు. పట్టణంలో ఉన్న లతీఫ్ సాహెబ్ గుట్ట, కాపురాల గుట్టల చుట్టూ పెద్ద కాల్వలు నిర్మించి వరద నీరు చెరువులకు, కుంటలకు మళ్లించాలనే ప్రతిపాదనలు ఉన్నా అమలుకు నోచుకోవడం లేదు. 2013లోనే తెరపైకి కాల్వల నిర్మాణం 2013 సెప్టెంబర్ నెలలో కురిసిన భారీ వర్షాలకు నీలగిరి పట్టణం దాదాపు నీట మునిగినంత పని అయింది. ద్విచక్ర వాహనాలు, కార్లు సైతం వరద ప్రవాహానికి కొట్టుకుపోయాయి. అప్పుడు పట్టణంలో ప్రభుత్వ ఆస్తులే దాదాపు రూ.20కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు మున్సిపల్ యంత్రాంగం అంచనా వేసింది. కాపురాల గుట్ట, లతీఫ్ సాహెబ్ గుట్టల చుట్టూ వరద కాల్వలు నిర్మించాలని అప్పటి కలెక్టర్‌కు, ప్రజా ప్రతినిధులకు స్థానిక ప్రజా ప్రతినిధులు ప్రతిపాదించారు. తప్పనిసరిగా నిధులు మంజూరు చేయించి రెండేళ్ల కాలంలోనే కాల్వల నిర్మాణం చేపడుతామని అప్పట్లో హామీలు సైతం ఇచ్చారు. ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా పంపుతున్నట్లు చెప్పారు. ఆ తరువాత ఏమైందో కానీ నేటికీ దాని గురించి పట్టించున్న వారే లేరు. మూడు నాలాలకు నిధులు మంజూరు రెండు గుట్టలనుంచి వర్షపు వరద నీటిని మళ్లించడానికి మూడు నాలాల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. త్వరలోనే టెక్నికల్ ప్రక్రియ పూర్తి చేసి టెండర్ల పిలవడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. లతీఫ్ సాహెబ్ గుట్ట నుంచి వీటీ కాలనీ మీదుగా బక్కతాయి కుంట వరకు రూ. 5 కోట్లతో, మోతికుంట నుంచి పాతబస్తీ చౌరస్తా వరకు రూ.6.30 కోట్లతో, కాపురాల గుట్టనుంచి గంధంవారిగూడెం చెరువు వరకు రూ. 6 కోట్లతో నాలాలు నిర్మించాలని నిర్ణయించగా నిధులు విడుదల అయ్యాయి. ఈ మూడు నాలాలు నిర్మించినా ఉపయోగం కొంత మేర మాత్రమే ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. అదే గుట్టల చుట్టూ నాలా నిర్మించి ఈ నాలాల ద్వారా వరద నీటిని పంపిస్తే శాశ్వత పరిష్కారం లభించనుంది. గుట్టల చుట్టూ నాలాలు నిర్మిస్తే శాశ్వత పరిష్కారం పట్టణంలో ఉన్న రెండు గుట్టలనుంచి వరద నీటిని పంపించడానికి నాలాల నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. తొందరలోనే టెక్నికల్ ప్రక్రియ పూర్తి చేసి టెండర్లు పిలుస్తాం. గుట్టల చుట్టూ నాలా నిర్మించి కొత్తగా నిర్మించే వాటి ద్వారా వరదను మళ్లిస్తే శాశ్వతంగా సమస్య తీరినట్లే. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాను. – కె.వెంకటేశ్వర్లు, ప్రజారోగ్యశాఖ ఈఈ -
నల్లగొండతో సుష్మాస్వరాజ్‌కు అనుబంధం
సాక్షి, నల్లగొండ: గుండెపోటుతో మంగళవారం హఠాన్మరణం చెందిన కేంద్ర మాజీమంత్రి, బీజేపీ సీనియర్ రాయకురాలు సుష్మాస్వరాజ్‌కు నల్లడొండతో విడదీయరాని అనుబంధం ఉంది. తెలంగాణ ఉద్యమ సమయంలో 2011 నవంబర్ 5న బీజేపీ ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఎన్జీ కళాశాల మైదానంలో నిర్వహించిన తెలంగాణ పోరుసభ బహిరంగసభకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. అప్పట్లో ఆమె లోక్‌సభలో ప్రతిపక్ష నాయకురాలి హోదాలో నల్లగొండకు తొలిసారి వచ్చారు. తెలంగాణ ఉద్యమం తీవ్రరూపం దాల్చడం, సుష్మాస్వరాజ్ జాతీయ నాయకురాలు కావడడంతో ఆమెను కలుసుకోవడానికి జిల్లాకు చెందిన అనేకమంది ప్రముఖులు, మేధావులు, యవత పోటీ పడ్డారు. ఆ సమయంలో నల్లగొండలో బీజేపీ కార్యాలయ నిర్మాణం జరుగుతుండడంతో ఇక్కడికి వచ్చిన ఆమె నేరుగా స్థానిక బీజేపీ నేత బండారు ప్రసాద్ నివాసానికి చేరుకున్నారు. అక్కడ కాసేపు విశ్రాంతి తీసుకున్న తరువాత ఎన్జీ కళాశాల మైదానంలో జరిగే బహిరంగ సభకు హాజరయ్యారు. అంధవిద్యార్థులతో ఆప్యాయంగా.. సుష్మాస్వరాజ్‌కు జ్ఞాపికను అందిస్తున్న డ్వాబ్ కార్యదర్శి చొక్కారావు (ఫైల్) అనంతరం సుష్మాస్వరాజ్.. ప్రస్తుత మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావుతో కలిసి నల్లగొండ పట్టణంలోని డ్వాబ్చే నిర్వహించబడుతున్న అంధుల పాఠశాలను సందర్శించారు. విద్యార్థులతో ముచ్చడించారు. వారితో ఆప్యాయంగా మాట్లాడి వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఆమెతో కలిసి ఫొటోలు దిగారు. అనంతరం ఆమెను డ్వాబ్ ప్రధాన కార్యదర్శి పొనుగోటి చొక్కారావు, పాఠశాల సిబ్బందితో కలిసి సన్మానించి జ్ఞాపికను అందజేశారు. సుష్మాస్వరాజ్ మృతి దేశానికి తీరనిలోటు నల్లగొండ: కేంద్ర మాజీమంత్రి, బీజేపీ సీనియర్ నాయకురాలు సుష్మాస్వరాజ్ హఠాన్మరణం దేశానికి తీరని లోటని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు నూకల నరసింహారెడ్డి అన్నారు. బుధవారం నల్లగొండలోన ?బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ నాయకులు ఆమె చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నూకల నరసింహారెడ్డి మాట్లాడుతూ అతి పిన్న వయసులోనే హరియాణలో శాసనసభకు ఎన్నికై 25వ ఏటనే రాష్ట్రమంత్రిగా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తించారని కొనియాడారు. ఏడుసార్లు ఎంపీగా, మూడు సార్లు శాసనసభ్యురాలిగా ఎన్నికై దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం కోసం పార్లమెంట్లో అనుకూలంగా మాట్లాడి తెలంగాణ ప్రజల్లో చిన్నమ్మగా అందరికి గుర్తుండి పోయారని తెలిపారు. సుష్మాస్వరాజ్ ఆకస్మిక మరణం అందరిని కలిచి వేసిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా, పట్టణ నాయకులు శ్రీరామోజు షణ్ముఖ, బండారు ప్రసాద్, నూకల వెంకట్‌నారాయణరెడ్డి, ఓరుగంటి రాములు, నిమ్మల రాజశేఖర్‌రెడ్డి, కంకణాల నాగిరెడ్డి, భూపతిరాజు, యాదగిరాచారిచ దర్శనం వేణు, గుండగోని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నివాళులు అర్పిస్తున్న బీజేపీ నాయకులు -
అడ్మిన్లూ..జర పైలం!
లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ రావడంతోనే ఉమ్మడి జిల్లాలో రాజకీయ వేడి పెరిగింది. ఇప్పటికే అన్ని పార్టీల ఆశావహులు టికెట్ల కోసం ఎవరి ప్రయత్నం వారు చేసుకుంటున్నారు. రెండు మూడు రోజుల్లో అన్ని పార్టీలూ తమ అభ్యర్థులను ప్రకటించే అవకాశముంది. అభ్యర్థులు కూడా నామినేషన్ల దాఖలు నుంచే ప్రచారంపై పూర్తి దృష్టి పెట్టనున్నారు. ఇదిలా ఉండగా, ఓటర్లను ప్రసన్నం చేసుకునే ట్రెండుల్లో సోషల్ మీడియా పాత్ర నేడు కీలకంగా మారింది. ప్రతీ పార్టీ, అభ్యర్థి సామాజిక మాధ్యమాల ద్వారానే ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. గత ఎన్నికల్లో బీజేపీ విస్తృతంగా సోషల్ మీడియాను వాడుకోవడం కూడా దాని విజయానికి ఓ కారణమని పలు సర్వేలు చెప్పాయి. ఇప్పుడు ఇతర పార్టీలూ ఇదే పంథాలో నడుస్తున్నాయి. ఎన్నికల వేళ అభ్యర్థులు చేసే హామీలు, నాయకులు, కార్యకర్తలు ప్రత్యర్థులపై చేసే విమర్శలు, మార్ఫింగ్ ఫొటోలు, వీడియోల సందడే కనిపిస్తుంటుంది. సాధారణ సమయాల్లో వీటిని ఎవరూ సీరియస్‌గా తీసుకోరు. కానీ, ఎన్నికలప్పుడు అభ్యర్థులు గానీ, పార్టీలు గానీ ఇలాంటి పోస్టులపై అభ్యంతరం వ్యక్తం చేసి, పోలీసులకు ఫిర్యాదు చేస్తే మాత్రం ఆ పోస్టులు పెట్టిన అడ్మిన్లపై చట్టప్రకారం కేసులు నమోదు చేస్తారు. ఎన్నికల వేళ ప్రత్యేకంగా ఎన్నికల సంఘం, పోలీసు అధికారులు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతున్న సందేశాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లోనూ ‘సోషల్ మీడియా’ పలు చోట్ల రచ్చరచ్చ చేసిన ఘటనలూ వెలుగుచూశాయి. ఉమ్మడి జిల్లాలోనూ అభ్యంతరకరమైన పోస్టులపై ఫిర్యాదులు, కేసుల నమోదయ్యాయి. వీటిని దృష్టిలో పెట్టుకుని సామాజిక మాధ్యమాల్లో మెసెజ్‌లు, ఫొటోలు పెట్టడం, షేర్ చేయడంపై తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరముంది. గత ఎన్నికల్లో.. సామాజిక మాధ్యమాల్లో వివిధ పార్టీల కార్యకర్తలు పెడుతున్న సందేశాలు ఈమధ్య చాలానే వివాదాస్పదం అవుతున్నాయి. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు సోషల్ మీడియాలో వివాదాస్పద పెట్టడంతో, ప్రత్యర్థులు వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చిన సందేశాలపై ఎన్నికల సంఘానికి సైతం ఫిర్యాదు సంఘటనలున్నాయి. పార్టీలకు సంబంధం ఉన్న వారితోపాటు పార్టీలకు సంబంధం లేని వారు సైతం కేసుల్లో ఇరుక్కున్న పరిస్థితి గత అసెంబ్లీ ఎన్నికల్లో కనిపించింది. చట్టాలు ఏం చెబుతున్నాయంటే.. సామాజిక మాధ్యమాల్లో ప్రచారాలు ఎక్కువగా సాగుతుండటంతో అధికారులు సైతం ఈ పోస్టులపై ప్రత్యేక దృష్టి సారించారు. కొన్ని గ్రూపుల్లో పోలీసు అధికారులు, సిబ్బంది ఉండి మరీ పరిశీలిస్తున్నారు. ఎవరైననా సైబర్ నిబంధనలకు విరుద్ధంగా పోస్టు పెడితే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకునే అవకాశం కోకొల్లలు. ఇలాంటి చర్యలపై చట్టలు సైతం కఠినంగా ఉన్నాయి. అంతేకాకుండా.. అశ్లీల సమాచారం, ఫొటో మార్ఫింగ్, తప్పుడు సమాచారం, ఇతరుల మనోభావాలు దెబ్బతినేలా పోస్టులు చేస్తే ఇన్ఫర్మేమేషన్ టెక్నాలజీ యాక్ట్–2000 ప్రకారం సెక్షన్ 67 కింద జైలు శిక్షతోపాటు జరిమానా కూడా విధిస్తారు. అదే నేరం రెండోసారి పాల్పడినట్లు గుర్తిస్తే పదేళ్ల జైలుపాటు రూ.2 లక్షల వరకు జరిమానా విధిస్తారు. పోస్టులు పెట్టే అడ్మిన్లతోపాటు వాటిని షేర్ చేసే వారిని కూడా ఒక్కోసారి బాధ్యులను చేసే అవకాశముంది. అడ్మిన్ బాధ్యతలు.. సామాజిక మాధ్యమాల్లో వచ్చే సందేశాలకు చట్ట ప్రకారం ఆయా గ్రూప్‌లకు సంబంధించిన అడ్మిన్లే బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. గ్రూప్‌లో ఉండే ప్రతీ సభ్యుడు కచ్చితంగా అడ్మిన్‌కు తెలిసి ఉండేలా చూసుకోవాలి. అపరిచితులను గ్రూప్‌లో చేర్చుకోవద్దు. ఎవరైనా గ్రూప్ సభ్యులు అభ్యంతరకరంగా ప్రవర్తించినా.. వివాదస్పద పోస్టులు, కామెంట్లు చేసినా.. ఆ సభ్యుడిని వెంటనే తన గ్రూప్ నుంచి తొలగించడం ఉత్తమం. అడ్మిన్‌తోపాటు గ్రూప్‌లోని సభ్యులు వివాదాస్పద పోస్టులు చేస్తే ఐటీ చట్టం కింద కేసులు నమోదు చేస్తారని తెలుసుకోవాలి. ఇవి పెట్టొద్దు.. షేర్ చేయొద్దు.. విద్వేషాలు రెచ్చగొట్టే విషయాలు ∙తప్పుడు సమాచారం, తెలియని అంశాలు మార్ఫింగ్ ఫొటోలు, వీడియోలు ∙ఓ వర్గాన్ని బాధించే కార్టూన్సు -
దమ్ముంటే ఎమ్మెల్యేగా రాజీనామా చేయాలి
నల్లగొండ రూరల్: పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి దమ్ము, ధైర్యం ఉంటే ముందు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయాలని, లేకుంటే ఓటమి అంగీకరించినట్లు ఒప్పుకోవాలని విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి సవాలు చేశారు. శనివారం ఆయన నల్లగొండ జిల్లాకేంద్రంలో జరిగిన టీఆర్ఎస్ నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల సన్నాహక సమావేశంలో మాట్లాడారు. పీసీసీ చీఫ్ దద్దమ్మ అని, చేతకాని వ్యక్తి అని.. అనేకసార్లు కాంగ్రెస్ నాయకులే బాహాటంగా ప్రకటించారని జగదీశ్‌రెడ్డి గుర్తు చేశారు. గత నాలుగున్నరేళ్ల పాలనలో ఏ ఒక్క రాజకీయ నాయకుడిని తాను వ్యక్తిగతంగా విమర్శించలేదన్నారు. నల్లగొండలో ప్రజలు తిరస్కరిస్తే భువనగిరికి పారిపోయిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెల్లని రూపాయి అని, భువనగిరిలో ఆ రూపాయి ఎలా చెల్లుతుందని ప్రశ్నించారు. భువనగిరి ప్రజలు కూడా కోమటిరెడ్డికి తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని మంత్రి అన్నారు. -
సారు.. కారు.. వారి అభ్యర్థులు బేకార్..
సాక్షి, కోదాడ : సారు.. కారు.. పదహారు ఏమోగాని టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు వట్టి బేకార్‌లని, వారిని చిత్తుగా ఓడించాలని టీపీసీసీ అధ్యక్షుడు, నల్లగొండ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్ కుమార్‌రెడ్డి కోరారు. శుక్రవారం కోదాడలోని డేగబాబు ఫంక్షన్ హాలులో నిర్వహించిన కోదాడ నియోజకవర్గ ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. 1994లో ఎమ్మెల్యేగా తన రాజకీయ జీవితాన్ని కోదాడనుంచే ప్రారంభించానని ఐదుసార్లు కోదాడ, హుజూర్‌నగర్‌లలో ఎమ్మెల్యేగా గెలిపించిన ఈ ప్రాంత ప్రజలకు రుణపడి ఉంటానని పేర్కొన్నారు. శుక్రవారం ఎంపీగా నామినేషన్ దాఖలు చేసి తొలిఎన్నికల ప్రచారం కూడా కోదాడ నుంచే ప్రారంభిస్తున్నానని తెలిపారు. టీఆర్ఎస్ అభ్యర్థి భూ కబ్జాదారుడు... నల్లగొండ టీఆర్ఎస్ అభ్యర్థి గతంలో మునుగోడు ఎంపీపీగా పోటీచేసి ఓడిపోయాడని, మునుగోడులో చెల్లని రూపాయి.. నల్లగొండలో ఎలా చెల్లుతుందో వారికే తెలియాలన్నారు. హైదరాబాద్‌లో తాను ఉంటున్న ఇంటి పక్కనే ఐదు ఎకరాలు ఆక్రమించాడని, బ్యాంక్పెట్టి సామాన్యులను మోసం చేశాడని ఆరోపించారు. 16 మంది ఎంపీలను గెలిపిస్తే ఏదో సాధిస్తానని కేసీఆర్ చెపుతున్నాడని కానీ 2014 నుంచి ఒక్క నంది ఎల్లయ్య తప్పా మిగతా ఎంపీలంతా ఆయన పక్కనే ఉన్నారని, అయినాబయ్యారం స్టీలు ప్లాంట్, కాజీపేట కోచ్‌ప్యాక్టరీ సాధించలేక పోయారని, అసలు కేంద్రం నుంచి ఆయన ఏమి సాధించారో చెప్పాలని ప్రశ్నించారు. ఎంపీ ఎన్నికలు రాష్ట్రానికి సంబంధించినవి కావని, కేవలం రాహుల్‌గాంధీ–నరేంద్రమోదీల మధ్య జరుగుతున్న ఎన్నికలని ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. ప్రతి కార్యకర్త రాహూల్‌గాంధీ వలె కష్టపడి పనిచేసి పార్టీని గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో కోదాడ మాజీ ఎమ్మెల్యే ఎన్.పద్మావతి, నాయకులు లక్ష్మీనారాయణరెడ్డి, వంగవీటి రామారావు, పారా సీతయ్య, డేగబాబు, నల్లపాటి శ్రీనివాస్, తెప్పని శ్రీనివాస్, మునావర్, పాలకి అర్జున్, కత్రం నాగేంధర్‌రెడ్డి, బషీర్, బాగ్ధాద్, ఎజాజ్, చల్లా కొండల్‌రెడ్డి, కందుల కోటేశ్వరరావు, ముల్కా వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ముస్లీం యువకులు ఆయనను ఘనంగా సన్మానించారు. -
నెత్తురోడిన రహదారులు
సాక్షి, నార్కట్‌పల్లి (నకిరేకల్) : రహదారులు మరో మారు నెత్తురోడాయి. ఉమ్మడి జిల్లాలోని ఆయా మండలాల పరిధిలో శుక్రవారం చోటు చేసుకున్న వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు దుర్మరణం చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. నార్కట్‌పల్లి, చివ్వెంల, రామన్నపేట, తిప్పర్తి మండలాల్లో చోటు చేసుకున్న ఈ ఘటనల వివరాలు.. నల్లగొండకు చెందిన మందడి సత్యపాల్‌రెడ్డి (30) తన స్నేహితుడి మేడి శ్రీనివాస్ సోదరి గ్రామం కట్టంగూర్ మండలం పామనగుండ్లకు కారులో వెళ్లారు. రాత్రి తిరిగి నల్లగొండకు బయలు దేరారు. అయితే నార్కట్‌పల్లి వద్ద వీరు ఫైఓవర్ దిగకుండా అలాగే ముందుకు వెళ్లారు. వారిజాల వేణుగోపాలస్వామి ఆలయానికి వెళ్లే ఆర్చి వద్ద యూటర్న్ తీసుకుంటుండగా సూర్యాపేట నుంచి హైదరాబాద్ వైపు వెళుతున్న మరో కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సత్యపాల్‌రెడ్డి, శ్రీనివాస్‌కు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను కామినేని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సత్యపాల్‌రెడ్డి మృతిచెందాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ విజయ్‌కుమార్ తెలిపారు. సీటు బెల్ట్ పెట్టుకుని ఉంటే.. కారులో ప్రయాణిస్తున్న సత్యపాల్‌రెడ్డి సీట్ బెల్ట్ పెట్టుకుని ఉంటే మృతిచెందే వాడు కాదని ఘటనాస్థలిని పరిశీలిస్తే అవగతమవుతోంది. శ్రీనివాస్ సీట్ బెల్ట్ పెట్టుకుని డ్రైవింగ్ చేస్తుండడంతో ప్రమాదం జరిగినప్పుడు బెలూన్స్ ఓపెన్ కావడంతో అతడు గాయాలతో బయటపడ్డాడు. ప్రమాదానికి కారణమైన మరో కారులో ప్రయాణిస్తున్న వారు సీటు బెల్ట్ పెట్టుకోవడం వల్ల బెలున్స్ ఓపెన్ కావడంతో స్వల్పగాయాలతో బయటపడినట్టు పోలీసులు తెలిపారు. గుర్తుతెలియని వాహనం ఢీకొని.. చివ్వెంల (సూర్యాపేట) : నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం ఆళ్లగడప గ్రామానికి చెందిన నిమ్మల సోమ య్య (45) తన కుమారుడి పెళ్లి కార్డులు పంచేందుకు కోదాడ వెళ్లి తిరిగి సూర్యాపేటవైపు మోపెడ్‌పై వస్తున్నాడు. మార్గమధ్యలో గుంజలూరు గ్రామ స్టేజి వద్ద విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న గుర్తుతెలియన వాహనం వెనుకనుంచి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో సోమయ్య కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం సూర్యాపేట ఏరియాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మధ్యాహ్నం మృతిచెందినట్లు బంధువులు తెలిపారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బం ధువులకు అప్పగించారు. మృతుడి కుమారుడు నరేశ్ ఫిర్యాదు మేరకు ఎస్ఐ లవకుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కారు – లారీ ఢీ.. ఒకరు.. రామన్నపేట (నకిరేకల్) : నల్లగొండ జిల్లా కేంద్రంలోని నాగార్జునకాలనీకి చెందిన తల్లం నవీన్(33) శుక్రవారం రామన్నపేటలో నివాసం ఉంటున్నతన స్నేహితుడిని కలువడానికి వచ్చాడు. అనంతరం స్నేహితుడి కారు తీసుకుని భువనగిరి వైపు వెళ్తుండగా ఇంద్రపాలనగరం శివారులోని సబ్‌స్టేషన్ సమీపంలో ఎదురుగా వస్తున్న లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నవీన్‌ను 108 వాహనంలో రామన్నపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రథమ చికిత్స అనంతరం అతడిని నార్కట్‌పల్లిలోని కామినేని ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ సాయంత్రం మృతిచెందాడు. మృతుడి బాబాయి ప్రకాష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ సీహెచ్ సాయిలు తెలిపారు. మినీగూడ్స్ బోల్తా ..ఇద్దరు.. తిప్పర్తి (నల్లగొండ) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లురు జిల్లా లింగసముద్రం మండలానికి చెందిన మహేష్‌బాబు(30)మినీ గూడ్స్ డ్రైవర్‌గా,షేక్ నజీర్(35) ఇదే వాహనానికి క్లినర్‌గా పనిచేస్తున్నాడు. సింగరాయకొండ నుంచి కూల్ బాక్స్‌లను లోడ్ చేసుకుని జహీరాబాద్‌లో ఆన్లోడ్ చేసి తిరిగి నెల్లురు వెళ్తున్నారు. మార్గమధ్యలో మండల పరిధిలోని రామలింగాలగూడెం వద్ద ఒక్కసారిగా ముందు టైర్ పగలడంతో అదుపుతప్పి మినీగూడ్స్ డివైడర్ దాటి అటు వైపు నుంచి వస్తున్న లారీని ఢీకొట్టి డివైడర్‌పై పడింది. దీంతో మినీగూడ్స్లో ఉన్న డ్రైవర్, క్లినర్ ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు మృతుల బందువులకు సమాచారం అందజేశారు. మృతదేహాలను నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మధు తెలిపారు. -
అక్కడ గెలిచారు ...! ఇక్కడా గెలిచారు !!
సాక్షి, నల్లగొండ : ఉమ్మడి నల్లగొండ జిల్లాలో జరిగిన వివిధ ఎన్నికల్లో ఎన్నో ఆసక్తికరమైన అంశాలున్నాయి. శాసనసభకు ఎన్నికై ఎమ్మెల్యేలుగా పనిచేసిన వారు.. పార్లమెంట్‌కు ఎన్నికై ఎంపీలుగా కూడా పనిచేశారు. జిల్లాలో ఆ ఘనత ఐదుగురు నాయకులకు దక్కగా బయటి జిల్లాల నుంచి ఇలా ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా గెలిచిన వారు మరో ఇద్దరున్నారు. తెలంగాణ సాయుధపోరాట యోధులు రావినారాయణ రెడ్డి, బొమ్మగాని ధర్మభిక్షం, భీమిరెడ్డి నర్సింహారెడ్డి, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా పనిచేశారు. వడ్డేపల్లి కాశీరాం కూడా మొదట ఎంపీగా, ఆ తర్వాత ఎమ్మెల్యేగా విజయాలు సాధించారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తొలుత ఎంపీగా, ఆ తర్వాత ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా గెలిచారు. అటు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచిన వారే కాకుండా, ఎమ్మెల్యేలుగా విజయాలు సాధించాక, ఎమ్మెల్సీలుగా శాసన మండలి, రాజ్యసభ సభ్యులుగా పార్లమెంటు గడప తొక్కిన వారూ ఉన్నారు. ఇతర జిల్లాల నుంచి నల్లగొండకు వలస వచ్చి దేవరకొండ ఎమ్మెల్యేగా గెలిచిన రవీంద్రనాయక్ వరంగల్ జిల్లాలో ఎంపీగా పనిచేశారు. మిర్యాలగూడెం ఎంపీగా రెండు పర్యాయాలు వరుసగా గెలిచిన ఎస్.జైపాల్‌రెడ్డి మహబూబ్‌నగర్‌లో ఎమ్మెల్యేగా కూడా పలుమార్లు గెలిచారు. వీరే కాకుండా.. ఉప్పునూతల పురుషోత్తంరెడ్డి ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా పనిచేయగా, పాల్వాయి గోవర్ధన్ రెడ్డి ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజకీయ అరంగేట్రం చేసిన 2009 ఎన్నికల్లోనే భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో అదే స్థానంలో ఓడిపోయిన ఆయన స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి శాసన మండలి సభ్యుడిగా విజయం సాధించారు. మరో మూడేళ్ల పదవీ కాలం మిగిలి ఉండగానే రాజీనామా చేసి 2018 శాసన సభ ఎన్నికల్లో మునుగోడు ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టారు. వడ్డేపల్లి కాశీరాం కాంగ్రెస్ టికెట్‌పై వడ్డేపల్లి కాశీరాం నల్లగొండ పార్లమెంట్ స్థానానికి 1960లో జరిగిన ఉప ఎన్నికల్లో విజయం సాధించారు. ఆయన ఆ తర్వాత 1962లో మిర్యాలగూడెం నుంచి పోటీ చేసినా ఓడిపోయారు. కానీ రామన్నపేట అసెంబ్లీ నియోజకవర్గం (రద్దయింది) నుంచి కాశీరాం 1967, 1972 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. బొమ్మగాని ధర్మభిక్షం సాయుధ పోరాట యోధుడు బొమ్మగాని ధర్మభిక్షం సైతం రెండుసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు ఎంపీగా పనిచేశారు. ఆయన నకిరేకల్ నియోజకవర్గం నుంచి 1957 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా, నల్లగొండ నియోజకవర్గం నుంచి 1962 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయాలు సాధించారు. ఆ తర్వాత నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి వరసగా 1991, 1996 లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీగా గెలిచారు. చకిలం శ్రీనివాసరావు నల్లగొండ ఉమ్మడి జిల్లాకు కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేసిన చకిలం శ్రీనివాస్‌రావు మూడుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలిచారు. నల్లగొండ శాసనసభా నియోజకవర్గం నుంచి ఆయన 1967లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 1972 ఎన్నికల్లోనూ ఆయన ఇదే రెండోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తర్వాత నల్లగొండ నుంచి మిర్యాలగూడెం అసెంబ్లీ స్థానం నుంచి 1983 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. 1989 పార్లమెంట్ ఎన్నికల్లో నల్లగొండ లోక్‌సభా స్థానం (పూర్వపు మిర్యాలగూడెం) నుంచి ఎంపీగా విజయం సాధించారు. ఎవరెవరు.. ఎక్కడెక్కడ ? రావినారాయణరెడ్డి సాయుధపోరాటయోధుడు రావినారాయణరెడ్డి 1952 ఎన్నికల్లో ఎంపీగా అత్యధిక మెజార్టీ సాధించి పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించిన ఘనతను సొంతం చేసుకున్నారు. ఆ ఎన్నికల్లో ఆయన ఎంపీగా, ఎమ్మెల్యేగా రెండు పదవులకు పోటీచేసి రెండు చోట్లా గెలిచారు. అయితే ఆ తర్వాత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎంపీగా కొనసాగారు. ఆయన 1957 ఎమ్మెల్యేగా, 1962లో రెండోసారి ఎంపీగా విజయాలు నమోదు చేసుకున్నారు. భీమిరెడ్డి నర్సింహారెడ్డి సాయుధపోరాట సేనాని భీమిరెడ్డి నర్సింహారెడ్డి శాసన సభ, లోక్‌సభ ఎన్నికల్లో విజయాలు నమోదు చేసుకున్నారు. ఆయన తుంగతుర్తి నియోజకవర్గం నుంచి 1967లో తొలి సారి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టారు. ఆ తర్వాత మిర్యాలగూడెం పార్లమెంట్ నియోజకవర్గం (2009 ఎన్నికల నుంచి రద్దు అయింది) సీపీఎం అభ్యర్థిగా 1971, 1984, 1991 ఎన్నికల్లో గెలిచి మూడుసార్లు ఎంపీగా గెలిచిన నేతగా రికార్డు నెలకొల్పారు. -
నల్లగొండ సీపీఎం ఎంపీ అభ్యర్థిగా మల్లు లక్ష్మి
సాక్షి, నల్లగొండ టౌన్ : నల్లగొండ పార్లమెంట్ సీపీఎం అభ్యర్థిగా మల్లు లక్ష్మి పేరును ఖరారు చేశారు. బీఏ ఎల్ఎల్బీ పూర్తి చేసిన ఆమె తెలంగాణ సాయుధపోరాట యోధులు మల్లు స్వరాజ్యం, మల్లు వెంకటనర్సింహారెడ్డి కోడలు. 1992 సంవత్సరంలో ఆమె ఐద్వా సభ్యురాలిగా చేరి మహిళల సమస్యలపై అనేక ఉద్యమాలను నిర్వహించారు. సూర్యాపేట మండలం రాయినిగూడెం సర్పంచ్‌గా పనిచేశారు. ఐద్వాలో జిల్లా కార్యదర్శిగా ఆల్ ఇండియా కమిటీ సభ్యురాలిగా పనిచేసి 2014 సీపీఎం జిల్లా కమిటీ సభ్యురాలిగా నియామకమయ్యారు. ప్రస్తుతం ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మల్లు లక్ష్మి పనిచేస్తున్నారు. మల్లు లక్ష్మి ఈనెల 25న తన నామినేషన్‌ను దాఖలు చేయనున్నట్లు సమాచారం. -
రాజస్థాన్ టు నల్లగొండ
సాక్షి, నల్లగొండ టౌన్ : రాజస్థాన్ రాష్ట్ర నుంచి నల్లగొండ పట్టణానికి ఉపాధి కోసం వచ్చి యవకులు డిజిల్ ఇంజన్‌తో తయారు చేయించిన మొబైల్ చెరుకు బండ్లతో స్వయం ఉపాధి పొందుతున్నారు. రూ.50వేల పెట్టుబడితో సొంతంగా డిజిల్ మొబైల్ చెరుకు బండ్లను తయారు చేయించుకున్న యువకులు ప్రతి రోజు సుమారు రూ.3 వేల వరకు సంపాదిస్తున్నారు. ఖర్చులు పోను ప్రతి రోజు రెండు వేల వరకు సంపాదిస్తున్నారు,. వేసవికాలం సీజన్ ముగిసేంత వరకు వ్యాపారాన్ని కొనసాగిస్తూ తరువాత ఇతర సీజన్ వ్యాపారాలను చేసుకుంటున్నారు. సంపాదించిన డబ్బులను వారి స్వగ్రామాల్లో ఉన్న కుటుంబ సభ్యులకు పంపిస్తూ వారికి కుటుంబాలకు ఆసరగా నిలుస్తున్న రాజస్థాన్ యువత ఆదర్శంగా తీసుకోవాలి. మంచి ఉపాధి పొందుతున్నాం.. నల్లగొండ పట్టణంలో మొబైల్ చెరుకు రసం బండ్లతో మంచి ఉపాధిని పొందుతున్నాము. వ్యాపారం బాగానే సాగుతోంది. ఈ సీజన్ ముగియగానే మరో సీజన్ వ్యాపారం చేస్తాం. నెలనెల సంపాదించిన డబ్బులను కొంత ఇంటికి పంపిస్తాం. వ్యాపారం బాగా ఉంది. – గోపాల్, రాజస్తాన్ -
పరీక్ష సరిగా రాయలేదని బ్లేడ్‌తో..
-
ట్విస్ట్ : పరీక్ష సరిగా రాయలేదని బ్లేడ్‌తో...
సాక్షి, నల్గొండ : ‘ఇంటర్ విద్యార్థి గొంతుకోసిన దుండగులు..!’ ఘటనలో కొత్త విషయం వెలుగు చూసింది. పరీక్ష సరిగా రాయకపోవడంతో తీవ్ర మనోవేదనకు గురైన తరుణ్ తనకు తానే బ్లేడ్‌తో కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు తెలిసింది. ఈ విషయాన్ని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడే స్వయంగా వెల్లడించాడు. నల్గొండ పట్టణంలోని పాలిటెక్నిక్ కలశాల సోమవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. సూర్యాపేట జిల్లా కసారాబాద్‌కు చెదిన తరుణ్ స్థానిక ప్రగతి కలశాలలో ఇంటర్ సెకండియర్ చదువుతున్నాడు. సోమవారం పరీక్ష రాసిన అనంతరం స్నేహితుడని ఇంటికి వెళ్ళొస్తానని చెప్పిన విద్యార్థి హాస్టల్ నుంచి బయటికి వచ్చాడు. పరీక్ష సరిగా రాయకపోవడంతో ఇంటికి వెళ్తే తిడతారనే భయంతో ఆత్మహత్యాయత్నం చేశాడు. గొంతు, చేయి, మర్మాంగాలను కోసుకుని స్పృహ తప్పి రాత్రంతా అక్కడే పడి ఉన్నాడు. ఉదయం వాకింగ్‌కు వెళ్లిన స్థానికులు ఈ విషయాన్ని పోలీసులకు, అతని తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ప్రస్తుతం తరుణ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. -
ఇంటర్ విద్యార్థి గొంతుకోసిన దుండగులు..!
-
ఇంటర్ విద్యార్థి గొంతుకోసిన దుండగులు..!
సాక్షి, నల్గొండ : పట్టణంలోని పాలిటెక్నిక్ కలశాల వద్ద ఓ ఇంటర్మీడియట్ విద్యార్థిపై దుండగులు బ్లేడ్‌తో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. అతని గొంతు కోసి పరారయ్యారు. సోమవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. బాధిత విద్యార్థిని మాచర్ల తరుణ్ కుమార్‌గా గుర్తించారు. తీవ్రంగా గాయపడడంతో తరుణ్ రాత్రంతా అక్కడే పడి ఉన్నాడు. ఉదయం వాకింగ్‌కు వెళ్లిన స్థానికులు ఈ విషయాన్ని పోలీసులకు, అతని తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ప్రస్తుతం తరుణ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. సూర్యాపేట జిల్లా కసారాబాద్‌కు చెదిన తరుణ్ స్థానిక ప్రగతి కలశాలలో ఇంటర్ సెకండియర్ చదువుతున్నాడు. సోమవారం పరీక్ష రాసిన అనంతరం స్నేహితుడని ఇంటికి వెళ్ళొస్తానని చెప్పిన విద్యార్థి హాస్టల్ నుంచి బయటికి వచ్చినట్టు సమాచారం. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలు పెట్టామని పోలీసులు తెలిపారు.